Thursday, December 26, 2024

ద్వీపదేశంపై డ్రాగన్ దమనకాండ

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలో ప్రస్తుతం ‘తైవాన్’ పేరు మారుమోగిపోతున్నది. ప్రజల్లో భయాందోళనలు కూడా మిన్నంటుతున్నాయి. ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పలు అంతర్జాతీయ సంఘర్షణలకు, యుద్ధాలకు తోడుగా మరో అంశం ‘తైవాన్’ రూపంలో తెరమీదకొచ్చింది. అగ్రరాజ్యాలతో పాటుగా అనేక దేశాలు తైవాన్ అంశాన్ని తేలికగా తీసుకోవడం లేదు. తైవాన్‌ను ఒక దేశంగా కాకుండా ఒక ప్రావిన్స్‌గానే చైనా పరిగణిస్తున్నది. చైనా ఒత్తిడికి లొంగబోనని, దేశ సార్వభౌమత్వ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడం కోసం యుద్ధోన్మాదంతో చెలరేగిపోతున్న చైనాను ఢీ కొంటామని తైపీ ప్రకటించింది. తైవాన్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా తైవాన్ రక్షణ సామర్థ్యాన్ని మరింతగా బలోపేతం చేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ద్వీపదేశమైన తైవాన్ ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా ఎదిగిన ‘డ్రాగన్’తో తలపడగలదా? యుద్ధం చేయగలదా? యుద్ధంలో గెలవగలదా? తైవాన్ ఆత్మవిశ్వాసం వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది? చైనా హెచ్చరించిన విధంగానే కదనరంగంలోకి దూకితే తైవాన్‌కు అమెరికా నిజంగానే సహకరిస్తుందా? తైవాన్ చిన్న దేశమే అయినా పలు రంగాల్లో బాగా అభివృద్ధి చెందిన దేశం. ఐక్యరాజ్యసమితి గుర్తించకపోయినా ఆర్ధికబలం, ఆయుధ బలంతో పాటుగా పలు అంశాల్లో తైవాన్ ప్రత్యేకతను ప్రపంచానికి నిరూపించుకుంది. చైనా నిరంకుశత్వాన్ని నిరసిస్తూ, విస్తరణవాదంతో కాకుండా ప్రజాస్వామ్య వాదం తో పనిచేయాలని చెబుతున్న తైవాన్‌పై చైనా కోపంతో రగిలిపోతున్నది. తైవాన్ పై చైనా దాడికి తెగబడితే అమెరికాతోపాటు, యుకె, ఫ్రాన్స్‌లతో పాటుగా సుమారు 30 దేశాలు అండగా నిలబడతాయని కొన్ని వార్తా కథనాలు సూచిస్తున్నాయి. ఇన్ని దేశాలు చైనాకు వ్యతిరేకంగా గొంతు విప్పడం ప్రపంచంలో చైనాపట్ల నెలకొంటున్న వ్యతిరేకతను సూచిస్తున్నది.

అయినప్పటికీ ఈ వ్యతిరేకత మాటలకే పరిమితం కావచ్చు. చైనాను ఈ దేశాలు ప్రత్యక్షంగా ఎదిరించే సాహసం చేయబోవనే చెప్పవచ్చు. ఒకప్పుడు తైవాన్‌ను స్వాధీనం చేసుకున్న జపాన్ రెండవ ప్రపంచ యుద్ధానంతరం తైవాన్‌ను విడిచిపెట్టిపోయింది. తైవాన్‌కు ఈనాటికీ ఒక ప్రత్యేకమైన దేశంగా అధికారికంగా గుర్తింపు లేదు. ‘ఫార్మోసా’ గా పిలవబడి, ప్రస్తుతం మనమంతా తైవాన్ పేరుతో పిలుస్తున్నప్పటికీ ఆ దేశం అధికారికంగా ‘రిపబ్లిక్ ఆఫ్ చైనా’ గానే గుర్తింపబడుతున్నది. తైవాన్ 1949 సంవత్సరంలో స్వతంత్ర దేశంగా చైనా ప్రధాన భూభాగం నుండి విడిపోయింది. తైవాన్ తనకు తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నప్పటికీ, అక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టబద్ధమైన స్వయంపాలన కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ తైవాన్‌ను ప్రపంచదేశాలు పూర్తిస్థాయిలో గుర్తించలేదు. కేవలం 12 దేశాలు మాత్రమే తైవాన్ ఉనికిని గుర్తించాయి. బలమైన చైనా దేశం ఒత్తిడికి లొంగి తైవాన్‌ను పలు దేశాలు ఈనాటికీ ఒక దేశంగానే గుర్తించడం లేదు.

