Tuesday, January 21, 2025

వివక్షపై తిరుగుబాటు జెండా బాబూజీ

- Advertisement -
- Advertisement -

భారతీయ దళిత వర్గాల పెన్నిధి, పరిపాలనాదక్షుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ఏప్రిల్ 5వ తేదీన యావత్ భారతదేశం ఉత్సాహంగా జరుపుకుంటోంది. స్వాభిమానానికి, కార్యదీక్షకు, పోరాట పటిమకు, గొప్ప నాయకత్వానికి డా.బాబూ జగ్జీవన్ రామ్ ప్రతీక. ప్రత్యేక కులరాజకీయ వివక్షలపై బాబూజీ తిరుగుబాటు బావుటా. నాయకులకు స్ఫూర్తినిచ్చే ఆదర్శ వ్యక్తిత్వం బాబూ జగ్జీవన్ రామ్ ది. ఆయన జయంతి సందర్భంగా గొప్ప విజయగాధ అయిన బాబూజీ జీవితాన్ని స్మరించుకుందాం. జగ్జీవన్ రామ్ బీహార్‌లోని ఆరా పట్టణానికి దగ్గర ఉన్న చాంద్వ గ్రామంలో 1908 ఏప్రిల్ 5వ తేదీన జన్మించారు. బసంతీ దేవి, శోభీరాం జగ్జీవన్ రామ్ తల్లిదండ్రులు. జగ్జీవన్ రామ్ స్కూల్‌కి వెళ్లే నాటికి చర్మకారులు, పాకీ వృత్తివారు మొదలగు దళిత కులాల ప్రజలు దుర్భరమైన అంటరానితనం, బానిసత్వంలో నలిగిపోతూ ఉండేవారు.

గ్రామ వీధుల్లో, పురవీధుల్లో, చర్మకారులు నడవడానికి ఆంక్షలు ఉండే వి. జగ్జీవన్ రామ్ చదువుకుంటున్న ఆరా పట్టణం స్కూల్లో అగ్రకుల హిందువులకు, ముస్లింలకు వేరువేరు మంచినీటి కుండలుండేవి. దాహంతో ఉన్న జగ్జీవన్ రామ్ ఒక రోజు అగ్రకుల హిందువుల కుండలోని మంచినీళ్లు తీసుకుని తాగాడు. ఇది చూసిన అగ్రకులాల విద్యార్థులు ‘చర్మకారుడైన అయిన జగ్జీవన్ రాం ముట్టుకున్న కుండని మేము ముట్టుకోము’ అని, స్కూలు కుండలో మంచి నీటిని తాగడం మానేశారు. దీనితో హెడ్మాస్టర్ అగ్రకుల విద్యార్థులకు, దళిత విద్యార్థులకు వేరు వేరు మంచినీటి కుండలు పెట్టించారు. ఇది చూసిన జగ్జీవన్ రామ్ హిందువులు, ముస్లింల కంటే తన దళితుల సాంఘిక స్థాయి ఇంత హీనమైనదా అని తీవ్రంగా కలత చెందాడు, ఆగ్రహించాడు.

ఎవరూ చూడకుండా కుండలను తానే పగలగొట్టి, ఎవరో పగలగొడుతున్నారని ఫిర్యా దు చేసేవాడు. మళ్లీ పెట్టేవారు జగ్జీవన్ మళ్ళీ పగలగొట్టేవాడు. చివరికి జగ్జీవన్ అభిమతాన్ని గమనించిన హెడ్మాస్టర్ విద్యార్థులందరికీ స్కూల్లో ఒకటే కుండ ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో జగ్జీవన్ శాంతించాడు, సంతోషించాడు. అలా జగ్జీవన్ రామ్ భవిష్యత్ పోరాటాలకు స్కూల్లోనే పునాదులు పడ్డాయి. బనారస్‌లో క్షవరం కోసం మంగలి షాప్‌కి వెళ్ళేవాడు. జగ్జీవన్ రాం చర్మకార కులస్థుడని తెలిశాక, మంగలి వారు క్షవరం చేయడం మానేశారు. చర్మకారులకు క్షుర కర్మ చెయ్యడానికి నిరాకరించడం మానవత్వానికే తీరని అవమానమని, ఇందుకు నిరసనగా ప్రజలు మంగలి షాపులను బహిష్కరించాలని జగ్జీవన్ రామ్ బస్తీలన్నీ తిరిగి జనాన్ని కూడగట్టాడు. ప్రజలు బహిష్కరించడం మొదలుపెట్టారు దీనితో మంగలివారు వైఖరిని మార్చుకుని చర్మకారులకు క్షవరాలు చేయడానికి ముందుకు వచ్చారు.

