Monday, December 23, 2024

సింగరేణి కార్మికులకు డబుల్ ధమాకా

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి: సింగరేణి కార్మికులు ఎప్పటి నుండో వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. వారి కల నేరవేరనుంది. ఇప్పటి వరకు సింగరేణి ఏరియాల్లో ఉన్న అన్నింటి కన్నా భిన్నంగా భూపాలపల్లి ఏరియాలో సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం అయ్యాయి. రా్రష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో సింగరేణి కార్మికులకు ఆమోదయోగ్యమైన వసతి గృహాలు అందనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత సింగరేణి కార్మికుల అభివృద్ది, సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దాంట్లో భాగంగానే సింగరేణి కార్మికుల కోసం డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించనున్నది.
229 కోట్లతో వెయ్యి క్వార్టర్ల నిర్మాణం..
సింగరేణి కార్మికుల వసతి గృహాల కోసం 229 కోట్ల వ్యయంతో 2020 ఆగష్టు 7న మంజూర్‌నగర్ ఏరియాలో వెయ్యి డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది సింగరేణి. 45 ఎకరాల్లో 994 క్వార్టర్ల నిర్మాణం కోసం ప్రయివేట్ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. 90 శాతం నిర్మాణ పనులు పూర్తి అయి అందుబాటులోకి వచ్చాయి అని సింగరేణి అధికారులు చెబుతున్నారు. నేడు మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా సింగరేణి కార్మికులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను అందించనున్నారు. ఇప్పటికే ఏరియాలో 3747 క్వార్టర్లు అందుబాటులో ఉండగా మరో వెయ్యి క్వార్టర్లు అందుబాటులోకి రావడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి ఏరియాలో నాలుగు భూగర్భ గనులు, రెండు ఓపెన్ కాస్టు ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో 5565 మంది కార్మికులు పని చేస్తున్నారు. అయితే కార్మికుల వసతి సంక్షేమం కోసం వారికి క్వార్టర్ల నిర్మాణం చేసి వారికి అందుబాటులోకి తెచ్చింది.
నేడు మంత్రి కెటిఆర్ రాక
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం రానున్నారు. ఒక రోజు పర్యటన నిమిత్తం వస్తున్న ఆయనకు ఘనంగా స్వాగతించేందుకు అధికార పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. నగరం ఇప్పటికే గులాబిమయమైంది. మరోవైపు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు సైతం ఉండడంతో అధికార యంత్రాంగం ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది. భాస్కర్‌గడ్డలో నిరుపేదల కోసం నిర్మించిన 994 డబుల్‌బెడ్రూం ఇండ్లను కెటిఆర్ ప్రారంభించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి భారీగా ఏర్పాట్లు చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు సైతం రామన్న రాక నేపథ్యంలో ఘనంగా వెల్‌కమ్ చెప్పేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
గులాబిమయంగా మారిన భూపాలపల్లి
భూపాలపల్లి నగరం గులాబీమయమైంది. నగరానికి బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వస్తున్నందున భారీగా స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూడలిలో బిఆర్‌ఎస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రధాన రహదారులతో పాటు చౌరస్తలన్ని గులాబిమయం కావడంతో నగరమంతా కొంగొత్తగా కనిపిస్తుంది. భూపాలపల్లి శివారు ప్రాంతాల నుండి మొదలు జిల్లా వరకు ఘనంగా స్వాగత తోరణాలు పరుచుకున్నారు. డివైడర్ల మీదుగా గులాబీ జెండాలను సైతం అలంకరించారు. మంత్రి కెటిఆర్ పర్యటించే దారులన్ని బిఆర్‌ఎస్ జెండాలతో కళకళలాడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News