Monday, December 23, 2024

రాష్ట్రపతి పీఠంపై ‘గిరి’పుత్రిక

- Advertisement -
- Advertisement -

మరో రౌండ్ మిగిలి ఉండగానే 50% దాటిన ఓట్లు
మెరిసిన ముర్ము.. మురిసిన గిరిజనం
15వ రాష్ట్రపతిగా ఎన్నిక 
ఓటమిని అంగీకరించిన యశ్వంత్ సిన్హా 
సర్వోన్నత పీఠంపై అతి పిన్న వయస్కురాలు
బిజెపి సంబురాలు

న్యూఢిల్లీ : భారతదేశ తొలి గిరిజన మహిళ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మూ విజయం సాధించారు. దేశ 15వ రాష్ట్రపతిగా ఈ నెల 25వ తేదీన జరిగే అధికారికంగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఎన్‌డిఎ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్ష ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. గురువారం ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల లెక్కింపు ఉదయం ఆరంభం అయినప్పటి నుంచే ద్రౌపది ఆధిక్యత కొనసాగుతూ వచ్చింది. కేవలం మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు దశలోనే ద్రౌపదికి మొత్తం ఓట్ల విలువలో 64 శాతానికి పైగా ఓట్లు దక్కాయి. శ్రీమతి ద్రౌపది ముర్మూ భారత దేశ తదుపరి రాష్ట్రపతిగా ఎన్నికైనట్లు తాను ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ప్రకటిస్తున్నానని రాజ్యసభ సెక్రెటరీ జనరల్ అయిన పిసి మోడీ అధికారిక ప్రకటన వెలువరించారు. విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా హుందాగా మూడో రౌండ్ తరుణంలోనే తమ ఓటమిని అంగీకరించారు. మూడురౌండ్ల ఓట్ల లెక్కింపు తరువాత ముర్మూకు 53.13 శాతం ఓట్లు వచ్చాయి. తరువాత నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు తరువాత శ్రీమతి ముర్మూకు 2,824 ఓట్లు దక్కాయి. వీటి విలువ 6,76,803 , ఇక సిన్హాకు 1877 ఓట్లు రాగా వీటి విలువ 3,80, 177 . మొత్తం పోలయిన ఓట్లతో పోలిస్తే ద్రౌపదికి 64 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. రాష్ట్రపతిగా విజేతను ప్రకటించేందుకు అవసరం అయిన ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో సగానికి పైగా దక్కించుకున్నందున మూడో రౌండ్ దాటగానే ఆమె విజయం ఖాయం అయింది.దీనితో దేశ రాష్ట్రపతి పీఠం అధిరోహించిన వారిలో చిన్న వయస్కురాలైన వ్యక్తిగా ద్రౌపది నిలిచారు. అధికార బిజెపి శిబిరంలో ఆనందోత్సాహాలు కన్పించాయి. పలు చోట్ల వేడుకలు జరిగాయి. నాలుగో రౌండ్‌లో తొమ్మిది రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అధికారిక విజయ ప్రకటనకు ముందే ప్రధాని మోడీ, అమిత్ షా, బిజెపి అధ్యక్షులు నడ్డా ఇతర నాయకులు ముర్మును కలిసి అభినందించారు. పలు చోట్ల కోయ గిరిజన నృత్యాలు డోలుదరువుల పాటలు మార్మోగాయి. ఓటమి అంగీకరించిన యశ్వంత్ సిన్హా స్పందిస్తూ తాను శ్రీమతి ద్రౌపది ముర్మూను మనసారా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆమె దేశ 15వ రాష్ట్రపతిగా రాజ్యాంగ పరిరక్షకురాలుగా ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా గమ బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.

 

దేశ ప్రజలతో పాటు ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హౌస్‌లో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ప్రిలిమినరీల తరువాత వాస్తవిక కౌంటింగ్ నిజానికి మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో చేపట్టారు. తొలిరౌండ్ ముగిసేలోగానే ముర్మూకు 39శాతం ఓట్లు రావడంతో పలు శిబిరాలు ఊహించుకుంటు వస్తున్న మురూ విజయం దాదాపుగా ఖాయం అయింది. ఢిల్లీలో బిజెపి ప్రధాన కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ఇక్కడి నుంచి రాజ్‌పథ్ వరకూ రోడ్‌షో సాగించారు. పార్టీలే ఓటింగ్ దశలో తెలియచేసినట్లు క్రాస్ ఓటింగ్ దండిగా సాగింది. యశ్వంత్ సిన్హా ఆది నుంచి అన్ని పార్టీలకు ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని, ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పారు.
అయితే గిరిజన మహిళ సెంటిమెంట్‌కు అనుగుణంగా ఇతర పార్టీల ఓట్లు ముర్మూ వైపు పడ్డాయి. ఆయా పార్టీల ఎమ్మెల్యేలు ఎంపిలే స్వయంగా ఈ విషయం బహిరంగంగా తెలిపారు.
కోటా దాటితే విజేతే
ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటించడం కాకుండా నిర్ణీత కోటా దాటి ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు తెచ్చుకున్న వారినే విజేతగా ఖరారు చేస్తారు. ఈ కోటా ఖరారు నిర్థారణ కీలక రీతిలో జరుగుతుంది. ఒక్కో అభ్యర్థికి దక్కిన ఓట్లను రెండుతో భాగించి తరువాత దీనికి ఒక్కటి కలిపి లెక్కిస్తారు. 50 శాతాన్ని మించితే విజేతగా నిలిచినట్లే. మూడో రౌండ్ కౌంటింగ్ తరువాత ద్రౌపదికి 5,77,777 ఓట్లు వచ్చాయి. ఈ నెల 18న జరిగిన పోలింగ్‌లో పోలయిన మొత్తం ఓట్లలో ఈ వచ్చిన ఓట్లు సగానికి మించి ఉన్నాయని నిర్థారణ అయింది. దీనితో విజేత రాష్ట్రపతి పేరును ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయిగా మిగిలింది. ఇప్పటికే ముర్మూను అభినందిస్తూ దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. స్పీకర్ ఓంబిర్లా అభినందనలు తెలిపారు. విజేత కానున్న ద్రౌపది ముర్ముకు అభినందనలు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ వెలువరించారు. పదవి నుంచి వైదొలిగే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తరఫున ముర్మూకు శుభాకాంక్షలు వెలువడ్డాయి. ఒడిషా సిఎం నవీన్ పట్నాయక్ కొత్త రాష్ట్రపతిని అభినందించారు.

Draupadi Murmu becomes 15th Indian President

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News