జగ్జీవన్ రామ్ ఆర్య సమాజం వారి విద్యార్థి వసతి గృహంలో భోజనం చేస్తూ కాలేజీకి వెళ్లేవాడు. జగ్జీవన్ రామ్ కులం తెలుసుకున్న హాస్టల్లోని వంటవారు అతని పాత్రలు కడగడం మానేసారు. ఈసంగతి తెలియగానే మెస్ మేనేజర్ పనివారిని మందలించాడు. ఫలితం లేదు. జగ్జీవన్ రామ్ హాస్టల్‌లో ఉన్నంత వరకు ఏ ఒక్క దళితేతర పని వారు అంట్లు తోమే పనిలో చేరలేదు. ఒక అధ్యాపకుని ఆహ్వానం మేరకు జగ్జీవన్ రామ్ నాలుగు రోజులు అతని ఇంట్లో భోజనం చేశాడు. నాలుగో రోజు జగ్జీవన్ రామ్ చర్మకారుడని తెలిసిన నౌకర్లు అధ్యాపకుని ఇంట్లో పని మానేశారు. ఆ తర్వాత ఆశీఘాట్‌లో ఒక శూద్రుని ఇంటిని జగ్జీవన్ రామ్ అద్దెకు తీసుకున్నాడు. ఒక నెల అద్దె అడ్వాన్స్ కూడా చెల్లించాడు. మరుసటి రోజు ఇంట్లో చేరడానికి సామాన్యులతో వెళ్లగా ఆ ఇంటి యజమాని అడ్వాన్స్ డబ్బుతో ఎదురొచ్చాడు. తానొక పూజారి వద్ద నౌకరిని అని, చర్మకారులైన మీకు ఇల్లు అద్దెకిచ్చిన సంగతి తెలిస్తే తన ఉద్యోగం ఊడుతుందనీ, ఇరుగు పొరుగులు కూడా హేళన చేస్తారు కనుక, అడ్వాన్స్ డబ్బు వెనక్కి తీసుకుని తిరిగి వెళ్ళమని జగ్జీవన్ రామ్‌ని ఇంటి యజమాని కోరాడు.

చాలా అవమానంగా భావించిన జగ్జీవన్రామ్ ‘అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఇప్పుడు వద్దంటున్నావు. ఏం చేసుకుంటావో చేసుకో. నేను ఇక్కడి నుంచి కదలను’ అంటూ సామానుతో సహా అద్దె ఇంట్లోకి ప్రవేశించాడు. కొద్దిరోజులు ఇంటి యజమాని, జగ్జీవన్ రామ్ ఎడమొహం పెడమొహంగా ఉన్నప్పటికీ, త్వరలోనే వారిద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధం ఏర్పడింది. బాబూజీ చిన్ననాటి నుంచే వివక్షపై తిరుగుబాటు చేశాడు అనే దానికి ఈ సంఘటనలు కొన్ని మచ్చుతునకలు. జగ్జీవన్ రామ్ 1914లో లో పట్టణంలో ప్రాథమిక విద్య ప్రారంభించి, 1925లో అగర్వాల్ మిడిల్ స్కూల్ నుండి మెట్రిక్యులేషన్ పాసయ్యారు. కాలేజీ విద్య కోసం బెనారస్ విశ్వవిద్యాలయంలో చేరి, అనారోగ్య కారణాల వల్ల చదువు మధ్యలో వదిలివేయవలసి వచ్చింది. బాబూజీ ఉన్నత విద్య పట్ల శ్రద్ధతో, కలకత్తాలోని విద్యాసాగర్ కాలేజీలో చేరాడు.

1927లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బిఎస్‌సి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆనాటి సమాజంలో బాల్యవివాహాలు సహజమైనందున జగ్జీవన్ రామ్‌కు ఎనిమిదవ ఏటనే వివాహం జరిగింది. భార్య కొద్ది కాలానికే (1933లో)చనిపోయింది. తిరిగి 1935లో డాక్టర్ బీర్బల్ కుమార్తె ఇంద్రాణి దేవితో పెళ్లి జరిగింది. వీరికి సురేష్ కుమార్, మీరా అను ఇద్దరు సంతానం కలిగారు. జగ్జీవన్ రామ్ 1930లో గాంధీ దృష్టిలోపడ్డారు. 1935లో కాన్పూర్‌లో జరిగిన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ (అఖిల భారత దళిత వర్గాల సంఘం) మహాసభలకు అధ్యక్షత వహించగా, ఈ మహాసభలను గాంధీ ప్రారంభించడం విశేషం. డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్‌కు 1936 నుండి 1942 వరకు బాబూజీ అధ్యక్ష వహించారు. 1935లో జగ్జీవన్ రామ్ బీహార్ శాసన మండలికి నామినేట్ అయ్యారు. అదే సంవత్సరం బీహార్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 15 ఎస్‌సి రిజర్వుడు ఎమ్మెల్యే స్థానాలకు జగ్జీవన్ రామ్ అభ్యర్థులను పోటీకి దింపారు. 15 నియోజక వర్గాలకు 15 మంది అభ్యర్థులు గెలిచారు. వీరిలో 14 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కావడం మరో విశేషం.

