Friday, November 22, 2024

అంబేడ్కర్ ఆశయాలకు గండి!

- Advertisement -
- Advertisement -

Dr. BR Ambedkar Birthday on April 14

భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జన్మ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 14 న ఆ మహనీయుని ఆశయాలను మననం చేసుకొని అంకితం కావలసిన జాతీయ వేడుక. అంబేడ్కర్ ఆశయాల్లో ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణ చాలా ముఖ్యమైంది. సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని సాధించాల్సిన భారత దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థలు వెన్నెముక వంటివి. వాటిని నాశనం చేయడానికి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం పగబట్టింది. ఆర్ధిక వ్యవస్థలో సరళీకరణ విధానాన్ని చేపట్టిన కేంద్ర ప్రభుత్వం 1991 నుండి పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో కొన్ని ప్రభుత్వరంగ సంస్థల్లోని ప్రభుత్వ వాటాలను 24 శాతం, 49 శాతం, 74 శాతం చొప్పున ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకొంటూ వస్తోంది. ఇప్పుడు 100 శాతం వాటాలను, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలనే స్వదేశీ విదేశీ మల్టీ నేషనల్ కంపెనీలకు అప్పనంగా అప్పగించడానికి తెగబడింది. 2021 -22 కేంద్ర బడ్జెట్ ని సమర్ధిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ 2021 ఫిబ్రవరి 24న ఒక వెబినార్ లో సందేశంయిస్తూ ‘ప్రభుత్వం బిజినెస్ చేయకూడదు, బిజినెస్ సంస్థలను మోనిటర్ చేయడం, వాటికి అవసరమైన వసతులు, సదుపాయాలు సమకూర్చడం వరకే ప్రభుత్వం పరిమితం కావాలి’ అని చెప్పుకొచ్చారు.

ప్రధాని వ్యాఖ్య విచిత్రంగా, బాధ్యతారహితంగా వుంది. అది భారత ఆర్ధిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన రాజ్యాంగ నిర్మాత మహనీయుడు అంబేడ్కర్ ఆశయానికి అశనిపాతం వంటిది. 1944 ఆగస్టు 24న కలకత్తాలో చేసిన ప్రసంగంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి విద్య, పరిశ్రమలకు ప్రథమ ప్రాధాన్యత ఉండాలని అంబేడ్కర్ చెప్పారు. వ్యవసాయ రంగంలో జరిగే పరిమితమైన ఉత్పత్తిని అధిగమించడానికి, అదనపు మానవ వనరుల వినియోగమునకు పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పాలని సూచించారు. ఆధునిక పరిశ్రమలతో సాంప్రదాయక వృత్తుల నుండి ప్రజలు విముక్తి చెంది ఆర్ధిక స్వావలంబనతో కుల వివక్షతను అధిగమించవచ్చని ఆశించారు. ప్రైవేట్ సంస్థల దోపిడీ నుండి రక్షణ కోసం పరిశ్రమలు, వ్యవసాయం ప్రభుత్వరంగంలో ఉండాలని రాజ్యాంగ రచనా కమిటీలో బాబా సాహెబ్ అంబేడ్కర్ గట్టిగా వాదించారు. భారత సమాఖ్య తన రాజ్యాంగ సూత్రాల్లో క్రింది చట్టపరమైన అంశాలు ప్రకటించాలని ప్రతిపాదించారు.

1. కీలక పరిశ్రమలు, కీలకంగా ప్రకటించబోయే పరిశ్రమలూ ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి. ప్రభుత్వమే వాటిని నడపాలి.
2. కీలక పరిశ్రమలు కాకపోయినా, మౌలిక పరిశ్రమలైన వాటిని ప్రభుత్వ నియంత్రణలో ఉంచాలి. ప్రభుత్వ లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలు వాటిని నడపాలి.
3. బీమా రంగం ప్రభుత్వ గుత్తాధికారం కింద ఉండాలి. ప్రతి వయోజన పౌరుడు తన చట్టబద్ధమైన వేతనానికి అనుగుణంగా తప్పనిసరిగా జీవిత బీమా పాలసీ తీసుకోవాలి.
4. వ్యవసాయాన్ని ప్రభుత్వ పరిశ్రమగా ప్రకటించాలి.
5. పరిశ్రమలు, బీమా కంపెనీలు, వ్యవసాయ భూమి ప్రైవేట్ వ్యక్తుల వద్ద వుంటే .. వారు వాటికి యజమానులు కావచ్చు, కౌలుదారులు కావచ్చు, వారికి ఆ భూమిలో హక్కు భుక్తాలకు సమానమైన వాటాల రూపంలో పరిహారం చెల్లించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.

