Wednesday, January 22, 2025

రాష్ట్రపతి ఎవరైతే ఏమిటి?

- Advertisement -
- Advertisement -

Draupadi Murmu is an NDA presidential candidate

ఒక గిరిజన మహిళ దేశాధ్యక్ష పీఠానికి పాలక పక్షం తరపున పోటీకి ఎంపికైన విషయం బయటపడగానే పత్రికల్లో వార్తలుగా, టివిల్లో కథనాలుగా అది ఆ జాతికి దక్కిన గౌరవమా లేక ఓ రాజకీయ ఎత్తుగడనా, మరో రకంగా రెండునా అనే మథనం మొదలైంది. అసలు మన దేశంలో రాష్ట్రపతి ఎన్నిక, వారి అయిదేళ్ల పదవీ కాలం ప్రజల్లోకి అంతగా చొచ్చుకుపోతున్న అంశమే కాదు. ప్రభుత్వమనగానే ప్రజలకు గుర్తొచ్చేది ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి మాత్రమే. వారిపైన ఢిల్లీలో దేశాధ్యక్షుడు, రాష్ట్ర రాజధానుల్లో గవర్నర్లు ఉంటారన్న సంగతి జనాభాలో ముప్పా వు వంతుకు తెలియని విషయమే.

మన దేశంలో బ్రిటిష్ కాలపు అత్యున్నత గవర్నర్ జనరల్ పదవికి ప్రెసిడెంట్ దాదాపు సమాన హోదా కలది. మన రాజ్యాంగంలోని అధికరణ 53 ప్రకారం దేశాధ్యక్షుడు సర్వాధికారి, తొలి పౌరుడు. పాలనలో ఆయనకు ప్రజల ద్వారా ఎంపికైన మంత్రివర్గం సలహాలు, సూచనలు ఈయాలి. మంత్రి వర్గానికి ప్రధాని నాయకుడు. మంత్రివర్గ నిర్ణయాలను అధ్యక్షుడి ఆమోదంతో చట్టాలుగా మారి పరిపాలనకు ఉపయోగపడతాయి. అంతే కాకుండా రాష్ట్రపతికి రాజ్యాంగబద్ధ పాలనను పరిరక్షించే విశేష అధికారాలు ఉంటాయి. ‘బ్రిటిష్ రాజ్యాంగంలో రాజుకు ఉన్న హోదా భారత దేశాధ్యక్షుడికి ఉంటుంది. రాష్ట్రపతి దేశానికి పెద్దనే కాని కార్యనిర్వాహకుడు కాదు. అత్యున్నతుడే కాని ఏలేవాడు కాదు. పార్లమెంట్ నిర్ణయాలకు ఆయన ఆమోద ముద్ర ఎంత అవసరమైనా అది అలంకారప్రాయమే’ అని రాజ్యాంగ ముసాయిదాలో డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ పేర్కొన్నారు. పై మాటల వల్ల ఇది బ్రిటన్ రాజ్యాంగం నుండి అన్ని ఏండ్ల బ్రిటిష్ వలస పాలనకు ముద్రగా అనుకోవాల్సి వస్తోంది.

పార్లమెంట్ నిర్ణయాలని ఆమోదించడం లేదా తిప్పిపంపే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అయితే అదే నిర్ణయాన్ని రెండో సారి తిప్పి పంపితే అది రాష్ట్రపతి ఆమోదం లేకుండానే చట్టంగా మారిపోయే వీలుంది. మంత్రివర్గంతో చర్చించకుండా రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకున్నా దానిని ప్రధానమంత్రి అడ్డుకోవచ్చు. ఖైదీకి వేసిన మరణ శిక్షను జీవితకాల శిక్షగా మార్చే అధికారం మాత్రం రాష్ట్రపతి ఒక్కరికే ఉంటుంది. దేశ త్రివిధ దళ సైన్యానికి ఆయనే అధిపతి. దేశంలో వివిధ రకాల అత్యయిక పరిస్థితి ప్రకటనలో ఆయనదే కీలకపాత్ర. అయితే అత్యున్నత హోదాకు తోడు చాలా వరకు అధికారాలు కేబినెట్ నిర్ణయాలకు ముడిపడి ఉన్నందున రాష్ట్రపతి పదవి ఉత్సవ విగ్రహంగా, రబ్బరు స్టాంపుగా విమర్శలకు గురవుతోంది.