1942 ఆగస్టు 7 న ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు జగ్జీవన్ రామ్ జైలుకు వెళ్లవలసి వచ్చింది. అంతేకాదు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్‌ను రద్దు చేసింది. 1943లో జగ్జీవన్ రామ్ జైలు నుండి విడుదలయ్యాడు. విస్తృత పర్యటనలు చేసి, సభలు సమావేశాలు నిర్వహించి, దళిత వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి జగ్జీవన్ రామ్ చాలా కృషి సల్పారు. 1946లో నెహ్రూ ప్రధానిగా ఏర్పడిన తాత్కాలిక మొదటి మంత్రి మండలిలో జగ్జీవన్ రామ్ మొదటి కార్మికశాఖ మంత్రిగా చేరారు. మంత్రులందరిలోకెల్లా చిన్న వయసు వాడైనందున అందరూ బాబూజీని ‘బేబీ మినిస్టర్’ అని పిలిచేవారు. అప్పటి నుండి 29 సంవత్సరాలు కేంద్రమంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా, సెంట్రల్ పార్లమెంట్ బోర్డు సభ్యునిగా, పిసిసి అధ్యక్షునిగా, ఇంకా అనేక కీలక పదవులను బాబూజీ నిర్వహించారు. దళిత వర్గాల ప్రజల సమస్యలు, అభిప్రాయాలను తెలియ చేయమని, బ్రిటిష్ కేబినెట్ మిషన్ బాబూజీని ఆహ్వానించింది.

1947లో రాజ్యాంగ పరిషత్తుకు బాబూజీ ఎన్నికయ్యారు. ఇదే సంవత్సరం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కార్మిక మహాసభ అధ్యక్షునిగా బాబూజీ ఎన్నికయ్యారు. కేంద్ర కార్మిక శాఖ, వ్యవసాయం, ఆహారం, ఉపాధి, పునరావాసం, రక్షణ, రైల్వే, సమాచార శాఖలను మూడు దశాబ్దాలు ఎంతో ప్రజ్ఞాపాటవాలతో, బాధ్యతతో బాబూజీ నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో, నాయకత్వాల్లో, అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం లభించడానికి బాపూజీ అవిశ్రాంతంగా కృషి చేశారు. ఇందిరా గాంధీ నియంతృత్వ ధోరణితో విసిగిపోయిన జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయి ‘కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ’ అనే పార్టీని స్థాపించారు. తర్వాత ఇది జనతా పార్టీలో విలీనమైంది.

1977లో మురార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా జనతా పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో జగ్జీవన్ రామ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా.. ఉప ప్రధాన మంత్రిగా 1979 వరకు కొనసాగారు. అంతఃకలహాల కారణంగా, జనతా పార్టీ ప్రభుత్వం పడిపోయింది. 1980లో బాబూజీ కాంగ్రెస్ (జె) పేరుతో పార్టీని స్థాపించారు. 1950లో సికింద్రాబాద్ కర్బలా మైదానంలో జరిగిన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ మహాసభల్లో బాబూజీ పాల్గొన్నారు. గడ్డివాములో మాదిగ కోటేశు దహనం సంఘటనపై 1965లో బాబూజీ, కృష్ణా జిల్లా కంచికచర్ల గ్రామాన్ని సందర్శించారు.

1976లో ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రప్రదేశ్ హరిజన మహాసభల్లో ముఖ్య అతిథిగా బాబూజీ పాల్గొన్నారు. మన రాష్ట్రానికి చెందిన మాజీ కేంద్ర పెట్రోలియం, రసాయనాల శాఖామంత్రి కీర్తిశేషులు జేబీ ముత్యాలరావు, రాష్ట్ర మాజీ మంత్రి డిప్యూటీ స్పీకర్ కీర్తిశేషులు సదాలక్ష్మి, ముదిగొండ ఈశ్వరయ్య మొదలగు దళిత నాయకులకు బాపూజీ అండగా ఉన్నారు. 1985లో దేశ ప్రజలు బాబూజీ జన్మదినోత్సవాన్ని ‘సమతా దివస్’గా జరుపుకున్నారు. 1986 జూలై 6వ తేదీన మహా పరినిర్వాణం చెందిన బాబూజీ కోసం కేంద్ర ప్రభుత్వం దేశమంతటా మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. జూలై ఏడవ తేదీని రాష్ట్ర ప్రభుత్వాలు సంతాప సెలవు దినాన్ని ప్రకటించాయి. సాహసి, మేధావి, ఉద్యమకారుడు, పరిపాలనాదక్షుడు, ఆత్మగౌరవ జెండా, నాయకుడు, విజేత అయిన బాబూజీ జీవితం ఒక గొప్ప విజయగాథ. ప్రజల్లో కార్యకర్తల్లో, నాయకుల్లో స్ఫూర్తి రగిలిస్తూనే ఉంది. బాబూజీ జీవితాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. బాబూజీకి ఇప్పటికైనా భారత ప్రభుత్వం ‘భారత రత్న’ను ప్రకటించాలి. వివక్షల కొలిమిలో నుంచి నిగ్గుతేలిన నిరుపమాన ప్రజా నాయకుడు బాబూజీకి సమతా చేతనాంజలి.

కృపాకర్ పొనుగోటి, 99483 11667

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News