మాట నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్
టన్నుకు రూ.700 నుంచి రూ.1400కు పెంపు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ డీలర్లకు బిఆర్‌ఎస్ సర్కారు తీపి కబురు అందించింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వా రా ప్రతినెల లబ్ధ్దిదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న డీలర్లకు ప్రభుత్వం చెల్లిస్తున్న కమీషన్‌ను టన్నుకు రూ.700 నుంచి రూ.1400కు పెంచింది. ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో రేషన్ డీలర్లుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లుంది. పెంపుదల తక్షణం అమల్లోకి రానుంది. కమీషన్ పెంపుదల వల్ల రాష్ట్రంలోని సుమారు 17వేలమంది రేషన్ డీలర్లకు లబ్ధి చేకూరనుంది.
ఇక నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సేవలందించాలని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. తాజా చర్యలతో పేదలతో పాటు డీలర్ల సంక్షేమానికి కూడా సిఎం కెసిఆర్ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. డీలర్ల కమీషన్ పెంపుదలతో ప్రభుత్వ ఖజానాపైన ఏటా రూ.303కోట్లు భారం పడనుంది. ఇందులో రూ.245 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా భ రించి రేషన్ డీలర్ల సంక్షేమాన్ని చూస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్‌లోని తన నివాసంలో రేషన్ డీలర్ల జెఎసి ప్రతినిధులకు ప్రభుత్వ జిఒ ప్రతిని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రేషన్ డీలర్ల సంక్షేమాన్ని సిఎం కెసిఆర్ నిర్వర్తించారు. ఏకకాలంలో కమీషన్‌ని రెండింతలు దేశ చరిత్రలో ఎక్కడా పెంచలేదని, కరోనా వంటి సంక్షోభ సమయంలో వారి సేవలను గౌరవించి ముఖ్యమంత్రి కెసిఆర్ వారికి గుర్తింపునిచ్చారన్నారు. రాష్ట్రం లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేంద్రం అందించే దానికన్నా రెండింతలు పైబడి 950 రూపాయల కమీషన్‌ని అందించడమే కాకుండా, కేంద్రం కేటాయించని దాదాపు 90 లక్షల మంది పేదలకు పూర్తి రేషన్‌ని అదనంగా అందజేస్తూ, అందరికీ కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసే 5కిలోలకు 1కిలోని అదనంగా రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి 6 కిలోలను ప్రతీ కార్డుదారుకు అందజేస్తుందని వెల్లడించారు. ఇందుకోసం ఏటా 3వేల కోట్లను పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తుందన్నారు, ప్రజలందరికీ ఇబ్బందులు లేకుండా సేవల్ని అందించాలని మంత్రి గంగుల కమలాకర్ రేషన్ డీలర్లకు సూచించారు.
మంత్రికి ఘనంగా సన్మానం :
ఈ సందర్భంగా రేషన్ డీలర్ల ప్రతినిధులు మంత్రి గంగులను ఘనంగా సన్మానించి తమ కృతజ్ణతలు తెలియజేసారు. కేంద్రం వాటాకు మించి కమీషన్‌ను అందించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు , ఇందుకు కృషి చేసిన మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు నాయికోటి రాజు, దొమ్మాటి రవీందర్, గడ్డం మల్లిఖార్జున్ గౌడ్, ప్రసాద్ గౌడ్, తిరుపతి, లక్ష్మణ్‌తో పాటుగా రాష్ట్రంలోని 33 జిల్లాల రేషన్‌డీలర్స్ అసోషియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.