ఇప్పటికీ తైవాన్‌ను చైనా తన అంతర్భాగంగానే పరిగణిస్తున్నది. తైవాన్‌కు మిత్ర దేశాలైన అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాలు తైవాన్‌ను స్వతంత్ర దేశంగా ఇంకా గుర్తించకపోవడం గమనార్హం. తైవాన్ సంపూర్ణ స్వతంత్ర దేశంగా మారడానికి సహకరిస్తానని అమెరికా ఎప్పుడో స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సభ్యదేశాల్లో 2/3 వంతు దేశాలు గుర్తిస్తేనే ఒక ప్రాంతం లేదా భూభాగం ప్రత్యేక దేశంగా గుర్తించబడుతుంది. తైవాన్‌కు అలాంటి అవకాశం దక్కలేదు. భవిష్యత్తులో ఆ అవకాశం లభించవచ్చు. అప్పటి వరకు తైవాన్ ‘రిపబ్లిక్ ఆఫ్ చైనా’ పేరుతో ఒక ప్రావెన్సీగానే గుర్తించబడుతుంది. అమెరికా వాణిజ్య సంబంధాలను తైవాన్‌తో కాకుండా అధికారికంగా చైనాతోనే కొనసాగిస్తున్నది. అయినప్పటికీ తైవాన్ ఒక స్వతంత్ర దేశంగా పరిగణింపబడడం విశేషం. తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టే వాదనను తోసిపుచ్చి, తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని, తైవాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి యుద్ధానికి సిద్ధమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునివ్వడం ప్రపంచ ప్రజలకు దిగ్భ్రమ కలిగించింది. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆర్థిక మాంద్యాన్ని చవిచూస్తున్నాయి.

ఒకవైపు ఇజ్రాయెల్- హమాస్, ఇంకోవైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో తాజాగా తైవాన్‌పై యుద్ధం చేయడానికి చైనా సిద్ధంకావడం అత్యంత ఆందోళన కలిగించే అంశం. తైవాన్ కూడా చైనాపై దాడికి చురుగ్గా పావులు కదుపుతున్నది. అమెరికా అండతో చైనాపై తిరుగుబాటు బావుటా ఎగరేయాలని యత్నిస్తున్నది. కొద్ది సంవత్సరాల క్రితం తైవాన్‌లోకి చైనా యుద్ధవిమానాలు చొరబడడం తైవాన్‌ను విలీనం చేసుకోవడానికి చైనా జరిపిన కుట్రలో భాగంగానే పరిగణించాలి. ఈ పరిణామాలే చైనా- తైవాన్‌ల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి. తైవాన్‌కు మిత్రదేశంగా ఉంటున్న అమెరికా సైతం తైవాన్‌తో ప్రత్యక్ష వాణిజ్య, దౌత్యసంబంధాలు లేవు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తైవాన్‌కు అమెరికా ఎలాంటి సహాయం అందిస్తుందో తెలియదు. తైవాన్ కూడా అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థను కలిగి ఉన్నది. ఆయుధ, అర్ధబలం కూడా మెండుగానే ఉన్నాయి.

