Saturday, December 21, 2024

మనుస్మృతిపై అంబేడ్కర్ పోరాటం

- Advertisement -
- Advertisement -

మనుస్మృతిని తగలబెట్టడానికి ముందు మహద్‌లోని ఒక ఊర చెరువు నుండి దళితులను తాగు నీరు తీసుకోకుండా అగ్రవర్ణ హిందువులు అడ్డుకోవడంతో ఆ పట్టణంలో 1927 మార్చి 20వ తేదీన అంబేడ్కర్ నేతత్వంలో ఒక గొప్ప సత్యాగ్రహం జరిగింది. అంతకు ముందు ఆ పట్టణంలో హిందువులు నడిచే వీధులపైన అంటరానివారైన కారణంగా దళితులు నడిచేందుకు కూడా వీల్లేదని అగ్రవర్ణాల వారు నిషేధం విధించారు. ప్రభుత్వం నిర్మించి, నిర్వహించే అన్ని ప్రదేశాలకూ దళితులు నిరభ్యంతరంగా వెళ్లవొచ్చని, మునిసిపల్ రోడ్ల పై అందరూ నడవొచ్చని, చెరువులో నుండి నీరు తెచ్చుకోవచ్చని అప్పటి బొంబయి ప్రావిన్స్ శాసన మండలి 1923లో తీర్మానం చేసిన తరువాత మహద్ మున్సిపల్ కౌన్సిల్ కూడా శాసన మండలి తరహాలో 1924లో మరో తీర్మానం చేసింది.

1927 డిసెంబర్ 25వ తేదీన అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ బాబాసాహెబ్ అంబేడ్కర్, అతడి అనుచరులు మహారాష్ర్ట, కొంకణ్ ప్రాంతం రాయగడ్ జిల్లాలోని మహద్ అనే చిన్న పట్టణంలో కొన్ని వేల మంది సమక్షంలో మనుస్మృతిని దహనం చేసి “చాతుర్వర్ణ వ్యవస్థను విశ్వసించము. కుల వ్యత్యాసాలను అంగీకరించము. హిందూ సమాజానికి శాపంగా ఉన్న అంటరానితనాన్ని అంతం చేసేందుకు కృషి చేస్తాము. హిందువుల్లో ఆహారం, పానీయం విషయాల్లో ఎలాంటి నిషేధాలను పాటించము. ఆలయాలు, నీటి వనరులు, పాఠశాలలు వగైరా సదుపాయాల విషయంలో అస్పృశ్యులు అనబడే వారితో సహా అందరికీ సమాన హక్కులు ఉంటాయని నమ్ముతున్నాము అని ప్రతిజ్ఞ చేశారు.

మనుస్మృతిని తగలబెట్టడానికి ముందు మహద్‌లోని ఒక ఊర చెరువు నుండి దళితులను తాగు నీరు తీసుకోకుండా అగ్రవర్ణ హిందువులు అడ్డుకోవడంతో ఆ పట్టణంలో 1927 మార్చి 20వ తేదీన అంబేడ్కర్ నేతత్వంలో ఒక గొప్ప సత్యాగ్రహం జరిగింది. అంతకు ముందు ఆ పట్టణంలో హిందువులు నడిచే వీధులపైన అంటరానివారైన కారణంగా దళితులు నడిచేందుకు కూడా వీల్లేదని అగ్రవర్ణాల వారు నిషేధం విధించారు. ప్రభుత్వం నిర్మించి, నిర్వహించే అన్ని ప్రదేశాలకూ దళితులు నిరభ్యంతరంగా వెళ్లవొచ్చని, మునిసిపల్ రోడ్ల పై అందరూ నడవొచ్చని, చెరువులో నుండి నీరు తెచ్చుకోవచ్చని అప్పటి బొంబయి ప్రావిన్స్ శాసన మండలి 1923లో తీర్మానం చేసిన తరువాత మహద్ మున్సిపల్ కౌన్సిల్ కూడా శాసన మండలి తరహాలో 1924లో మరో తీర్మానం చేసింది. అయితే అక్కడ అగ్రవర్ణాల నిరసన కారణంగా ఈ తీర్మానాలేవీ అమలుకు నోచుకోలేదు. దీంతో అంబేద్కర్ బహిషృ్కత హితకారిణి మహా సభను 1927 మార్చి 19, 20 తేదీలలో మహద్‌లోనే నిర్వహించారు.