అంబేద్కర్ సూచనలకు అనుగుణంగా 1948లో బాంబే ప్లాన్ పేరుతో మొదటి పారిశ్రామిక తీర్మానం చేయబడింది. 1950 లో ప్రణాళికా సంఘం, 1951 లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ చేయబడినవి. ఆర్ధిక అభివృద్ధికి తోడ్పడే మౌలిక వసతుల కల్పన, వ్యూహాత్మక రంగాలకు అవసరమైన సాధన సంపత్తిని అందించడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆదాయాన్ని చేకూర్చడం ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన లక్ష్యాలు. ప్రభుత్వం పరిశ్రమలను స్థాపించడంతో పాటు ప్రైవేట్ రంగంలోని నష్టాలతో నడుస్తున్న, మూతబడిన పరిశ్రమలను కూడా తీసుకొని పునరుద్ధరించింది. 1969లో 14 పెద్ద ప్రైవేట్ బ్యాంకులను, 1980 లో మరో 6 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. 1951లో 5 మాత్రమే ఉండే ప్రభుత్వరంగ సంస్థలు 2019 మార్చి నాటికి 348కి పెరిగి, దాదాపు రూ. 16.41 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగినవి.

2018-19లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే రూ. 25.43 లక్షల కోట్లు ఆదాయాన్ని సంపాదించినవి, రాష్ట్రాల ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార రంగ సంస్థల్లో అత్యధికం 1990 వరకు లాభాలు గడించినవి. ఎన్‌టిపిసి, ఒఎన్‌జిసి, సెయిల్, బిహెచ్‌ఇఎల్, హెచ్‌పిసిఎల్, సిఐఎల్, బిపిసిఎల్, పవర్ గ్రిడ్ తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఎస్‌బిఐ, బిఒబి, యుబిఐ, పిఎన్‌బి, సిబిఐ, ఐఒబి మున్నగు జాతీయ బ్యాంకులు దేశ ఆర్ధిక సౌధానికి వెన్నుదన్నుగా నిలిచి ప్రపంచ పోటీని తట్టుకునే దిగ్గజ సంస్థలుగా ప్రసిద్ధికెక్కినవి. 1990- 91 ప్రపంచ ఆర్ధిక మాంద్యంలో అనేక అభివృద్ధి చెందిన దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలినా భారత ఆర్థిక వ్యవస్థ నిలబడడానికి ప్రభుత్వ రంగ సంస్థలే ఆధారం. దేశ స్వావలంబనకు, ప్రజా సంక్షేమానికి పట్టుకొమ్మలుగా అలరారుతున్న అలాంటి సంస్థలను ‘ఆత్మ నిర్భర భారత్’ పేరుతో అంతం చేయడానికి మోడీ ప్రభుత్వం కత్తిగట్టింది.

కష్టపడి సంపాదించి సంసారాన్ని పోషించుకుంటూ భవిష్యత్ తరాల కోసం ఆస్తులను పోగేయడం చేతగానివారు తాతలు కూడబెట్టిన సంపదను తెగనమ్ముకొంటూ బడాయిగా బతుకుతుంటారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న పని అదే. జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని తొలి స్వతంత్ర భారత ప్రభుత్వం 32 ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపిస్తే లాల్ బహదూర్ శాస్త్రి పాలనలో 47, ఇందిరా గాంధీ మొదటి టర్మ్‌లో 47 రెండో టర్మ్‌లో 18, మొరార్జీ దేశాయ్ హయాంలో 9, రాజీవ్ గాంధీ జమానాలో 16, పి.వి. నరసింహారావు పాలనలో 14, దేవెగౌడ అధికారంలో 3 సంస్థలు స్థాపించబడినవి. ఆ తర్వాతి ప్రధాన మంత్రుల ఏలుబడిలో ప్రభుత్వ సంస్థల్లోని పెట్టుబడుల వాటాలను అమ్ముకోవడం మొదలైంది. తొలి ఎన్‌డిఎ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఎ.బి. వాజపేయి పాలనలో 12 పరిశ్రమలు స్థాపించగా 7 పరిశ్రమల్లోని రూ. 33 వేల కోట్ల విలువగల వాటాలను అమ్మేశారు. మన్మోహన్ సింగ్ పదేండ్ల పరిపాలనలో 23 సంస్థలను నెలకొల్పగా 3 సంస్థల్లోని రూ. 1.40 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించడం జరిగింది.

