Thursday, January 23, 2025

మేడారం జాతరకు టిఎస్ టిడిసి ప్యాకేజీ టూర్‌పై సందిగ్ధత!

- Advertisement -
- Advertisement -

ఆర్‌టిసిలో మహిళలకు ఉచిత ప్రయాణాలే కారణం ?
క్రితం సారి సమ్మక్క సారలమ్మక్క జాతరతో పర్యాటక శాఖకు భారీ ఆదాయం

మన తెలంగాణ / హైదరాబాద్ : సమ్మక్క సారక్క జాతరకు రోజులు సమీపిస్తుండడంతో బస్సుల ప్యాకేజీ టూర్లపై తెలంగాణ పర్యాటకాభివృద్ధి శాఖ ( టిఎస్ టిడిసి) తర్జన భర్జన పడుతోంది. క్రితం సారి సమ్మక్క సారక్క జాతరకు తమ సంస్థ నుండి టూర్ ప్యాకేజీలు ఇచ్చి పలు బస్సులను నడిపించగా ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదని, ఇందుకు కారణం తెలంగాణ రాష్ట్ర ఆర్‌టిసి సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచితంగానే ప్రయాణాలు చేసుకునేందుకు అవకాశం ఉండడమేనని చెబుతున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ఇప్పటికే సుమారు 30 చోట్ల హరిత హోటళ్లను ఏర్పాటు చేసుకున్న టిఎస్ టిడిసి అందుకు అనుగుణంగానే ముందుకు వెళ్లోంది కూడా. అయితే సమక్మ సారలమ్మ జాతర నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్ ఒక నెల రోజుల ముందుగానే సమ్మక్క సారలమ్మ ఆలయ సమీపంలోని హరిత హోటల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారని వారు తెలిపారు.

ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఏలు, కలెక్టర్లు సహా ఇతర ప్రభుత్వ అధికారులకు హరిత హోటల్‌ను బుక్ చేస్తుండడం కూడా తమ ప్యాకేజీ టూర్‌లపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు.  ఉదా.. మహా శివరాత్రి సందర్భంగా కీసరగుట్టలోని హరిత హటల్‌ను జిల్లా కలెక్టర్ ఆధీనంలోకి తీసుకున్నారని, ఆయా జిల్లాలోని ఎంఎల్‌ఏలు, మాజీ మంత్రులు ఇక్కడే ఒక రోజు పాటు మకాం వేశారని చెబుతున్నారు. ఒక్క బిఆర్‌ఎస్ పార్టీ నేతలే కాకుండా వివిఐపిలు, మంత్రులు, హైకోర్టు న్యాయవాదులు, జడ్జీలు కూడా హాజరై మహా శివరాత్రి పర్వదినాన ప్రత్యేక పూజలు చేసుకుని వెళ్లారంటున్నారు. ఇలా ముఖ్యమైన ఆలయాల వద్ద పర్యాటక శాఖ రీసార్ట్‌లు గుడికి సమీపంలోనే ఏర్పాటు చేస్తున్నామంటున్నారు. కొన్ని చోట్ల అర కిలోమీటర్ దూరంలోనూ రెస్టారెంట్‌ల పేరిట కూడా ఏర్పాటు చేశామని అంటున్నారు. మాజీ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పర్యాటకాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా వరల్డ్ టూరిజం డేలో పాల్గొని తమ టూరిజం శాఖ ప్యాకేజీ టూర్లను వినియోగించుకోండని ప్రొత్సహించారన్నారు.

లక్నవరం, పాకాల , ఘనపురం, ఏటూరు నాగారం తదితర టూరిస్ట్ ప్రాంతాలను సందర్శించి ఎంజాయ్ చేసుకోండంటూ కోరారని గుర్తు చేస్తున్నారు. ఇదంతా ఒకప్పటి మాట అని.. ప్రస్తుత ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించి ముందుకు వెళ్తుండడంతో దీని ప్రభావం ప్యాకేజీ టూర్లపైనా పడే ఛాన్స్ ఉంటుందని పర్యాటకాభివృద్ధి శాఖ వర్గాలు చెబుతుండడం గమనార్హం. కాగా బిఆర్‌ఎస్ సర్కారు హయాంలో క్రితం సారి మేడారం జాతరకు టూర్ ప్యాకేజీలు ఇవ్వగా తమ సంస్థకు భారీగానే ఆదాయం వచ్చిందని పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ సారి ఆర్‌టిసి ఉచిత బస్సు ప్రయాణాలతో మేడారంకు తమ సంస్థ ద్వారా ప్యాకేజీ టూర్‌ల ద్వారా పర్యాటకశాఖ బస్సులను నడిపించాలా? వద్దా అన్న దానిపైనే ఇంకా నిర్ణయం తీసుకేలేదని అధికార వర్గాలు అంటున్నారు.
ఎడ్ల బండ్ల పోయి.. అధునాతన కార్లు…
జాతర.. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల నుండి జాతరలకు వెళ్లాలంటే తమ ఎండ్ల బండ్లను, ఎడ్లను ఎవరికి తోచిన రీతిలో వారు సర్వాంగ సుందరంగా అలంకరించుకుని జాతర్లకు వెళ్లే వారు. కానీ ఇప్పుడు జీపులు, కార్లపైనే ఎక్కువగా వస్తున్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు హైదరాబాద్‌తో పాటు వరంగల్ జిల్లా నుండి ప్రత్యేక ఆర్‌టిసి బస్సులు నడిపిస్తున్నారు. కాగా ఏవిఏషన్ డిపార్ట్‌మెంట్ వారు సైతం సమక్మ సారలమ్మ జాతరకు హెలీకాఫ్టర్ రైడ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎవరికి తోచిన బాటలో వారు చిలకలగుట్టకు చేరుకుంటున్నారు. స్థానిక ఎంఎల్‌ఏ సీతక్క సైతం కోయగూడెం, రెడ్డిగూడెం సహా పలు ప్రాంతాల వరకు ప్రత్యేక బస్సులను నడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News