Thursday, January 23, 2025

రాజ్యాంగ రచన: అంబేడ్కర్

- Advertisement -
- Advertisement -

అవి బాబాసాహెబ్ తన చివరి రచన ‘Buddha and his Dhamma’ రాస్తున్న రోజులు… ఆ సమయంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ ఢిల్లీలోని అలీపూర్ రోడ్‌లోని 26 నెం. బంగళాలో నివాసం వుంటుండేవారు. ఒక రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత 8 గం॥ సమయంలో తన రీడింగ్ రూంలో కూర్చొని తన పుస్తకం రాయడంలో నిమగ్నమైపోయారు. బాబాసాహెబ్ అనుయాయుడు ‘నానక్ చంద్ రత్తు’ ఆ రోజుకి ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసి బాబాసాహెబ్ టేబుల్ దగ్గరగా నిలబడి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాడు. కాసేపటి తర్వాత బాబాసాహెబ్ రత్తూతో ఇక నువ్వు వెళ్లి పడుకొని పొద్దున్నే రమ్మని చెప్పారు. ఎప్పటిలాగే పొద్దున్న 8 గం॥ బాబాసాహెబ్ దగ్గరికి వచ్చిన నానక్ చంద్ రత్తూ రాత్రి వెళ్లేటప్పుడు ఎలాగైతే పుస్తక రచనలో నిమగ్నమైన బాబాసాహెబ్ అప్పటికీ కూడా అలాగే కుర్చీలో కూర్చొని పుస్తకాన్ని రాస్తూనే ఉన్నారు. అంటే అప్పటికి 12 గంటలుగా పుస్తకం రాస్తూనే ఉన్నారు.

నానక్ చంద్ రత్తూ నిశ్శబ్దంగా బాబాసాహెబ్ పక్కనే చూస్తూ నిలబడిపోయాడు. అలా నిలబడి చాలా సమయం గడిచిపోయింది. కాని బాబాసాహెబ్ తలెత్తి చూడను కూడా లేదు. తన పరిసరాలని కూడా గమనించలేనంతగా బాబాసాహెబ్ తన రచనలో నిమగ్నమైపోయారు. బాబాసాహెబ్ దృష్టి మరల్చడానికి నానక్ చంద్ రత్తూ టేబుల్ మీద ఉన్న పుస్తకాలని సర్దుతూ ఉండగా బాబాసాహెబ్ చూసి ‘రత్తూ నువ్వింకా వెళ్ల లేదా’ అనగానే కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా బాబాసాహెబ్ కాళ్ళ దగ్గర కూర్చొని ‘అయ్యా.. ఉదయం 8:30 అవుతుంది, గత 12 గంటలుగా రాస్తూనే ఉన్నారు… అసలెందుకు ఇంత గా కష్టపడుతున్నారు’ అనడంతో బాబాసాహెబ్ ‘రత్తూ… నా ప్రజలు ఇంకా వెనకబడే ఉన్నారు, ఏ దారిలో నడవాలో స్వంతంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో కూడా లేరు. నేను చనిపోయిన తర్వాత నా పుస్తకాలే వారికి సరైన దిశా నిర్దేశం చేస్తాయి. ప్రతి ఇంటికీ నేను వెళ్లలేను కానీ నా సాహిత్యం మాత్రం వెళ్తుంది. నా రచనలు చదివిన వారికి నా ఆలోచనలు అర్థం అవుతాయి. నా సిద్ధాంతం, ఆలోచనలు నా పుస్తకాల ద్వారానే తెలుసుకుంటారు. నా ఆలోచనలు అర్థం చేసుకున్న ప్రజలు తమ కర్తవ్యం ఏంటో తెలుసుకొని పని చేస్తారు. అందుకే నేనింత కష్టపడుతున్నాను.

సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ – అంబేడ్కర్ మధ్య సంభాషణ
పటేల్ : మిస్టర్ అంబేడ్కర్, మీరు ప్రాతినిధ్యం వహించే చాలా మంది ప్రజలు, మీ కులం ప్రజలు చొక్కా లేకుండా, అర్ధ నగ్నంగా జీవిస్తుంటే మీరు ఖరీదైన సూట్లు ధరిస్తారేంటి? మీరు యూరోపియన్ వలసవాదిగా కనిపిస్తున్నారు. గాంధీని చూడు, అతను మీ వాళ్ళలాగే చొక్కా లేకుండా బతుకుతున్నాడు. ఆయనే మీ ప్రజలకు నిజమైన నాయకుడు.
డాక్టర్ అంబేడ్కర్ : మిస్టర్ పటేల్, నా ప్రజలు 2000 సంవత్సరాలుగా చొక్కా లేకుండా నగ్నంగానే జీవిస్తూ వున్నారు. వారిని మరో 1000 సంవత్సరాలు చొక్కా లేకుండా జీవించేలా మభ్యపెట్టి మోసం చేయడం కోసమే గాంధీ మా వారిలా బతుకుతున్నట్టు నటిస్తున్నారు. నా ప్రజలు ఇక కష్టాలు పడటం నాకు ఇష్టం లేదు. నా ప్రజలు మంచి బట్టలు ధరించాలని, వీలైనంత త్వరగా మంచి జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నాను.

