Thursday, January 23, 2025

జలవనరుల అభివృద్ధిలో అంబేడ్కర్ పాత్ర

- Advertisement -
- Advertisement -

డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తన జీవిత కాలంలో భారత దేశం ఎదుర్కొన్న అన్ని సమస్యల మీద తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆయన భారత దేశ రాజ్యాంగ రచనకు సారథ్యం వహించి అకుంఠిత దీక్షతో రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించిన సంగతి అందరికీ ఎరుకే. కుల నిర్మూలనకు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అందరికీ తెలిసిందే. భారత రాష్ట్రాల పునర్విభజన సందర్భంగా ఆయన తన ఆలోచనలను దేశ ప్రజలతో పంచుకున్నారు. ఒక రాష్ట్రానికి ఒక భాష ఉండాలన్న వాదాన్ని అంగీకరిస్తూనే ఒక భాషకు ఒకటికి మించి రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే తప్పేమీ లేదని వాదించినారు. చిన్న రాష్ట్రాలే అణగారిన వర్గాలకు ప్రజాస్వామ్యంలో సముచిత స్థానం కల్పిస్తాయని వాదించినారు.

కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ని పొందుపర్చడంలో రాజ్యాంగ రచనా సభలో అంబేడ్కర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలంగాణ ఉద్యమ సందర్భంగా విస్తృతంగా చర్చకు వచ్చింది. ఈ ఆలోచనలు, అభిప్రాయాలు అన్నీ అంబేడ్కర్ రచనల సంపుటాల్లో చోటు చేసుకున్నాయి. అయితే భారత దేశ జలవనరుల అభివృద్ధి అంశంలో స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రానంతరం అంబేడ్కర్ ఆలోచనలు విశేషంగా దోహదపడిన సంగతి ఎక్కువగా వెలుగులోకి రాలేదు. ఆయన రచనల సంపుటాల్లో కూడా ఇవి చోటు చేసుకోలేదు.
ఒక రకంగా అది విస్మరణకు గురైన చరిత్ర. 2015లో తెలుగు అకాడెమీ వారు ప్రచురించిన డా. బిఆర్ అంబేడ్కర్ ప్రసంగాలు రెండవ సంపుటిలో ఈ అంశంపై నాలుగు ప్రసంగ వ్యాసాలు చోటు చేసుకున్నాయి. అంతకు చాలా కాలం పూర్వమే 1993 లో కేంద్ర జల సంఘం వారు ‘Ambedkars Contribution to Water Resources Development’ శీర్షికతో ఒక సమగ్రమైన పుస్తకాన్ని వెలువరించారు.

Also Read: పీడితులకు గొంతునిచ్చిన జర్నలిస్టు అంబేడ్కర్

ఈ పుస్తక ప్రచురణకు ముందు సమగ్ర సమాచార సేకరణ చేసి పరిశోధనా పత్రాన్ని తయారు చేయడం కోసం 1991లో ఎబి జోషి అధ్యక్షుడుగా ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ. వీరి పరిశోధనను ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రాంతీయ అభివృద్ధి అధ్యయన కేంద్రానికి చెందిన ప్రొఫెసర్ సుఖదేవ్ థోరట్ పర్యవేక్షించినారు. కమిటీ రెండు సంవత్సరాలు విస్తృత పరిశోధన చేసి సమగ్ర సమాచారంతో ఈ పుస్తకాన్ని రూపొందించినారు. ఈ పుస్తకం కూడా దేశ ప్రజల దృష్టిలోకి రాకుండా పోయింది. 2016లో అంబేడ్కర్ 125 వ జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర జల సంఘం ఆ పుస్తకాన్ని పునర్ముద్రణ చేసింది. రెండవ ముద్రణ వెలువడిన తర్వాత జల వనరుల అభివృద్ధి కోసం అంబేడ్కర్ కృషి కొత్తగా దేశప్రజల ముందుకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నేడు (శుక్రవారం) అంబేడ్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహావిష్కరణ జరుపుతున్న విశిష్ట సందర్భంగా డా. బిఆర్ అంబేడ్కర్ ఆలోచనలపై మరొక్కసారి విస్తృతంగా చర్చ జరుగుతున్నది. జల వనరుల అభివృద్ధిపై అంబేడ్కర్ ఆలోచనలను సంక్షిప్తంగా చర్చించడమే ఈ వ్యాసం లక్ష్యం.