వెయ్యి మందికి పైగా ఈ సభకు హాజరయిన ప్రతినిధులు సభ తర్వాత ఊరేగింపుగా వెళ్లి అదే ఊర చెరువులో మంచి నీరు తాగారు. దళితులు ఆ చెరువు నుండి నీరు తీసుకుని తాగడంతో అది అపవిత్రమైపోయిందని భావించిన సవర్ణ హిందువులు చెరువు నీటిని శుభ్రపరిచి, ఆ చెరువుకు ప్రక్షాళన పూజలు నిర్వహించారు. అమానవీయమైన అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్న బ్రాహ్మణాధిక్య సమాజం పట్ల, బ్రాహ్మణీయ సంస్కృతికి మూలమైన మనువాదం పట్ల తనకు గల నిరసన భావాన్ని తెలిపేందుకు అంబేడ్కర్ ఈ మనుస్మృతి దహన కార్యక్రమాన్ని కేవలం లాంఛనప్రాయంగానే చేపట్టిన తర్వాత అది సమాజంలో దీర్ఘకాలిక విభేదాలకు, అక్కడి అగ్రవర్ణాల ప్రజలు అంబేడ్కర్‌ను, దళితులను మరింత తీవ్రంగా ద్వేషించడానికీ దారి తీసింది. అయితే అంబేడ్కర్ ఈ ఉద్యమం తాగు నీటి కోసం, ఆలయ ప్రవేశం కోసం, ఇతర సదుపాయాల కోసమే కాదు, సమాజంలో అసమానతలకు హేతువైన వర్ణ వ్యవస్థను రూపుమాపడం కోసమే చేస్తున్నామని వివరిస్తూ ఆ కాలంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో సమాన హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమాల విశేషాలను సభికులకు విడమర్చి చెప్పారు.

ఫ్రెంచి విప్లవంలో పెల్లుబికిన మానవ హక్కుల డిమాండ్లను పేర్కొన్నారు. రోవ్‌ులో పార్టీ సియన్స్‌కి వ్యతిరేకంగా ప్లెబియన్స్ చేసిన తిరుగుబాటులోని డొల్లతనాన్ని వివరించారు. సమాజంలోని విభజన వ్యవస్థను అంతమొందించకుండా తమ గోడును వెళ్లబోసుకునేందుకు ఒక ట్రిబ్యూన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ప్లెబియన్లు సాధించింది ఏమీ లేదని చెప్పారు. మౌలిక సమస్యలపై కేంద్రీకరించకుండా స్వల్పకాలిక, తాత్కాలిక సమస్యలకే పరిమితం కావడం వలన విముక్తి లభించదని బోధించారు. కాబట్టి మా ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తున్నాం, ఈ సామాజిక విప్లవానికి సహకరించండని అగ్ర వర్ణాలకు కూడా అంబేడ్కర్ విజ్ఞప్తి చేసి శాస్త్రాలను వదిలేయండి, న్యాయాన్ని చూడండి అని హితవు పలికారు. మనుస్మృతి దహనం, మహద్ చెరువులోని నీరు తెచ్చుకోవడం సమస్య తీవ్రతను గుర్తింప చేసి, నిరసన వ్యక్తం చేసే సింబాలిక్ చర్యలు మాత్రమేనని, వాటి పరిష్కారానికి సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉంటుందని అంబేడ్కర్ దిశానిర్దేశం చేశారు. కాబట్టి మనుస్మృతి దహనం అనేది కేవలం దళితులకు సంబంధించిన కర్తవ్యమే కాదు.

