డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో అనర్థమే
యుపిలో ‘జంగిల్ రాజ్’ గ్యారంటీ
‘అసత్యాల వ్యాపారానికి’ శాంతి భద్రతల పరిస్థితి పెద్ద ఉదాహరణ
రాహుల్ గాంధీ విమర్శ
యుపి పరిస్థితిపై కాంగ్రెస్ కార్యకర్తల నిరసన
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వాస్తవం ఏమిటంటే అది ‘జంగిల్ రాజ్’ గ్యారంటీ కావడమే అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం విమర్శించారు. యుపిలో శాంతి భద్రతల పరిస్థితిపై పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్త నిరసన ప్రదర్శనలు నిర్వహించగలరని రాహుల్ ప్రకటించారు. ‘భారతీయ జనతా పార్టీ (బిజెపి), మోడీ మీడియా ‘అసత్యాల వ్యాపారానికి’ ఒడిగడుతున్న తీరుకు ఉత్తర ప్రదేశ్ శాంతి భద్రతల పరిస్థితి పెద్ద ఉదాహరణ’ అని రాహుల్ ‘ఎక్స్‌లో హిందీ పోస్ట్‌లో ఆరోపించారు.
మహిళలపై ఇటీవల సాగుతున్న నేరాల కేసులను రాహుల్ ప్రధానంగా ప్రస్తావిస్తూ, మైనర్ సోదరీమణలు మృతదేహాలు కొన్ని చోట చెట్లకు వేలాడుతున్నాయని తెలియజేశారు. ‘ఐఐటి బిహెచ్‌యు క్యాంపస్‌లో బిజెపి సభ్యుల దౌర్జన్య పరాకాష్టకు నిదర్శనం సామూహిక అత్యాచారం, వేరొక చోట ఒక మహిళా న్యాయమూర్తి న్యాయం చేకూరనందుకు ఆత్మహత్య చేసుకోవలసి వచ్చింది’ అని ఆయన ఆరోపించారు. ‘శాంతి భద్రత పరిస్థితి గురించి అదే పనిగా ప్రశంసలు చోటు చేసుకుంటున్న రాష్ట్రంలో ఇదీ పరిస్థితి’ అని రాహుల్ విమర్శించారు.
రాంపూర్‌లో పదవ తరగతి పరీక్షలు రాసి తిరిగి వచ్చిన అనంతరం ఒక దళిత విద్యార్థి ఇటీవల హత్యకు గురైన ఉదంతాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ‘మోడీ మీడియా సృష్టించిన బోగస్ ప్రతిష్ఠ ప్రభావం నుంచి బయలకు వచ్చి, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ‘జంగిల్ రాజ్‌కు గ్యారంటీ’ అయిన వాస్తవాన్ని చూడవలసిన సమయం ఇది’ అని ఆయన సూచించారు. ‘బిజెపి విధానానికి, ఈ నేరస్థుల కూటమికి వ్యతిరేకంగా ప్రతి జిల్లాలోను, ప్రతి తహసీల్‌లోను నిరసన ప్రదర్శనల ద్వారా ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కార్యకర్తలు తమ వాణి వినిపిస్తారు’ అని రాహుల్ ప్రకటించారు.