ఆగ్రాలక్నో ఎక్స్‌ప్రెస్‌వేపైన బుధవారం తెల్లవారుజామున ఢిల్లీకి వెళుతున్న ఒక డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు ఒక పాల ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో 18 మంది మరణించగా మరో 19 మంది గాయపడ్డారు. బెహతా ముఝావర్ పోలీసు స్టేషన్ పరిధిలోని జోజికోట్ గ్రామ సమీపంలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బీహార్‌లోని మోతీహారి నుంచి ఢిల్లీ వెళుతున్న స్లీపర్ బస్సు మితిమీరిన వేగంతో ముందు వెళుతున్న పాల ట్యాంకర్‌ను ఢీకొన్నట్లు కనపడుతోందని జిల్లా మెజిస్ట్రేట్ గౌరంగ్ రతి తెలిపారు. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా 19 మంది గాయపడ్డారని, ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు. స్వల్పంగా గాయపడిన 20 మందిని వేరే బస్సులో ఢిల్లీకి పంపించినట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలో 14 మంది పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి మరణించారని అదనపు డిజిపి(లక్నో) ఎస్‌బి శీరద్‌కర్ తెలిపారు.
ఈ ఘటనలో పాల ట్యాంకర్, స్లీపర్ బస్సు రెండూ బోల్తాపడ్డాయని, రెండు వాహనాల డ్రైవర్లు మరణించారని బంగర్‌మావ్ సర్కిల్ ఆఫీసర్ అరవింద్ కుమార్ చెప్పారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు మృతులలో 14 మందిని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలియచేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున సహాయాన్ని ఆయన ప్రకటించారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నావ్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపాన్ని ప్రకటించారు.
సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఉన్నావ్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. ఘటన జరిగిన సమయంలో హైవే పోలీసులు ఎక్కడ ఉన్నారని, పెట్రోలింగ్ సక్రమంగా జజరుగోందా, ప్రమాదం జరిగిన తర్వాత అక్కడకు రావడానికి హైవే ఆంబులెన్సుకు ఎంత సమయం పడుతుంది వంలి ప్రశ్నలను ఆయన ప్రభుత్వానికి వేశారు. ఎక్స్‌ప్రెస్‌వేపైన కోట్లాది రూపాయలను టోల్ పేరుతో వసూలు చేస్తున్నారని, ఎక్స్‌ప్రెస్‌వే నిర్వహణ కోసం కాకుండా ఈ ధనాన్ని వేరే ఎక్కడికైనా పంపిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.