11 శాతం పెరిగిన విక్రయాలు
10 శాతం పడిపోయిన షేరు విలువ
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) మొదటి త్రైమాసిక ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ డా.రెడ్డీస్ ల్యాబోరేటరీస్ నికర లాభం రూ.571 కోట్లతో 1 శాతం తగ్గింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.579 కోట్లు ఉంది. జూన్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో సంస్థ ఆదాయం రూ.4,919 కోట్లతో 11 శాతం పెరిగింది. గతేడాది సంస్థ ఆదాయం రూ.4,513 కోట్లుగా ఉంది. డా.రెడ్డీస్ ల్యాబ్ కొచైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.ప్రసాద్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన అమ్మకాల వృద్ధితో మొదటి త్రైమాసికంలో కంపెనీ ఆర్థికంగా మెరుగైందని అన్నారు.
ఇటీవల కొత్తగా ఆవిష్కరించిన ఉత్పత్తులు, ఉత్పాదకతతో వచ్చే త్రైమాసికంలో కంపెనీ మార్జిన్స్ మెరుగవుతాయని ఖచ్చితంగా చెప్పగలనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశీయ, యురోపియన్‌లో కంపెనీ మెరుగ్గా రాణించింది. భారత్‌లో విక్రయాలు వార్షికంగా రూ.1,060 కోట్లతో 69 శాతం వృద్ధిని సాధించాయి. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు, ప్రస్తుత ఉత్పత్తుల సేల్స్ పెరగడం వల్ల కంపెనీ వృద్ధిని సాధించింది. స్పుత్నిక్‌వి వ్యాక్సిన్, కరోనాకు 2డియోక్సిడిగ్లూకోజ్‌తో సహా తొలి త్రైమాసికంలో కొత్తగా ఆరు ఉత్పత్తులను కంపెనీ ప్రవేశపెట్టింది.
యూరప్, ఉత్తర అమెరికాలో..
నిలకడగా డిమాండ్ ఉండడంతో యూరప్‌లో సంస్థ రెవెన్యూ రూ.399 కోట్లతో 12 శాతం పెరిగింది. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు, ప్రస్తుత ఉత్పత్తుల వాల్యూమ్ పెరుగుదలతో ఉత్తర అమెరికాలో ఆదాయం ఒక శాతం పెరిగింది. ఈ కాలంలో కంపెనీ ఆరు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసింది. స్టాక్‌మార్కెట్లో డా.రెడ్డీస్ ల్యాబ్ షేరు 10 శాతం పడిపోయి రూ.4,853 వద్ద ముగిసింది.