అయితే ప్రెసిడెంట్ ఎన్నిక దేశంలోని ఎంఎల్‌ఎలు, పార్లమెంట్ సభ్యులు ఓట్లపై ఆధారపడి ఉన్నందున సాధారణంగా పాలక పక్ష అభ్యర్థియే నెగ్గుతుంటారు. పాలక పక్షం కూడా ఈ అవకాశాన్ని రాజకీయంగా ఉపయోగపడేలా వాడుకుంటోంది. ఈ పదవి ఎవరికిచ్చినా తమ పాలనకు వచ్చే చిక్కేమీ లేనందున ముస్లిం మైనారిటీ, దళిత, గిరిజన జాతులకు చెందినవారిని రాజకీయ పార్టీలు ఎంచుకుంటున్నాయి. ప్రధాన మంత్రి లేదా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవుల్లోపై మూడు వర్గాల వారిని కూచోబెట్టడానికి ముందుకురాని పార్టీలు అలంకారప్రాయంగా పేరొందిన ఆసనానికి మాత్రం వాడుకుంటున్నాయనవచ్చు. అంతేకాకుండా ఎవరి రాజకీయ జీవితానికి ముగింపు పలకాలనుకున్నా రాష్ట్ర, ఉపరాష్ట్రపతుల పదవుల్లో కూచోబెట్టిన సందర్భాలున్నాయి.

ప్రధాని కావాలనుకున్న ప్రణబ్ ముఖర్జీ 2012లో రాష్ట్రపతి అయ్యారు. 2014లో కాంగ్రెస్ గెలిస్తే ప్రధాని పీఠంపై రాహుల్ గాంధీకి దారి సుగమం అయ్యేలా కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది. బతికినంత కాలం ప్రణబ్ పార్టీపై అలకబూనారు. మోడీ కేబినెట్‌లో పట్టణాభివృద్ధి మంత్రిగా సజావుగా కొనసాగిన వెంకయ్యనాయుడు కూడా అయిష్టంగానే ఉపరాష్ట్రపతికి ఒప్పుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ ఆగష్టుతో ఆయన పదవీకాలం ముగుస్తున్న దశలో ఆయనకు రాష్ట్రపతి పదవి దక్కకపోవడం రాజకీయ చర్చనీయాంశమైంది. 73 ఏళ్ల వయసులో ఆయన రాజకీయ జీవితం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

కొన్నాళ్లుగా వార్తల్లో నానుతున్న ద్రౌపది ముర్మూ పేరును ఎన్‌డిఎ తమ రాష్ట్రపతి అభ్యరిగా ప్రకటించింది. ద్రౌపది ఒక గిరిజన మహిళ. ఒడిశాకు చెందిన సంతాల్ తెగకు చెందిన మాజీ టీచరమ్మ. 39 వ ఏట 1997లో బిజెపి తీర్థం పుచ్చుకున్న ఆమె తన రాజకీయ జీవితంలో ఒడిశాలో మంత్రిగా, జార్ఖండ్‌లో గవర్నర్ గా చేసిన అనుభవముంది.

అణగారిన వర్గాలకు అత్యున్నత స్థానాన్ని కట్టబెట్టిన పేరు భాజపాకు చెందుతుంది. అయితే దాని వెనుక రాజకీయ కోణాన్ని చూస్తున్న విశ్లేషకులు రాబోయే ఎన్నికల్లో విజయానికి ఈ ఎంపికకు లంకె ఉందంటున్నారు. ఈ ఏడాది చివరలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాదిలో జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దేశంలో పార్లమెంట్ ఉభయసభల ఎంపిలు, రాష్ట్రాల ఎంఎల్‌ఎలు కలిపి రాష్ట్రపతి ఎన్నికలో ఓటర్లుగా మొత్తం 4787 సభ్యులు ఉన్నారు. అందులో ఎన్‌డిఎకు 2207 (46%), యుపిఎకు 1191 (25%), ఇతరులు 1392 (29%) ఉన్నారు. కాంగ్రెస్ కూటమిగా అయిన యుపిఎకు ఇతరులందరు కలిసి వస్తే భాజపా కూటమి అభ్యర్థిని ఓడించవచ్చు. అయితే కాంగ్రెస్‌తో అన్నీ విపక్షాలు కలిసి రానందున అది సాధ్యపడేలా లేదు.

