హైదరాబాద్: గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. స్వంత ఇల్లు మాదిరిగా పేదల ఆత్మగౌరవ ప్రతీకల నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు. సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కెసిఆర్ నగర్‌లో ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి, కొత్త బట్టలతో గృహ ప్రవేశాలు చేయిస్తున్నామన్నారు. పక్కా ఇండ్లను పది కాలాల పాటు కాపాడుకోవాల్సిన బాధ్యతల లబ్ధిదారులదే అని అన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కమిటీలుగా ఏర్పడి కామన్ ఏరియా పరిశుభ్రం వసతుల నిర్వహణ చూసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో స్వంత జాగా ఉన్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. పేద ప్రజల కోసం వారం రోజుల్లో రూ. 2 కోట్ల 50 లక్షలతో 57 రకాల పరీక్షలు చేసే సౌకర్యంతో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. నెల రోజుల్లో రూ. 2 కోట్ల 52 లక్షలతో స్కాన్ ఏర్పాటు చేశామని హరీష్ రావు పేర్కొన్నారు. 20 బెడ్ల సామర్థం గల ఐసియూను 40 పడకలకు పెంచామని తెలియజేశారు. డయాలసిస్ సెంటర్‌లో పడకల సంఖ్యను పెంచుతామన్నారు. అల్ట్రాసౌండ్ మిషన్, 2డి ఎకో సెంటర్‌ను త్వరలో ప్రారంభిస్తామన్నారు.