అయితే శత్రుదుర్భేద్యమైన రక్షణ వ్యవస్థను కలిగి ఉన్న చైనాను తైవాన్‌తో పోల్చడం హాస్యాస్పదం. తైవాన్ కంటే పది రెట్లకు పైగా రక్షణ వ్యయం చేస్తున్న చైనాను తైవాన్ ఢీకొట్టగలదా? చైనాతో పోల్చి చూస్తే తైవాన్ సైనిక బలగం దిగదుడుపే. ఆర్ధిక, ఆయుధ బలగంలో పటిష్ఠంగా ఉన్న చైనా ను తైవాన్ ఢీకొట్టలేదు. అమెరికా లాంటి దేశాలు కూడా చైనాతో తలపడే సాహసం చేయగలవా? అమెరికా, దాని మిత్రపక్షాలు తైవాన్ పట్ల సానుభూతి వ్యక్తం చేసినా ప్రత్యక్షంగా యుద్ధానికి సిద్ధం కాగలవా? తైవాన్‌ను చైనాలో విలీనం చేయడమే జిన్‌పింగ్ ప్రధాన ధ్యేయం. తైవాన్ ఆక్రమణకు జిన్‌పింగ్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా లాంటి దేశాలు అడ్డుపడగలవా? ఈ వ్యవహారంలో అమెరికా రంగ ప్రవేశం చేస్తే అదొక మహాసంగ్రామంగా మారుతుంది. కాబట్టి అమెరికా ఆచితూచి వ్యవహరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

బలమైన చైనాను ఢీకొట్టి చైనా చేతిలో ఘోరపరాజయం పొందడానికే ‘తైవీ’ తెగిస్తుందా? లేక చైనాకు దాసోహమై యథాతథ స్థితిని కాపాడుకుని తన ఉనికిని నిలబెట్టుకుంటుందా? అనివార్య పరిస్థితుల్లో చైనా-తైవాన్‌ల మధ్య యుద్ధం సంభవిస్తే ప్రపంచం మరో భయంకరమైన పరిస్థితిలోకి నెట్టబడుతుంది. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నపోయింది. ఉక్రెయిన్‌కు భారీగా ఆర్థిక, ఆయుధ సహాయమందిస్తున్న అమెరికాకు ఇరాన్- ఇజ్రాయెల్ సంఘర్షణలు తలనొప్పిగా పరిణమించాయి. ఇజ్రాయెల్ కు మిత్రదేశంగా ఉంటున్న అమెరికా అవసరమైతే ఇరాన్ కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు సహాయమందించవలసి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో చైనాకు వ్యతిరేకంగా తైవాన్‌కు సహాయమందించగలదా? అగ్రదేశంగా పెద్దన్నగా తన ఆధిపత్యం చెలాయించాలనే ఉద్ధేశంతో అమెరికా ప్రపంచ దేశాల సమస్యల విషయంలో తలదూర్చి మోయలేని ఆర్ధిక భారంతో సతమతమవుతున్నది.

ఈ నేపథ్యంలో తైవాన్ విషయంలో కూడా తలదూర్చి, మరింత ఆర్థిక భారాన్ని మెడకు తగిలించుకుంటుందా? ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచే సాహసం చేస్తుందా? అనే సంశయం కలుగుతున్నది. రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలుపొందితే, ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్తతల విషయంలో రాజనీతిజ్ఞత ప్రదర్శించవచ్చు. సమస్యల పరిష్కారానికి కృషి చేయవచ్చు. డోనాల్డ్ ట్రంప్ గనుక గెలిస్తే తైవాన్ కు సహాయంచేసి, చైనాపై ఉసిగొల్పి, తన అహంకారంతో ప్రపంచాన్ని పెను ప్రమాదంలో పడేసే అవకాశాలున్నాయి. అమెరికాలో నూతన అధ్యక్షుని ఎన్నికకు ముందే తైవాన్- చైనా మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు సమసిపోవాలి. తైవాన్ ను చైనా ప్రత్యేక దేశంగా గుర్తించాలి. తైవాన్ అస్థిత్వాన్ని గుర్తించి, ద్వీప దేశంలో నెలకొన్న అశాంతిని రూపుమాపి, ప్రపంచంలో శాంతి సుస్థిరతలను కాపాడాలి.

సుంకవల్లి సత్తిరాజు
9704903463

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News