Thursday, January 23, 2025

పాక్ ఏజెంట్‌పై మోహంతో రక్షణ రహస్యాలను పంచుకున్న డిఆర్‌డిఓ సైంటిస్టు

- Advertisement -
- Advertisement -

పుణె: తనను తాను జరా దాస్‌గుప్తా అనే మారుపేరుతో పరిచయం చేసుకున్న పాకిస్తానీ మహిళా ఏజెంట్ పట్ల ఆకర్షితుడైన డిఆర్‌డిఓ సైంటిస్టు ప్రదీప్ కురుల్కర్ ఆమెకు భారతీయ ఓఇపని వ్యవస్థలతోసహా ఇతర రక్షణ ప్రాజెక్టుల రహస్య సమాచారాన్ని పంచుకున్నట్లు చార్జిషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డిఆర్‌డిఓ)కు చెందిన పుణెలోని ఒక ల్యాబ్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న కురుల్కర్‌పై మహారాష్ట్ర పోలీసులకు చెందిన యాంటీ టెర్రరిజం శ్కాడ్(ఎటిఎస్) జూన్ చివరి వారంలో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. అధికారిక రహ్యాస చట్టం కింద మే 3వ తేదీన అరెస్టయిన కురుల్కర్ ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్నారు.

లండన్‌లో నివసిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా తనను తాను పరిచయం చేసుకున్న దాస్‌గుప్తా అశ్లీల సందేశాలు, వీడియోలు పంపడం ద్వారా కురుల్కర్‌తో స్నేహం ఏర్పర్చుకుంది. తమ దర్యాప్తులో ఆమె ఐపి అడ్రస్ పాకిస్తాన్‌లో ఉన్నట్లు తేలిందని చార్జిషీట్‌లో ఎటిఎస్ పేర్కొంది. బ్రహోమస్ క్షిపణి లాంచర్, డ్రోన్, యుసివి, అగ్ని క్షిపణి లాంచర్, మిలిటరీ బ్రిడ్జింగ్ సిస్టమ్ తదితర రహస్య సమాచారాన్ని కుర్కులర్ నుంచి ఆమె సేకరించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. దాస్‌గుప్తా పట్ల ఆకర్షితుడైన కురుల్కర్ డిఆర్‌డిఓకు చెందిన కీలక, రహస్య సమాచారాన్ని తన వ్యక్తిగత సెల్‌ఫోన్‌లో భద్రపరిచి ఆ తర్వాత దాన్ని జరా దాస్‌గుప్తాతో షేర్ చేసుకున్నాడని చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

భూ ఉపరితం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులు(ఎస్‌ఎఎం), డ్రోన్లు, బ్రహ్మోస్, అగ్ని క్షిపణి లంఆచర్లు, యుసివి తదితర వివిధ ప్రాజక్టుల గురించి వారిద్దరూ చాట్ చేశారని ఎటిఎస్ తెలిపింది. 2022 జూన్ నుంచి డిసెంబర్ వరకు వారిద్దరూ కాంటాక్ట్‌లో ఉన్నారని ఎటిఎస్ తెలిపింది.

కురుల్కర్ కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో ఆయన కార్యకలాపాలపై డిఆర్‌డిఓ అంతర్గత దర్యాప్తు ప్రారంభించిన అనంతరం 2023 ఫిబ్రవరిలో జరా దాస్‌గుప్తా నంబర్‌నురుల్కర్ బ్లాక్ చేశారని చార్జిషీట్‌లో తెలిపారు. అయితే తన నంబరును ఎందుకు బ్లాక్ చేశావంటూ కురుల్కర్ ఫోన్‌కు మరో గుర్తు తెలియని భారతీయ నంబర్ నుంచి మెసేజ్ వచ్చిందని ఎటిఎస్ పేర్కొంది. కురుల్కర్ తన వ్యక్తిగత, అధికారిక కార్యక్రమాలను, లొకేషన్లను కూడా పాకిస్తానీ ఏజెంట్‌తో పంచుకున్నట్లు చాట్ల ద్వారా బయటపడిందని ఎటిఎస్ తెలిపింది.

ఎవరికీ చెప్పకూడని రహస్య సమాచారాన్ని, లొకేషన్లను ఆపకిస్తానీ ఏజెంట్‌తో కురుల్కర్ పంచుకున్నట్లు ఎటిఎస్ ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News