న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో బుధవారం సమావేశమయ్యారు. భారత్ రష్యా వ్యూహత్మక భాగస్వామ్యాన్ని అమలు చేసే దిశగా కృషిని కొనసాగించడానికిఇరువురు నేతలు అంగీకారం తెలిపారని మాస్కోలోని భారత దౌత్యకార్యాలయం ఒక ట్వీట్‌లో తెలియజేసింది. ‘జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమ్యారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అమలు చేసే దిశగా కృషి చేయడానికి అంగీకరించారు’ అని ఎంబసీ ఆ ట్వీట్‌లో పేర్కొంది. కాగా అఫ్గానిస్థాన్‌పై బహుముఖ చర్చల్లో భాగంగా పుతిన్ వివిధ దేశాల ప్రతినిధి బృందాల నేతలతో సమావేశమయినట్లు క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా అఫ్గానిస్థాన్‌పై రష్యా ఆధ్వర్యంలో ఏర్పాటయిన వివిధ దేశాల భద్రతా మండలుల, జాతీయ భద్రత మండలుల కార్యదర్శుల సమావేశానికి దోవల్ బుధవారం హాజరయ్యారు. ప్రాంతీయేతర శక్తులు తమ మౌలిక వ్యవస్థలను విస్తరించుకోవడానికి అష్గానిస్థాన్‌లోని పరిస్థితులను ఉపయోగించుకోవడంపై కూడా తాము ఆందోళన చెందుతున్నట్లు ఈ సమావేశంలో పుతిన్ అన్నట్లు క్రెమ్లిన్ పేర్కొంది. ఆ దేశంలో పరిస్థితి మెరుగుపడినట్లుగా లేదని, ఈ విషయం మనకు కనిపిస్తూనే ఉందన్న పుతిన్ మానవతా పరిస్థితి మరింతగా దిగజారుతోందని అన్నారు. ఈ సమావేశంలో రష్యా, భారత్‌తో పాటుగా ఇరాన్, కజకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్, చైనా, తజకిస్థాన్, తుర్క్‌మనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. రష్యాలో తన రెండు రోజుల పర్యటనను దోవల్ బుధవారం ప్రారంభించారు.