భారత దేశ జలవనరుల అభివృద్ధిపై పాలసీల రూపకల్పనలో అంబేడ్కర్ కృషి పెద్దగా చర్చకు రాకపోయినప్పటికీ అవి అత్యంత ప్రాముఖ్యత కలిగినవి. ఈ అంశంలో అంబేడ్కర్ రెండు సందర్భాలలో ప్రత్యక్షంగా పాల్గొని జల వనరుల అభివృద్ధి పాలసీలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించినారు. ఒకటి 1942 -46 మధ్య కాలంలో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో కార్మిక, పరిశ్రమలు, సాగునీరు, విద్యుత్ శాఖలను నిర్వహించినప్పుడు; రెండవది 1947- 52 మధ్య కాలంలో జవహర్ లాల్ నెహ్రూ మంత్రి వర్గంలో న్యాయ శాఖ మంత్రిగా పని చేసినప్పుడు జలవనరుల అభివృద్ధ్దికి సంబంధించిన పాలసీలను రూపకల్పన చేయడంలో తన శాఖలకు మార్గనిర్దేశనం చేసినారు. 1937లో భారత ప్రభుత్వం కార్మిక శాఖను ఏర్పాటు చేసింది. పరిశ్రమలు, సాగు నీరు, విద్యుత్ ఇతర ప్రజా పనుల విభాగాలు కూడా కార్మిక శాఖ పరిధిలోనే ఉండేవి. కాబట్టి సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన విధానాల రూపకల్పనలో కార్మిక శాఖ ఇన్చార్జ్ గా ఉన్న అంబేద్కర్ చూసుకోవాల్సి వచ్చింది. ఆ క్రమం లో పాలసీ పరమైన అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటి పరిణామ ఫలితంగా ఈ కింది ప్రణాళికలు రూపొందినాయి.

జల వనరుల అభివృద్ధి, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి భారత దేశం మొత్తానికి వర్తించే విధంగా నిర్దిష్టమైన పాలసీ రూపొందించడం.పైన పేర్కొన్న వాటి అభివృద్ధి కోసం సాంకేతిక, పరిపాలనా అంశాలు పర్యవేక్షించడానికి ప్రత్యేకమైన సంస్థలను ఏర్పాటు చేయడం. ఆనాడు అట్లా ఏర్పాటు అయినదే సెంట్రల్ వాటర్ వేస్, ఇరిగేషన్&నావిగేషన్ కమిషన్ (CWINC). అంబేడ్కర్ సారథ్యం వహించిన కార్మిక శాఖ సిఫారసుల ఆధారంగా అన్నీ రాష్ట్రాలు, ప్రావిన్స్‌ల ప్రభుత్వాల అంగీకారంతో ఏప్రిల్ 1945లో ఈ కమిషన్ ఏర్పాటు జరిగింది. ఈ మాతృ సంస్థ నుంచే ఇప్పుడున్న కేంద్ర జల సంఘం (Central Water Commission), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్&పవర్ (CBIP) మొదలైన సంస్థలు, కేంద్ర విద్యుత్ అథారిటీ (Central Electricity Authority) ఆ తర్వాత కాలం లో ఏర్పాటు అయినాయి.
కేంద్రం లేదా రాష్ట్రాల నిర్వహణలో ప్రధాన నదీ జలాల అభివృద్ధికి అథారిటీలను (River Vally Authority) ఏర్పాటు చేయడం. ఈ నిర్ణయాల ఫలితంగానే బీహార్, బెంగాల్ రాష్ట్రాలలో దామోదర్ రివర్ వ్యాలీ అథారిటీ, ఒడిశా రాష్ట్రంలో ఈనాడున్న సోన్ రివర్ వ్యాలీ అథారిటీ, మహానదీ రివర్ వ్యాలీ అథారిటీలు ఏర్పడినాయి. అట్లానే సెంట్రల్ ప్రావిన్స్‌లో చంబల్ రివర్ వ్యాలీ అథారిటీ కూడా ఏర్పాటు అయ్యింది.