నేటి మహిళలు, మైనారిటీలు, బలహీన వర్గాల వారంతా ఈ మనుస్మృతికి బలి పశువులే కాబట్టి మనుస్మృతి దహనం గురించి తెలుసుకొని ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం నేడు ఎంతైనా అవసరం. మనుస్మృతి వలన దళితులు అనుభవించిన అమానుష బానిసత్వం, సామాజిక అన్యాయం అందరికీ తెలిసిందే. దళితుల నివాసాలు ఊరికి దూరంలో వెలివాడలుగా ఉండే విషయం ఇప్పటికీ షరా మామూలే. ఏదైనా పని మీద ఊళ్లోకి వచ్చే దళితుడి అడుగు జాడలు బజారులో పడకూడదు. అందుకోసం నడుముకు వెనక పొడవుగా గుబురుగా ఆకులు ఉండే కొమ్మలను లేదా తాటి మట్టలను కట్టుకోవాలి. అవి వెనక నేలపై ఈడ్చుకొస్తూ పాదముద్రలను చెరిపేయాలి. అలాగే ఊరిలో ఎక్కడా ఉమ్మి కూడా వేయకూడదు. అందుకోసం మెడలో చిన్న ముంత కట్టుకొని ఉమ్మి వచ్చినప్పుడు అందులోనే ఉమ్మాలి. అదే విధంగా దళితులు ఎలాంటి ఆయుధాలను ఉంచుకోకూడదు, విద్య నేర్చుకోకూడదు, చదువుకోకూడదు.

ఈ నియమాలను ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలకు, హత్యలకు గురి కావాల్సిందేనని స్వంతగా విలు విద్య నేర్చుకొన్న ఏకలవ్యుడి బొటనవేలును బలిగొన్న దుర్మార్గమే ఒక ఉదాహరణ”న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి” అనేది మనుస్మతి ఆదేశం. బాలికగా తండ్రి రక్షణలో, మహిళగా భర్త రక్షణలో, విధవగా కొడుకు రక్షణలో మహిళ ఉండాలని మనుస్మతి కట్టడి చేస్తోంది. భర్తలు భార్యలను నిత్యం తమ అదుపులో ఉంచుకోవాలని చెబుతోంది. మహిళలు అపవిత్రులు, అబద్ధాలాడతారు, తెలివిలేని వారు, బలహీనులు కాబట్టి వారు వేదాలు చదవలేరు. కాబట్టి వారు నామకరణం చేయడం, జాతకాలు చెప్పడం, వేద మంత్రోచ్చారణలు చేయకూడదని మహిళలను బానిసలుగా చూసే ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇవి చాలవా మనుస్మృతిని మంటగలపడానికి? ఏ సామాజిక సమస్యల పరిష్కారం కోసం 95 ఏండ్ల క్రితం అంబేడ్కర్ నాయకత్వంలో మనుస్మృతి దహనం చేయబడిందో ఆ సమస్యలు యిప్పటికీ సజీవంగానే ఉంటూ తీవ్రమవుతున్నాయి. దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో లవ్ జిహాద్ పేరుతో చట్టాలు కింది కులాల యువకులు పైకులాల యువతులను ప్రేమించి పెండ్లిళ్లు చేసుకోకుండా నిషేధించడం కోసమే. నేడు దేశంలో మహిళలపై మానభంగాలు, హత్యలు మరింత పెరిగాయి.

పసిపాపలను కూడా బలాత్కరించి చంపేయడం నేడు మన కండ్ల ముందు కనబడుతున్న దౌర్భాగ్యం. ఇవన్నీ శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలే కాదు. దళితులు, మహిళలు, బలహీన వర్గాల వారిని అనుభవించి, అణిచివేసి, హత్యలు చేయవచ్చని మనుస్మృతిలోనే దాగి ఉన్న కుట్ర నేటి భారతీయ సమాజపు అగ్రకులాల్లోని అధిక మందిలో ఆవహించి ఉంది. కాబట్టి అలాంటి అహంభావాన్ని అంతం చేయడం కోసమే మనుస్మృతి దహన కార్యక్రమాన్ని విస్తృతంగా పెద్ద ఎత్తున నిర్వహించాలి. నేడు కేంద్రంలో మనుస్మృతి ఆరాధకుల అసాధారణ పరిపాలన సాగుతున్నందున ఈ కార్యక్రమాన్ని కులాలతో నిమిత్తం లేకుండా లౌకిక, ప్రజాస్వామికులందరి సామాజిక, రాజకీయ కర్తవ్యంగా భావించాలి. నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకునే రోజున రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ సేవలను ఆకాశానికెత్తే కేంద్ర ప్రభుత్వం కూడా డిసెంబర్ 25ను కూడా “మనుస్మృతి దహన్ దివస్‌”గా పాటించి, దాని సందేశాన్ని అందరికీ వివరించాలి.

నాదెండ్ల శ్రీనివాస్, 9676407140

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News