రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: తెలుగు సాహిత్యంలో సినారె ఓ శిఖరం వంటి వారని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత , పద్మభూషణ్ , రాజ్యసభ సభ్యులు, మహాకవి డా.సి.నారాయణరెడ్డి 90వ జయంత్యుత్సోవం తెలంగాణ సారస్వత పరిషత్‌లో గురువారం జరిగింది. ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రముఖ కవి జూకంటి జగన్నాథానికి సినారె పురస్కారం అందించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆయన గేయాలు, రచనలు, పాండిత్య సంపద అద్వితీయమని ఆయన కొనియాడారు. విద్యార్థులుగా ఉన్న రోజుల్లో సినారె సభలు, సమావేశాలకు స్నేహితులతో కలిసి వెళ్లేవాడినని మంత్రి గుర్తు చేసుకున్నారు. సినారె ఆహార్యమే కాదు, ప్రసంగాలు, భావ వ్యక్తీకరణ ఎంతో ఆకట్టుకునేదని ఆయన తెలిపారు.
రాజ్యసభ సభ్యుడిగా సినారె ఆరేళ్లలో 624 ప్రశ్నలు వేశారని, సాధారణంగా ఒక సభ్యుడు 100, 150 ప్రశ్నలు వేయడం ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు. సినారె ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి మ్యూజియంలో లక్ష్మీదేవి ప్రతిమను చూసి ఇక్కడ పార్లమెంటులో ప్రశ్న వేస్తే దానిని సరిచేశారని ఆయన గుర్తు చేశారు. ఆయన పరిశీలనాశక్తికి ఇది నిదర్శనమని ఆయన తెలిపారు. 1960లోనే ఓరుగల్లు రామప్ప గుడి మీద సినారె నృత్యనాటిక రాయడం వారి సునిశిత దృష్టికి నిదర్శనమని ఆయన తెలిపారు. ఆయన లేని లోటు ఇప్పట్లో పూడ్చడం కష్టమని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, శాంత బయోటెక్ అధినేత, పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి, పరిషత్ చైర్మన్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, కార్యదర్శి జుర్రు చెన్నయ్య, కోశాధికారి మంత్రి నర్సింహయ్య, ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు జేవీ రూపొందించిన సినారె తైలవర్ణ చిత్రాన్ని ఆవిష్కరించారు.