సుమారు 2% ఓట్ల కొరత వల్ల, ఇతరుల్లో కొందరు మద్దతు ప్రకటించినా ముందు జాగ్రత్తగా నామినేషన్ తరువాత ముర్ము ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటిస్తారని తెలుస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థి స్వయంగా ఎన్నికల ప్రచారానికి దిగిన సందర్భాలు లేవనే చెప్పాలి. గెలుపు ఓట్ల సంఖ్యకు కొంత దూరంగా ఉన్నందున ఈ పని చేపడుతున్నారేమో. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా గిరిజన శాసనకర్తల ఓట్లు ముర్ముకు పడేలా కొన్ని గిరిజన సంఘాలు ముందుకొస్తున్నాయి.

కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాల అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా రంగంలో దిగారు. గిరిజనుడిని కాకపోయినా గిరిజనులకు ముర్ము కన్నా ఎక్కువ సేవ చేశానని ప్రత్యర్థి యశ్వంత్ సిన్హా అనడం గమనార్హం. గవర్నర్‌తో సహా వివిధ హోదాల్లో ఉన్నప్పుడు ముర్ము ఆదివాసీలకు చేసిన వివరాలు బయటపెట్టాలని అని సవాలు విసిరారు. రాష్ట్రపతి పోటీలో అభ్యర్థులు ప్రచారానికి దిగడం, సవాళ్లు విసురుకోవడం ఇప్పుడే చూస్తున్నాం. యశ్వంత్ ధీటైన అభ్యర్థి కాబట్టి గట్టి పోటీతో పాటు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే వాదనలు కూడా వినిపించవచ్చు. 27న నామినేషన్ వేశాక దేశ వ్యాప్తంగా తిరుగుతానని ఆయన అంటున్నారు.

మన దేశంలో నిమ్నవర్గాల నుండి రాజకీయంగా ఎదిగి వచ్చిన నేతలు తమ జాతులకు చేసిన సేవలు అంత గొప్పగా ఏమీ లేవు. లేమితో పుట్టి, పెరిగి తమ జాతి జనులను ఉపయోగించుకొని సొంత ప్రయోజనాలు పొందేవారు, సంఘాలకు పెద్దలుగా వ్యవహరిస్తూ జాతి ప్రతినిధిగా పేరు పొంది తద్వారా లభించిన అవకాశాలతో సొంత ఇల్లు చక్కబెట్టుకొనే బాపతుగాళ్లే ఎక్కువ. అంతవరకు రోడ్లెక్కి, ఆఫీసుల చుట్టూ తిరిగి, గట్టిగా మాట్లాడి, మీడియా ముందుకొచ్చి ఈయనే వీరికి తగిన నాయకుడు అని నమ్మబడి పదవీ, అధికారం రాగానే ఆ హోదాని అనుభవిస్తూ స్వామిభక్తి పారవశ్యంలో సొంత మనుషులను మరచిపోవడం లేదా వారిని వంచించి, నమ్మక ద్రోహంతో, అబద్ధాలతో కాలం వెళ్లదీసేది మరో కళ. పేరుకే ఆజాతిలో పుట్టినా విద్య, వ్యాపారం, చరాస్తుల వల్ల అభివృద్ధి చెంది అటు అన్నార్తులకు, ఇటు ఉన్నత వర్గ పాలకులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ అవసరార్థం తమ సామాజిక గుర్తింపును రాజకీయ పాచికగా వాడుకుంటూ కిందిజాతి ప్రతినిధిగా ఉపయోగపడుతుంటారు. ఈ రకంగా వాళ్లు తమ జాతులపైబడి పరాన్నభుక్కులుగా బతుకుతున్నారు.

ఇంతటి సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో దళిత, గిరిజనులు రిజర్వేషన్ల పుణ్యాన ఎంఎల్‌ఎలు, ఎంపిలు, మంత్రులైన వారు స్వతంత్రులు కాదు. పార్టీ అధ్యక్షుడి, ముఖ్యమంత్రి లాంటి కీలక, నిర్ణాయక హోదాలు వీరికి దక్కవు. నిమ్న జాతుల మీద అంతగా ప్రేముంటే అధికార పీఠాన్ని అప్పగించాలి. అలంకారప్రాయంగా పరిగణిస్తున్న రాష్ట్రపతి పదవిని అల్ప సంఖ్యాకులకు, ఆదివాసీలకు ఇచ్చి ఓట్లకు గేలంగా వాడుకొనే ప్రతిభ ఆధిపత్య రాజకీయాలకుంది. నిజానికి ఆ కుర్చీలో ఏ జాతివారు కూచున్నా ఒకటే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News