Monday, December 23, 2024

దార్శనికుడు డా. జాకీర్ హుస్సేన్

- Advertisement -
- Advertisement -

రెండు వందల సంవత్సరాల వలస పరిపాలన నుంచి భారత దేశాన్ని విముక్తి పరుచుటకై స్వాతంత్య్ర ఉద్యమంలో తమ ప్రాణాలను, జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు, మహనీయులు ఎందరో. వీరిలో ప్రముఖులు భారతదేశ మూడవ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా దేశ అభివృద్ధిలో, దేశ ప్రజలను ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దుటలో తన వంతు కృషి చేసిన మహనీయుడు జాకీర్ హుస్సేన్. ‘మొత్తం భారత దేశం నా ఇల్లు, ప్రజలందరూ నా కుటుంబం’ అనే నినాదంతో తన పుట్టుక నుండి మరణం వరకు దేశ సేవలో, దేశాభివృద్ధిలో తనదైన శైలిలో కృషి చేసినటువంటి మహానుభావుడు జాకీర్ హుస్సేన్. భారత దేశ మూడవ రాష్ట్రపతిగా 1967 1969 వరకు పని చేశారు. ఒక విద్యావేత్త, రాజకీయ నాయకుడు, భారత దేశ స్వాతంత్య్ర సమరయోధుడిగా కూడా గుర్తింపు పొందారు. హుస్సేన్ 1897 ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో అంటే నాటి బ్రిటిష్ ఇండియా నేటి భారత దేశ రాష్ట్రమైన తెలంగాణలో జన్మించారు. తండ్రి పఖున్ జాతికి చెందినవాడు.

హైదరాబాదు నుండి ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాయమ్ గంజ్‌కు వలస వెళ్లారు. హుస్సేన్ ఉత్తరప్రదేశ్‌లోని ఇస్లామోయ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఉన్నత విద్య అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలోని ఆంగ్లో మహమ్మద్ ఓరియంటల్ కాలేజీలో అభ్యసించారు. అలీఘర్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకుడుగా ప్రముఖ పాత్ర పోషించారు. ఆ తర్వాత లండన్‌లోని కింగ్స్ కాలేజ్, బెర్లిన్ విశ్వవిద్యాలయం నుండి విద్యను అభ్యసించారు. హుస్సేన్ 1920లో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ స్థాపనలో ముఖ్యపాత్ర పోషించారు. బ్రిటిష్ వారితో పోరాటానికి మహాత్మా గాంధీతో చేతులు కలిపి బేసిక్ విద్యపై కఠోర పరిశ్రమ చేసి భారత దేశం లో విద్యాభిన్నతికి శ్రమించారు. ఆ కాలంలో హుస్సేన్ ఉత్తమ దార్శనికుడిగా భారత విద్య మార్గదర్శికుడిగా గుర్తింపు పొందారు. నాటి కాలంలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన మహమ్మద్ అలీ జిన్నా చేత కూడా అభినందనలు అందుకున్నారంటే జాకీర్ హుస్సేన్ విద్య దేశ స్వాతంత్య్ర పోరాటం, దేశ సేవ ఎంత నిజాయితీగా నిర్వహించారో మనకు అర్థం అవుతుంది. తనకున్న సంపద మొత్తం దేశాభివృద్ధికి ధారపోసిన మహోన్నత వ్యక్తి జాకీర్ హుస్సేన్. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన

తర్వాత 1948 నుండి 1956 వరకు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా కూడా పని చేశారు. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ విద్యాభివృద్ధిలో వైస్ ఛాన్సలర్‌గా ప్రముఖ పాత్ర వహించి విద్యార్థికి కావాల్సిన అన్ని రకాలైన వసతులను కల్పించడంతో పాటు వారి విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేశారు. తన వైస్ ఛాన్సలర్ పదవి ముగిసిన తరువాత 1956వ సంవత్సరంలో భారత దేశ పార్లమెంటు సభ్యుడుగా నామినేటెడ్ చేయబడ్డారు. హుస్సేన్ 1957లో బీహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 1962లో భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1967లో భారత దేశ మూడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. హుస్సేన్ ఒక ప్రజాస్వామ్యవాది, మత సామరస్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన వారిలో జాకీర్ హుస్సేన్ ప్రముఖులు. హుస్సేన్ 1969 మే 3న న్యూఢిల్లీలో హఠాన్మరణం చెందారు. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ స్థాపన విద్యారంగంలో సేవ, మత సామరస్యానికి 1963లో భారత ప్రభుత్వం జాకీర్ హుస్సేన్‌ని భారత రత్న అవార్డుతో సత్కరించింది. భారతదేశ మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి.

రాష్ట్రపతి పదవిలో ఉండగానే మరణించిన మొట్టమొదటి వ్యక్తి జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్ ఒక గొప్ప విద్యావేత్త, రాజకీయ నాయకుడు, భారత దేశ మూడవ రాష్ట్రపతి. విద్యారంగం, మత సామరస్యానికి ఆయన చేసిన కృషి ఎంతో గొప్పది. ఫిబ్రవరి 8 జాకీర్ హుస్సేన్ జన్మదిన గుర్తు చేసుకుంటూ, దేశానికి వారు అందించిన సేవలు మరువరానివి. భారతీయులుగా మనం ఏ మతంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా ఏ ప్రాంతంలో పుట్టినా దేశ సేవకై మన జీవితాన్ని ధారపోయాలనే విషయం జాకీర్ హుస్సేన్ జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది. దేశ అభివృద్ధిలో మనందరం నాయకులు, ప్రజలు, పౌరులు జాకీర్ హుస్సేన్ ఆశయ సాధనలో నడవాలని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News