Sunday, February 9, 2025

ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్

- Advertisement -
- Advertisement -

ఈ గెలుపుతో దక్షిణాదిలో బిజెపికి కొత్త ఊపు
: ఢిల్లీ గెలుపుపై స్పందించిన కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని గద్దె దింపి, బిజెపిని గెలిపించుకోవడం వల్ల ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ గెలుపు ప్రధాని మోడీ సారధ్యంలో సాకారమైందని అన్నారు. దేశ రాజధానిలో సాధించిన ఈ విజయంతో దక్షిణ భారత దేశంలో బీజేపీకి కొత్త ఊపు వస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీ ఫలితాలపై కిషన్ రెడ్డి శనివారం స్పందించారు. బీజేపీకి అద్భుతమైన విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని, వారిని అవమానిస్తోందని విమర్శించారు. బీసీల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆయన అన్నారు. ఢిల్లీలో బిజెపి విజయంతో ఇటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా బిజెపి తన హవా చాటుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాకుండా శాసనమండలి ఎన్నికల్లో కూడా బిజెపి మూడు స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఢిల్లీ ప్రజలు ‘ఆప్’ను చీపురుతో ఊడ్చేశారు: బండి సంజయ్

ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను అక్కడి ఓటర్లు చీపురుతో ఊడ్చేశారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను కోరుకున్నారని అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు ఢిల్లీ ఓటర్లు వద్దనుకున్నారని చెప్పారు. పేద, మధ్యతరగతి, ఉద్యోగులు, మేధావి వర్గం మొత్తం బీజేపీకే ఓటు వేసిందని తెలిపారు. ఆ కారణంగానే బిజెపికి బ్రహ్మోండమైన మెజార్టీని ఢిల్లీ ఓటర్లు ఇచ్చారని అన్నారు. ఢిల్లీ గడ్డపై అవినీతి పాలనకు ప్రదాని మోడీ అంతం పలకారని తెలిపారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని, బీజేపీ గెలుపు ముందే ఉహించిందేనని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మేధావి, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభల్లో ప్రజల సమస్యలపై ప్రశ్నించేది బీజేపీ మాత్రమేనని తెలిపారు.

రాహుల్ గాంధీకి గాడిదగుడ్డు వచ్చింది: రఘునందన్‌రావు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి గాడిదగుడ్డు వచ్చిందని మెదక్ బిజెపి ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ ఫలితాలే పునరావృతం అవుతాయని ఆయన జోస్యం పలికారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై రఘునందన్ రావు స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతోనే ఢిల్లీ అభివృద్ధి పథంలో పయనిస్తుందని భరోసా ఇచ్చారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుణపాఠమని అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు దమ్ము ఉంటే 76 అసెంబ్లీ 12 పార్లమెంట్ల పరిధిలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదో స్పష్టం చేయడం లేదని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ సత్తా ఏంటో తెలుస్తోందని తెలిపారు.

ఢిల్లీ ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తాయి: డికె అరుణ

ఢిల్లీ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. 27 ఏళ్ల తర్వాత అవినీతి సామ్రాజ్యం హస్తినలో కూలిందని అన్నారు. మార్పు కోసమే ఢిల్లీ ప్రజలు బీజేపీని ఆదరించారని ఉద్ఘాటించారు. తాను ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని, అప్పుడే ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. దేశ రాజధానిలో మంచినీళ్లు దొరికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి స్థానిక ఎన్నికల భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తర్వాత సర్పంచ్ ఎన్నికలు అంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం ఎదురు అవుతోందని ఆమె అన్నారు.

దేశ ప్రజలు మోడీకి జై కొడుతున్నారని అర్ధమైంది: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని ఢిల్లీ ఎన్నికల్లో స్పష్టమైందని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఆప్ పార్టీ తప్పుడు హామీలతో, అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడంతో ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఏ ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా స్వచ్చమైన సుపరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీని దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. దేశంలో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందని ఎద్దేవా చేశారు. గత 10 సంవత్సరాల బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ అవినీతి పాలన మాదిరిగానే, కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నదని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో రాబోయేది రామ రాజ్యమేనని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News