మహానది, సోన్ లాంటి అనేక చిన్న, పెద్దా నదులు ప్రవహిస్తున్న ఒడిశా రాష్ట్రం అన్నీ రంగాలలో వెనుకబడిపోవడం పట్ల అంబేడ్కర్ అనేక సార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశా రాష్ట్రంలో నదీ జలాల అభివృద్ధిపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. 8 నవంబర్, 1945 న కటక్ లో ఒడిశా నదుల అభివృద్ధి పై జరిగిన సదస్సులో అంబేడ్కర్ అధ్యక్షోపన్యాసం చేస్తూ ఒడిశాలో నదీ జలాల అభివృద్ధి ప్రణాళికలపై తన అభిప్రాయాలను వెల్లడి చేశారు. ఏ ఇతర ప్రాంతానికి తీసిపోని సహజ వనరులున్న ఒడిశా ఇంకా ఎంత మాత్రం అట్లాగే వెనుకబడి ఉండటానికి వీలు లేదు. బొగ్గు, ఇనుప ఖనిజం, గ్రాఫైట్, బాక్సైట్, సున్నపురాయి, మైకా, వెదురు, కలప లాంటి ప్రాధాన్యత కలిగిన సహజ వనరులెన్నో ఒడిశాలో ఉన్నాయి. వీటికి మించి అతి ముఖ్యమైన జల సంపద ఒడిశా ప్రత్యేకత. మహానది, బ్రాహ్మణి, వైతరణి నదులు, వాటి ఉప నదుల సముదాయం కటక్, పూరీ, బాలసోర్ జిల్లాల్లో 8 వేల చదరపు మైళ్ళ మేర విస్తరించి ఉన్నాయి. ఇన్ని వనరులున్న ఒడిశా ఎందుకు వెనుకబడింది అని వాపోయినారు.

Also Read: నాటోలో ఫిన్‌లాండ్

నదీ జలాల అభివృద్ధికి సరి అయిన ప్రణాళికలు అమలు జరిపితే రాబోయే సుదూర భవిష్యత్తులో ఒడిశా తన వనరులను వినియోగించుకోగలదని, సమృద్ధిగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలదని, వరదల నియంత్రణకు, నౌకాయానానికి జలవనరులు ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.అమెరికాలో ఏర్పాటు అయిన టెన్నెసి వ్యాలీ అథారిటీ నమూనాను, అక్కడి అభివృద్ధి ప్రణాళికలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినారు అంబేడ్కర్. ఈ మోడల్ భారత దేశ నదుల అభివృద్ధికి బాగా పనికి వస్తాయని ఆయన భావించారు. టెన్నెసి వ్యాలీ అథారిటీ స్ఫూర్తితో ఆనాడు ఆయన రూపొందించిన ప్రణాళికల కారణంగానే బీహార్, బెంగాల్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న దామోదర్ నదీ జలాల వినియోగం అభివృద్ధి కోసం దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అథారిటీ ఏర్పాటు అయ్యింది. ఇదే దేశంలో ఏర్పాటు అయిన మొదటి రివర్ వ్యాలీ అథారిటీ. అట్లానే ఒడిశాలో సోన్ వ్యాలీ ప్రాజెక్ట్, మహానదిపై హీరాకుడ్ ప్రాజెక్టులు నిర్మాణం అయి ఒడిశా అభివృద్ధికి బాటలు వేశాయి.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్ట్, 1935 లో నదీ జలాల అభివృద్ధి అంశం రాష్ట్రాల పరిధిలోనే ఉండేది. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1948 లో ఒక సవరణ ద్వారా అంతర్రాష్ట్ర నదీ జలాల అబివృద్ధికి సంబంధించి చట్టాలను చేసే అధికారాన్ని కేంద్రానికి దఖలు పరిచే ఆర్టికల్ 74 ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినారు అంబేడ్కర్. అట్లా 1935 చట్టంలో లేని అధికారాలు కొంత మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఈ ఆర్టికల్ ద్వారా సంక్రమించినాయి. అట్లానే రాష్ట్రాల మధ్య తలెత్తే నదీ జలాల పంపిణీ సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 262 ను చేర్చడంలో కూడా అంబేడ్కర్ కీలక పాత్ర పోషించినారు.

ఆర్టికల్ 262 రాజ్యాంగంలో చేర్చబడిన తర్వాత 1956 లో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం (Inter StateRiver Water Dispute Act) పార్లమెంట్‌లో ఆమోదం పొంది అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ఆధారంగానే దేశంలో రావి బియాస్, కృష్ణా, గోదావరి, కావేరీ, వంశధార నదీ జలాల ట్రిబ్యునళ్ళు ఏర్పాటు అయ్యాయి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పని చేస్తున్న సంగతి ఎరుకే. ఈ రకంగా భారత దేశంలో నదీ జలాల అభివృద్ధికి, విద్యుత్ ఉత్పత్తికి, వరదల నియంత్రణకు, నౌకాయానం అభివృద్ధికి పాలసీలు రూపొందించడంలో అంబేడ్కర్ పాత్ర గణనీయమైనది. అయితే దురదృష్టవశాత్తు ఈ రంగంలో అంబేడ్కర్ కృషి వెలుగులోకి రాలేదు. విస్మరణకు గురి అయిన ఈ అంశాలపై కూడా విస్తృతమైన అధ్యయనం జరగవల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

శ్రీధర్ రావు దేశ్‌పాండే
(ముఖ్యమంత్రి ఒఎస్‌డి)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News