అంబేడ్కర్ భారత రాజ్యాంగం రాయలేదు అనే వారికి ఇది అసలు సిసలు సమాధానం. ఆగస్టు 29, 1947న స్వతంత్ర భారత రాజ్యాంగ ముసాయిదా రచనా సంఘం ఏర్పడిన రోజు. మన దేశానికి రాజ్యాంగం వ్రాయడానికి 7 గురు సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఆ ఏడుగురిలో డా. బాబాసాహెబ్ అంబేడ్కర్‌ని చైర్మన్‌గా నియమించారు.
మిగతా సభ్యులు: 1.అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, 2 కె.యం ము న్షి, 3. యన్. గోపాలస్వామి అయ్యంగార్, 4. మహమ్మద్ సాదుల్లా.., 5.యన్ మాధవి మీనన్, 6. డి.పి. ఖైతాన్ (ఈయన మరణంతో ఆయన స్థానంలో టి.టి కృష్ణమచారి వచ్చారు)రాజ్యాంగ రచన పూర్తిగా భారం అంబేడ్కర్ మీదనే పడింది ఎందుకంటే.. ఎ) దీనిలో టి.టి కృష్ణమచారికి న్యాయ శాస్త్రంలో ప్రావీణ్యం లేదు. అలాగే పట్టభద్రుడు కూడా కాదు. బి). ఇద్దరు సభ్యులు ఇతర దేశాల కార్యకలాపాల్లో మునిగిపోయారు. సి). ఇంకొకరు అనారోగ్య కారణాల వల్ల. డి). మిగతావారు కాంగ్రెస్ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అలాగే ఇంకొక కారణం కూడా తోడు అయ్యింది వారికి (సభ్యులకు) ఢిల్లీ చాలా దూరం ఉండడం వల్ల కూడా వారు రాజ్యాంగ రచనలో పాల్గొనలేదు.

అందుచేత అంబేడ్కర్ ఒక్కరి మీదనే భారం పడడం వల్ల ఆయన అనారోగ్యంతో బాధపడుతూనే ఆయనకు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి చేసి 1949 నవంబర్ 26 న అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, ప్రధాని నెహ్రూకు అందచేయడం వారు ఆ రాజ్యాంగ ప్రతిని అదే రోజు ఆమోదించడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని జనవరి 26,1950 నుండి అమలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో పాలన వ్యవస్థ ఇంకా నిర్మాణం కాని క్లిష్టమైన వాతావరణంలో మన రాజ్యాంగ రచన జరిగింది. దీనికి రచనా కమిటీ చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. అంతకంటే ముందు ఆయన్ను అసలు రాజ్యాంగ సభకే వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాయి అప్పుడున్న కొన్ని పార్టీలు. కుట్రలో దాగి ఉన్న చరిత్ర కూడా చూడాలి. లేకపోతే మేల్కొనలేము..
1. అంబేడ్కర్ అప్పుడు ఎన్నో ఒడిదుడుకులను ఓపిగ్గా ఎదుర్కొని బెంగాల్ రాష్ట్రం నుండి రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు బాబా సాహెబ్.

తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి ఆయన ఓడిపోయేలా చేసి ఆయన్ను రాజ్యాంగ రచనా కమిటీలో లేకుండా చేయాలనుకున్నారు అప్పటి కాంగ్రెస్ నాయకులు, హిందూ మహాసభవారు. అప్పుడు బెంగాల్ శాసనసభ ఎస్‌సి ఫెడరేషన్, ముస్లింలీగ్ సభ్యులు కలిసి ఆయన్ను తమ రాష్ట్రం నుండి ఎన్నికయ్యేలా చూసి బాబాసాహెబ్‌కు రాజ్యాంగ రచనా కమిటీలో స్థానం దక్కేలా చేశారు. ఆపై జరిగిన పరిణామాలు దేశ విభజనను తెచ్చాయి. ఆ విభజన వల్ల అంబేడ్కర్ ఎన్నికైన బెంగాల్ స్థానం తూర్పు పాకిస్తాన్‌లోకి వెళ్ళిపోయే సరికి, ఆయన మరోసారి తన సభ్యత్వం కోల్పోవాల్సి వచ్చింది. ఇలా ఈ ప్రాంతం పాకిస్తాన్‌లోకి వెళ్ళిపోవడం వెనక కూడా అంబేడ్కర్‌ను రాజ్యాంగ రచనా కమిటీలో లేకుండా చేయాలనే కాంగ్రెస్ నాయకుల కుట్ర ఉంది. ఈ అన్యాయాన్ని అంబేడ్కర్ బ్రిటిష్ ప్రధానికి, ప్రతిపక్ష నాయకులకూ విన్నవించగా, ఈ తప్పిదాన్ని సరిచేసి అంబేడ్కర్‌ను మరో ప్రాంతం నుంచైనా ఎన్నుకోవాల్సిందిగా ప్రధాని నెహ్రూను ఆదేశించేసరికి, పుణె నుంచి ఎన్నుకోవాలనుకున్న మాల్వాంకర్‌ను తప్పించి అంబేడ్కర్‌ను ఎన్నుకోవడం జరిగింది. ఇలా కాంగ్రెస్ నాయకులు, వల్లభ్ బాయ్ పటేల్ కలిసి పన్నిన కుట్రను సమర్ధంగా ఎదుర్కొని అంబేడ్కర్ రాజ్యాంగ రచనా కమిటీలో చోటు సంపాదించుకున్నారు.

