Monday, December 23, 2024

సుందరం-క్లేటాన్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ లక్ష్మివేణు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతదేశపు సుప్రసిద్ధ ఆటో విడిభాగాల తయారీదారులలో ఒకటైన సుందరం క్లేటాన్‌ లిమిటెడ్‌(ఎస్‌సీఎల్‌)కు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఆదివారం జరిగిన బోర్డ్‌ సమావేశంలో డాక్టర్‌ లక్ష్మి వేణు బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు సుందరం క్లేటాన్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ వేణు బాధ్యతలు నిర్వర్తించారు. దాదాపు ఓ దశాబ్ద కాలంగా సుందరం క్లేటాన్‌ను డాక్టర్‌ లక్ష్మి వేణు ముందుండి నడిపిస్తున్నారు. అంతర్జాతీయంగా సుందరం క్లేటాన్‌ విస్తరించడంలో అత్యంత కీలకమైన పాత్రను పోషించారామె. అంతేకాదు, వోల్వో, హ్యుందాయ్‌, డైమ్లెర్‌, కమ్మన్స్‌ లాంటి సంస్థలతో లోతైన సంబంధాలను నిర్మించడంలోనూ ఆమె అనన్యసామాన్యమైన పాత్రను పోషించారు.

సుందరం క్లేటాన్‌ ఛైర్మన్‌ ఆర్‌ గోపాలన్‌ మాట్లాడుతూ.. ‘‘వినియోగదారులను లోతుగా లక్ష్మి అర్థం చేసుకోవడంతో పాటుగా అంతర్జాతీయంగా వినియోగదారులతో బలమైన సంబంధాలు ఏర్పడటంలోనూ ఆమె కీలకంగా వ్యవహరించారు. ప్రపంచ శ్రేణి ఆటో విడిభాగాల తయారీదారునిగా సుందరం క్లేటాన్‌ను ఆమె తీర్చిదిద్దగలరనే విశ్వాసంతో ఉన్నాను’’ అని అన్నారు.

సుందరం క్లేటాన్‌ ఆడిట్‌ కమిటీ ఛైర్మన్‌ అడ్మిరల్‌ పీజె జాకోబ్‌ (రిటైర్డ్‌) మాట్లాడుతూ.. ‘‘ఈ కష్టకాలంలో కూడా కంపెనీకి ఆమె అసాధారణ తోడ్పాటునందించారు. షాప్‌ ఫ్లోర్‌ నుంచి కంపెనీలో ఉన్నత స్థాయికి చేరడం వరకూ ఆమె పడిన కష్టానికి ప్రతిఫలమిది. కంపెనీని మరిన్ని ఉన్నత శిఖరాలను ఆమె చేర్చగలదని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

సుందరం క్లేటాన్‌ ఛైర్మన్‌ ఎమిరిటస్‌ వేణు శ్రీనివాసన్‌ మాట్లాడుతూ.. ‘‘గత దశాబ్ద కాలంగా లక్ష్మి యొక్క అంకితభావంతో కూడిన ప్రయత్నాలు, ఆమె దృష్టి వంటివి కంపెనీ నాణ్యత, లాభదాయకత, ఓఈఎంలతో సంబంధాలను నెరపడంలో తోడ్పడ్డాయి. ఇటీవల యుఎస్‌లో సంస్ధ కార్యకలాపాలు ప్రారంభించడంలో ఆమె కీలకపాత్ర పోషించారు.ఆమె నేతృత్వంలో సుందరం క్లేటాన్‌ అంతర్జాతీయంగా గుర్తింపు పొందగలదని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

సుందరం క్లేటాన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మి వేణు మాట్లాడుతూ ‘‘ సుందరం క్లేటాన్‌ తరువాత దశ వృద్ధికి నేతృత్వం వహిస్తుండటాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాము. మాకు అత్యద్భుతమైన బృందం ఉంది. కలిసికట్టుగా సుందరం క్లేటాన్‌ను ఇండియా, అంతర్జాతీయంగా బలోపేతం చేయనున్నాము’’ అని అన్నారు.

Dr Lakshmi Venu appointed as MD of Sundaram-Clayton Ltd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News