Sunday, November 24, 2024

కరోనా కట్టడికి డిఆర్‌డివొ 2డిజి ఔషధం విడుదల

- Advertisement -
- Advertisement -

కరోనా కట్టడికి డిఆర్‌డివొ 2 జి ఔషధం విడుదల
అందుబాటు లోకి వచ్చిన పదివేల సాచెట్లు
జూన్ నాటికి పూర్తి స్థాయిలో మార్కెట్లోకి

న్యూఢిల్లీ: కరోనా నివారణకు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్‌డివొ) అభివృద్ధి చేసిన 2డిజి(2 డియాక్సీ డి గ్లూకోజ్) ఔషధం అందుబాటులోకి వచ్చింది. ఈ ఔషధాన్ని ఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాధ్‌సింగ్, కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ విడుదల చేశారు. రాజ్‌నాధ్ సింగ్ తొలి బ్యాచ్ 2 డిజి సాచెట్లను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు అందించారు. ఆరోగ్యమంత్రి వాటిని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు ఇచ్చారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ ఈ 2 డిజి ఔషధంతో కరోనా నుంచి కోలుకునే సమయం తగ్గడమే కాక, ఆక్సిజన్ అందించాల్సిన అవసరం కూడా తగ్గుతుందని, కరోనాపై పోరులో ఈ ఔషధం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. తొలి విడతలో 10 వేల సాచెట్లను అందుబాటు లోకి తెచ్చారు. పదివేల డోసులను ఢిల్లీ లోని ఆస్పత్రులకు పంపిణీ చేయనున్నారు. మే 27,28 తేదీల్లో రెండో విడతలో భాగంగా మరిన్ని సాచెట్లను విడుదల చేస్తామని, జూన్ నాటికి పూర్తి స్థాయిలో మార్కెట్లోకి అందుబాటు లోకి తెస్తామని ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తెలియచేసింది. అయితే దీని ధర ఇంకా ప్రకటించలేదు. పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకుంటే ఇది వైరస్ ఉన్న కణాల్లోకి చేరి దాని వృద్ధిని అడ్డుకుంటుందని డిఆర్‌డివొ వివరించింది.

కరోనా నియంత్రణకు ఇప్పటివరకు వ్యాక్సిన్లను మాత్రమే వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఔషధం అత్యవసర వినియోగానికి మే1 న డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ సహకారంతో డిఆర్‌డివొకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఐఎన్‌ఎంఎఎస్) ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. గతంలో దీన్ని క్యాన్సర్ కోసం తయారు చేశారు. శరీరంలో క్యాన్సర్ కణాలకు గ్లూకోజ్ అందకుండా ఈ మందు అడ్డుకుంటుందని అప్పట్లో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే సూత్రాన్ని కరోనాకు అన్వయించుకుని పరిశోధనలు ప్రారంభించారు. శరీరం లోకి ప్రవేశించిన కొవిడ్ వైరస్ కణాలకు గ్లూకోజ్ అందక పోతే కణ విభజన జరగదని, దానివల్ల శరీరంలో కరోనా వ్యాప్తి ఆగిపోతుందని శాస్త్రవేత్తలు వివరించారు. ఇప్పుడీ ఔషధం ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్ లక్షణాలున్న వారిలో సమర్థంగా పనిచేస్తున్నట్టు క్లినికల్ ట్రయల్స్‌లో తేలిందని డిఆర్‌డివొ పేర్కొంది.కరోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అదనంగా ఈ డ్రగ్‌ను ఇస్తే వారు వేగంగా కోలుకోగలుగుతారని వివరించింది.

DRDO 2DG drug release for Corona Treatment

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News