2. అంబేడ్కర్‌ను రాజ్యాంగ పరిషత్తుకు రానివ్వకుండా చేయడానికి ఆయన గెలిచిన తూర్పు బెంగాల్‌లో ఒక ప్రాంతాన్నే పాకిస్తాన్‌కి ఇచ్చేశారా? దేశ భూభాగాన్ని కోల్పోవడానికి కారకులు, దేశద్రోహులు ఎవరు? Constituent Assembly Debates: book no1లో అంబేడ్కర్ పేరు బెంగాల్ ప్రావిన్స్‌లో వుండగా book no 2 కి వచ్చేసరికి బొంబాయి ప్రావిన్స్‌లోకి ఎందుకు మారిపోయింది? భారత రాజ్యాంగం గురించి మాట్లాడుకునే ముందు మనం తప్పనిసరిగా రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యతలు తీసుకున్న రాజ్యాంగ పరిషత్‌కు సభ్యులను ఎలా ఎన్నుకున్నారు? ఆ ఎన్నిక విధానం ఎలా జరిగిందో మనం తెలుసుకోవాలి. అంతే కాకుండా ఆ పరిషత్‌లో అంబేడ్కర్ సభ్యుడు ఎలా అయ్యారు? దానికి ఆయన పడ్డ కష్టాలను మనం తప్పక తెలుసుకోవాలి.

రాజ్యాంగ పరిషత్‌కు 1946 జులై, ఆగస్టులలో ఎన్నికలు జరిగాయి. అప్పుడు భారత దేశంలో బ్రిటిష్ సంస్థానాలు, స్వదేశీ సంస్థానాలు అనే రెండు పరిపాలన విభాగాలు ఉండేవి. ప్రతి సంస్థానం నుంచి సుమారు 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు చొప్పున పరిషత్‌కు తీసుకున్నారు. ఇలా 296 మంది బ్రిటీష్ సంస్థానాల నుంచి ఎన్నుకోబడ్డారు. మొత్తం 389 మంది సభ్యులుగా గల రాజ్యాంగ పరిషత్‌లో మిగతా 93 మంది స్వదేశీ సంస్థానాల నుంచి పాతినిధ్యం వహించారు. అయితే బ్రిటిష్ సంస్థానాలలో రాజ్యాంగ పరిషత్‌కు జరిగిన ఎన్నికలలో షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్‌ను అంబేడ్కర్ ను ఓడించటానికి సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ కుట్ర పన్ని అప్పటి బొంబాయి సంస్థాన ప్రధానమంత్రియైన బిజి కేర్‌కు సూచనలు చేసి ఓడించడం జరిగింది.

ఈ కుట్రలో వామపక్షాలు కూడా పటేల్‌తో చేతులు కలపడం చాలా శోచనీయం. పటేల్ చేసిన ఈ కుట్రను గమనించిన బెంగాల్‌లోని నామశూద్రుల నాయకుడైన మహాప్రసేన్, జోగేంద్రనాథ్ మండల్, జెస్సోర్, ఖుల్నా నుంచి పోటీ చేసిన తమ అభ్యర్థియైన ముఖుంద్ బిహారి మల్లిక్‌తో రాజీనామా చేయించి అంబేడ్కర్ చేత పోటీ చేయించడం జరిగింది. ఇలా ఐక్య బెంగాల్ నుంచి పోటీ చేసిన అంబేడ్కర్ గెలిచి రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికలో షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్‌కు బెంగాల్ లెజిస్లేచర్‌లో పూర్తి మెజారిటీ లేకపోవడంతో కావలసిన 4 బదలీ ఓట్లును ఆంగ్లో ఇండియన్, స్వంతంత్ర దళిత, ముస్లింలీగ్ అభ్యర్ధుల మద్దతుతో 5 ఓట్లు సాధించి రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నిక కాబడ్డారు. అయినా కూడా కాంగ్రెస్‌లో ఉన్న కొంత మందికి అంబేడ్కర్ గిట్టలేదు. అందుకే దేశ విభజన సమయంలో అంబేడ్కర్ ఎన్నుకోబడ్డ తూర్పు బెంగాల్ ప్రాంతమైన జెస్సోర్ ఖుల్నాను విభజనలో భాగంగా పాకిస్తాన్‌కు ఇవ్వడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News