అమెరికా వైద్యనిపుణులు ఫౌచీ
న్యూయార్క్ : అమెరికాలో కానీ మరెక్కడైనా కానీ కాలక్రమంలో కరోనా వైరస్ సోకి సమసిపోయే అంటువ్యాధి స్థాయికి చేరుకుంటుందని అమెరికా ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఫౌచీ తెలిపారు. ఇప్పుడు అమెరికాలో కూడా క్రమేపీ కరోనావైరస్‌ల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇదంతా కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియతో నెలకొన్న పరిణామం అన్నారు. ఇప్పుడు దేశంలోని వారందరికి బూస్టర్ డోస్‌ల సమకూర్చాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే దేశంలోకి పర్యాటకుల సంఖ్య ఎక్కువవుతోంది. ఇది కీలక పరిణామమే, అనివార్యమే.
అయితే విదేశాలలో పూర్తి స్థాయి టీకాలు పొంది ఇక్కడికి వచ్చిన వారికి ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా బూస్టర్ డోస్‌లు వేయడం వల్ల వైరస్ మరింతగా నియంత్రణలోకి వస్తుందని దేశంలోని అంటువ్యాధుల నియంత్రణ విభాగంలో కీలక వ్యక్తి అయిన ఫౌచీ తెలిపారు. రాయిటర్స్ వార్తా సంస్థ నిర్వహించిన ఆరోగ్య సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశంలో అదుపులోకి వస్తున్న వైరస్ అంటువ్యాధుల స్థాయికి మారుతుందనుకోవచ్చు. ఈ క్రమంలో బూస్టర్ టీకాల అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పుడు ఫ్లూ , చికెన్‌పాక్స్ మాదిరిగా కరోనా కూడా ఓ అంటువ్యాధిగా వచ్చిపోతూ ఉంటుందని, దీనిని పూర్తిగా నామరూపాలు లేకుండా చేయడం కుదరదు. ఇదే దశలో దీనితో ఇంతకు ముందటిలాగా తీవ్రస్థాయి ముప్పు పరిస్థితి ఉండదని తెలిపారు.
వ్యాక్సినేషన్‌ల రేటును మరింతగా ముమ్మరం చేస్తూ పోతూ ఉంటే దేశంలో ఇప్పటి హెల్త్ ఎమర్జెన్సీ తొలిగిపోతుందని చెప్పారు. పలు దేశాల నుంచి పర్యాటకులు వస్తున్న దశలో వైరస్ ఏ స్థాయిలో ఏ రూపంలో ఉందో తెలియని దశ ఉన్నందున అత్యంత ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడికి వచ్చే విదేశీ పర్యాటకులకు ఇక్కడి పద్ధతి ప్రకారం బూస్టర్ డోస్‌లు వేయడం కీలక పరిణామం అవుతుందని, వైరస్ సమగ్ర నియంత్రణ చర్యలలో ఇది ప్రధాన ఘట్టం అవుతుందని అన్నారు. వైరస్ తీవ్రతలను బట్టి చూస్తే కొన్ని రకాలు ఎప్పటికీ అంతరించిపోకుండా ఉంటాయి.
అయితే వీటి తీవ్రత తగ్గుతుంది. కరోనా వైరస్ కూడా ఇప్పుడు ఈ దశకు చేరింది. వచ్చిపోయే స్థాయి తగ్గుదల తీవ్రతతో వైరస్ ఎటువంటిది అయినా ఉంటే మానవాళికి పెద్దగా ముప్పు ఉండదని ఫౌచీ విశ్లేషించారు. సమాజంలోని ప్రజల జీవనక్రమం, ఆర్థిక పరిస్థితి, వ్యవస్థలపై ప్రభావం పడని రీతిలో వ్యాధుల సంక్రమణలు ఉంటే, వీటిని సాధారణ ఆరోగ్య చికిత్స వ్యవస్థల క్రమంలోనే నిర్వహించవచ్చునని, వ్యాధులను తీవ్రస్థాయికి చేర్చకుండా చూసుకుంటూ జీవన పరిస్థితి సక్రమంగా సాగేలా చేసుకోవచ్చునని అన్నారు.