కాగా నరేంద్ర మోడీ నాయకత్వంలోని (అ)సమర్ధ ప్రభుత్వంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను స్థాపించక పోగా 338 సంస్థలను టోకుగా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టడానికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఈ ఆర్ధిక సంవత్సరం 2021-22 లో రూ. 2.75 లక్షల కోట్ల విలువ గల సంస్థలను అమ్మేయడానికి సిద్ధపడింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు చెప్పే మాటలు ‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ గడ్డి కోసం’ అన్నట్టుగా వుంది. నష్టాలతో నడుస్తున్న సంస్థలను నడపడం దేశానికి నష్టం గనుక వదిలేయక తప్పదంటున్నారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం ద్వారా వచ్చే సొమ్ముతో 4 లైన్ల రోడ్లను 6 లైన్ల రోడ్లుగా అభివృద్ధి చేయడం వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పనులకు వెచ్చిస్తామని, తద్వారా ఉపాధి అవకాశాలను పెంచుతామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆ రెండు రకాల చర్యలతో కూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకే మేలు జరుగుతుందనే విషయాన్ని మాత్రం చెప్పడం లేదు.

ప్రభుత్వరంగ సంస్థలు, పరిశ్రమలను అమ్మడం, వదిలేయడం వలన దేశ స్వావలంబనకు విఘాతం కలగడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కుదించుకుపోయి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల అభివృద్ధి హరించుకుపోతుంది. ‘కరి మింగిన వెలగపండు’ లాగా రిజర్వేషన్లు డొల్లగా మారిపోతాయి. 30 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆఫీసర్ల నుండి అటెండర్ల వరకు రెగ్యులర్ ఉద్యోగులుగా 25 లక్షల మంది పని చేసేవారు. నూతన ఆర్ధిక విధానాల ఎత్తుగడతో అప్పటి నుండి ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయకపోవడం, డిజిన్వెస్టుమెంటుతో పోస్టులు రద్దు కావడం వలన ఉద్యోగుల సంఖ్య 75% పైగా తగ్గిపోయింది. ఉదాహరణకు బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ టెలికం డిపార్టుమెంటుగా వున్నప్పుడు దేశ వ్యాప్తంగా 3.40 లక్షల మంది ఉద్యోగులు పని చేసేవారు.

దానిని టెలికం డిపార్టుమెంటు నుండి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎసెనెల్) అనే ప్రభుత్వ రంగ సంస్థగా మార్చి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి నిధులు ఇవ్వకుండా రిలయన్స్, ఎయిర్ టెల్, వోడాఫోన్ వంటి కార్పొరేట్ సంస్థల పోటీని తట్టుకోలేకుండా చేసి దివాలా తీయించారు. ఇప్పుడు ఆ బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థలో 86 వేల మంది ఉద్యోగులు మాత్రమే మిగిలారు. ఎల్‌ఐసి, బ్యాంకులు, కోల్ మైన్స్, రక్షణ రంగ సంస్థలు, ఎయిర్ లైన్స్, హైవేస్, రేల్వేస్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ వంటి సంస్థల్లో లక్షల మంది ఉద్యోగులుగా వున్నారు. వారిలో రిజర్వేషన్ల అమలు వలన సగాని కంటే ఎక్కువ మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసి తరగతుల వారు వున్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వ నిర్వాకం వలన ప్రభుత్వరంగ సంస్థలు ఎగిరి పోవడంతో అందరి ఉద్యోగాలతో పాటు బలహీన వర్గాల ఉద్యోగాలు రద్దవుతున్నవి. సామజిక న్యాయం సమసిపోతుంది అంబేడ్కర్ ఆశయం అంతమవుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News