Monday, January 27, 2025

ధరాఘాతం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : దేశ ప్రజల్లో కొనుగోలు శక్తి క్షీణించిపోయి దారిద్య్రం తాండవిస్తోందని సాక్షాత్తూ కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని, దీన్నిబట్టి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలు ఎంతటి లోపభూయిష్టమైనవో అర్ధంచేసుకోవాలని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న దీనావస్థలు కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక విధానాలను వెక్కిరిస్తున్నాయని ఆర్ధిక నిపుణులు, కొందరు సీనియర్ అధికారులు సైతం విమర్శిస్తున్నారు. గడచిన నాలుగేళ్ళ కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం రెట్టింపు అయ్యిందని ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

2018లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.41 శాతం ఉండగా అది కాస్తా 2022వ సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 6.75 శాతానికి పెరిగిందని వివరించారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఒక ఏడాది నుంచి మరొక ఏడాదికి ఒక్క శాతం పెరిగే పరిస్థితులు ఉన్నప్పుడే కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ అప్రమత్తమై రిటైల్ ద్రవ్యోల్బణం నియంత్రణకు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించకపోతే పేదలు, నిరుపేదలే కాకుండా సామాన్య ప్రజలు, మధ్యతరగతి వర్గాలు, కొన్ని లక్షల రూపాయలకు అధిపతులైన లక్షాధికారులు సైతం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారని, అందుచేతనే ప్రతి ఏటా రిటైల్ ద్రవ్యోల్బణం పెరగకుండా నియంత్రణలో ఉండేటట్లుగా అనేక జాగ్రత్తలు తీసుకొన్న ప్రభుత్వాలు పనిచేసిన మన దేశంలో నేడు అలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే పరిస్థితులు లేకపోవడం దేశ ప్రజలు చేసుకొన్న దురదృష్టమని ఆర్ధిక నిపుణులు, సీనియర్ అధికారులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ప్రజల కష్టాలు, ఇబ్బందులను పట్టించుకోకుండా ఎల్లపుడూ ఖజానాకు ఆదాయాన్ని రాబట్టుకోవడానికి ఏకపక్షంగా పన్నులు పెంచుకొంటూ, ధరలను పెంచుతూ ప్రజల నడ్డివిరవడమే ఏకైక లక్షంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా ఉందని వారు విమర్శిస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం రెట్టింపుగా పెరగడంతో వస్తువులు, సేవల ధరలు కూడా రెట్టింపయ్యాయని, దీంతో నాలుగేళ్ళ క్రితం వరకూ ఉన్న ప్రజల కొనుగోలు శక్తి నేడు లేదని, అన్ని వర్గాల ప్రజలు తాము సంపాదించుకునే నెలవారీ డబ్బుల్లో 75 శాతం సొమ్మును ఇంటి ఖర్చులు, వ్యక్తిగత అవసరాలకే ఖర్చు చేస్తున్నారని, దీంతో ప్రజల సేవింగ్స్, ఇతర కొనుగోళ్ళు పూర్తిగా తగ్గిపోయాయని వివరించారు. పన్నులు పెంచినా, పెట్రోల్-డీజిల్ ధరలను పెంచినా, ఇతర వస్తువుల ధరలను పెంచినా దాని ప్రభావం ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్రంగా ఉంటుందనే మౌలిక సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కనబెట్టిందని, దేశ ప్రజల కష్టాలు-నష్టాలను పట్టించుకోకుండా కేవలం ఖజానాను నింపుకోవడానికే కేంద్ర ప్రభుత్వం పరిమితం అయ్యిందని ప్రస్తుత ద్రవ్యోల్బణం గణాంకాలు స్పష్టంచేస్తున్నాయని వివరించారు.

వస్తువులు, సేవలపై పన్నులు భారీగా పెరిగాయని, జిఎస్‌టి శ్లాబ్‌లలోని వస్తువుల జాబితాలు కూడా పెరిగాయని, చివరకు స్మశానాల్లో కూడా పన్నులు వేస్తున్నారని, పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగాయని, ఇవి చాలవన్నట్లుగా కేంద్ర ప్రభుత్వ అప్పులు 155.8 లక్షల కోట్లకు (జిడిపిలో 57.3 శాతం) పెరిగాయని, విదేశీ అప్పులు కూడా 7.03 లక్షల కోట్లకు (జిడిపిలో 2.6 శాతం) పెరిగాయని, కానీ ఈ డబ్బు అంతా ఎటుపోతోందో తెలియడం లేదు కానీ ప్రజల దారిద్య్రం మాత్రం రెట్టింపయ్యిందని, ఇవెక్కడి ఆర్ధిక విధానాలో, ఇంత లోపభూయిష్టమైన ఆర్ధిక విధానాలు ప్రపంచంలో ఏ దేశంలోనూ ఉండవని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులుగానీ, పన్నుల రూపంలో ఖజానాకు ప్రతి ఏటా రాబట్టుకొంటున్న సుమారు 27 లక్షల కోట్ల రూపాయల నిధులు ఏమౌతున్నాయి, ఆ లక్షలాది కోట్ల రూపాయల నిధులతో దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి చేశారా?, ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నారా? లేక దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకుగానీ, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పడం, జాతీయ రహదారులను నిర్మించడం వంటి వాటిపైన ఖర్చు చేస్తున్నారా? అంటే ఏదీ కాదని, కానీ లక్షల కోట్ల రూపాయల నిధులు ఎక్కడికి పోతున్నాయో అంతుబట్టడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అందుకే దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, బిజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలు, కొన్ని బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ తరహా ఆర్ధిక విధానాలు, వ్యవసాయ, పారిశ్రామిక విధానాలు అమలుచేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయని నిపుణులు వివరించారు.

ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగాన్ని వెన్నుదన్నుగా నిలుస్తున్న విధానాలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టుల నిర్మాణాలు, బడుగు-బలహీన వర్గాలన్నింటినీ ఆర్ధికాభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ రాష్ట్రంలో ఎకనమిక్ యాక్టివిటీ (ఆర్ధిక కార్యకలాపాలు) పెరిగేటట్లుగా చేసి సత్ఫలితాలను సాధిస్తోందని వివరించారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం రాజకీయపరమైన కక్షసాధింపులతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్ధికంగా దెబ్బకొట్టడానికి చేసిన అనేక అనైతిక కార్యక్రమాలకు వెరువకుండా, వెనుకంజవేయకుండా ప్రత్యామ్నాయ పద్దతుల్లో వనరులను సమీకరించుకొంటూ ముందుకు సాగుతున్న వైనం అభినందనీయమని, అందుకే దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ తెలంగాణను రోల్ మోడల్‌గా పరిగణిస్తున్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 34,149 కోట్ల రూపాయలను ఎగ్గొట్టినప్పటికీ వెనకడుగు వేయకుండా, 2022-23వ ఆర్ధిక సంవత్సరంలో సెక్యూరిటీ బాండ్ల వేలం నుంచి నిధుల సమీకరణలో ఏకంగా 40 వేల కోట్ల రూపాయలను కేంద్రం నష్టపరిచినప్పటికీ డీలాపడిపోకుండా తెలంగాణ ప్రభుత్వం గట్టిగా నిలబడిందని ఆర్ధిక శాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

అంతేగాక సింగరేణి బొగ్గు, దేశవాళీ బొగ్గును కాకుండా ఆస్ట్రేలియా దేశం నుంచి గౌతమ్ అదానీ తీసుకొచ్చిన అత్యంత ఖరీదైన బొగ్గును కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎంతటి తీవ్రస్థాయిలో వత్తిళ్ళు తెచ్చినా, చెప్పిన మాట విననందుకు ఏకంగా తెలంగాణ రాష్ట్రాన్నే ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టేందుకు కుయుక్తులు పన్నినప్పటికీ వెనుకంజవేయకుండా వ్యవసాయానికి నిరంతరాయంగా రోజుకు 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తూ ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం నేడు దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అందుకే మహారాష్ట అసెంబ్లీలో కూడా తెలంగాణ వ్యవసాయ రంగ పథకాలు కావాలని ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడమంటే సాధారణ విషయం కాదని అంటున్నారు. తెలంగాణ ప్రజలు గర్వించదగిన విషయమని అన్నారు. ఇలాంటి జనరంజక పథకాలుగానీ, జాతి మెప్పుపొందే పనులు కేంద్రం ఒక్కటంటే ఒక్కటి కూడా చేపట్టకపోవడంతోనే జాతీయస్థాయిలో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ అధికారులు వివరించారు.

దేశంలో 72 వేల టిఎంసీల విలువైన నదీ జలాలున్నాయని, ఆ నీటిలో దాదాపు 45 వేల టి.ఎం.సి.ల నదీజలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని, ఆ నీటిలో కనీసం మరో 35 వేల టిఎంసిల నీటిని సద్వినియోగం చేసుకునే భారీ నటిపారుదల ప్రాజెక్టును కూడా చేపట్టలేదని, దేశంలో ఇప్పటికీ కరెంటు బల్బు అంటే ఏమిటో కూడా తెలియని కుటుంబాలు ఇప్పటికీ దేశంలో 2.30 కోట్ల కుటుంబాలు (2.92 లక్షల గ్రామాల్లో) ఉన్నాయని, ఇంతటి పెద్ద సంఖ్యలో విద్యుత్తు వసతిలేని కుటుంబాలకు కరెంటును సరఫరా చేసే ప్రయత్నాలు కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టకపోవడం బాధాకరమని అన్నారు. ఇలా ఏ ఒక్క జనరంజకమైన, ప్రజలకు అవసరమైన పనులు చేయకుండా లక్షలాది కోట్ల రూపాయల నిధులను కేంద్రం ఏం చేస్తుందో, ఎక్కడ ఖర్చు చేస్తుందో, ఎవ్వరి కోసం ఖర్చు చేస్తుందో ఎవ్వరికీ అంతుబట్టడంలేదని, నిధుల వ్యయంలోనూ కేంద్రం గోప్యతను పాటిస్తోందని, ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని ఆర్ధికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దేశంలో నెలకొన్న దారిద్య్రాన్ని తొలగించడానికి, రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రయత్నించేందుకు వీలుంగా తన విధానాలను మార్చుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News