Saturday, November 23, 2024

హెలికాప్టర్ తోడుగా త్రీడీ చిత్రంతో భూగర్భజలాల గుర్తింపు

- Advertisement -
- Advertisement -

ఎన్‌జిఆర్‌ఐ ప్రయోగంతో సత్ఫలితాలు

Dr Jitendra launches state-of-art Helicopter-borne Survey technology

హైదరాబాద్ : భూగర్భ జలాలను కనిపెట్టడానికి సరికొత్త విధానం అందుబాటు లోకి వస్తోంది. హైదరాబాద్ లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జిఆర్‌ఐ) ప్రయోగాత్మకంగా హెలీ టోర్నీ జియోఫిజికల్ మ్యాపింగ్ సాంకేతికత (హెలీకాప్టర్ సర్వే) వినియోగించి దేశం లోని వేర్వేరు ప్రాంతాల్లో భూగర్భ జలాల జాడను కనిపెట్ట గలిగింది. సానుకూల ఫలితాలు రావడంతో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డుతో కలిసి తొలిసారి విస్తృతంగా సర్వే చేయడానికి శ్రీకారం చుట్టింది. ఇదే సాంకేతికతను వినియోగించి ముఖ్యంగా వర్షాభావ ప్రాంతాల్లో 4 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధి లోని ప్రాంతాలను భూగర్భ జలాలను గుర్తించనున్నారు. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానాల్లో ఈ సర్వే చేయనున్నారు. ఈ సాంకేతికత సహాయంతో భూమి లోపల 500 మీటర్ల లోతు వరకు త్రీడీ చిత్రంతో స్పష్టంగా నీటి జాడను గుర్తించనున్నారు.

నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన తాగునీరు, సాగునీరు అందించడానికి తాజా సర్వే ఉపయోగపడనుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.150 కోట్లు కేటాయించింది. రాజస్థాన్ లోని జోథ్‌పూర్‌లో కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మంగళవారం ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఎన్‌జిఆర్‌ఐ డైరెక్టర్ వి.ఎం తివారీ సహా ఈ ప్రాజెక్టులో కీలకంగా ఉన్న శాస్త్రవేత్తల బృందం హైదరాబాద్ నుంచి జోథ్‌పూర్‌కు తరలివెళ్లింది. ఎన్‌జిఆర్‌ఐ ప్రయోగాత్మకంగా రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్రల్లో కొన్ని ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా సర్వే చేసింది. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ దూరం సర్వే సాధ్యమైంది. ఫలితాలు ఫక్కాగా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో చేస్తున్నారు. హెలికాప్టర్ కింది భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన లూప్‌ను వేలాడదీస్తారు. హెలికాప్టర్ వెళ్లినప్పుడు భూమి లోపల ఎక్కడైనా నీటి జాడలుంటే ఎలెక్ట్రోమేగ్నెటిక్ రేడియేషన్ ద్వారా సంకేతాలు అందుతాయి. ఇదంతా ఎప్పటికప్పుడు త్రీడీ మ్యాపింగ్ జరుగుతుంది.

ప్రాథమిక సమాచారం వేగంగా అందుతుంది. కొద్దిరోజుల్లోనే పూర్తిగా చుట్టేసి రావచ్చు. తర్వాత సమగ్రంగా కావాలంటే గ్రౌండ్ సర్వే చేసుకోవచ్చు. హెలికాప్టర్ స్థానంలో భవిష్యత్తులో డ్రోన్లతో ఈ తరహా సర్వే చేసేలా ఇప్పటికే ప్రోటోటైప్ డ్రోన్ సాంకేతికతను ఎన్‌జిఆర్‌ఐ అభివృద్ధి చేసింది. భూగర్భ జల వనరులను గుర్తించేందుకు వాయువ్య భారత్‌ను ఎంపిక చేసుకోడానికి ప్రత్యేక కారణం ఉంది. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానాల్లోని కొన్ని ప్రాంతాల్లో వార్షిక వర్షపాతం 100 మి.మీ నుంచి 400 మి.మీ మాత్రమే. ఇక్కడ నివసిస్తున్న కోట్ల మంది ప్రజలకు ప్రధాన ఆధారం భూగర్భ జలాలే. భూగర్భజల వనరులను వేగంగా గుర్తించ గలిగితే ప్రజలకు తాగునీరు. సాగునీరు అందించేందుకు వీలవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News