Monday, December 23, 2024

శత్రువుల గుట్టు రట్టు చేసే ఎలుకలు

- Advertisement -
- Advertisement -

శత్రువులు ఎక్కడ ఏం చేస్తున్నారో నిఘా కళ్లతో పరిశీలించి లైవ్ వీడియో ద్వారా ఆ దృశ్యాలను అందించగల ఎలుకలను ఇండియన్ డిఫెన్స్ సైంటిస్టులు అభివృద్ధి చేశారు. ఈ ఎలుకలను ర్యాట్ సైబోర్గ్ అని వ్యవహరిస్తున్నారు. 26/11 ముంబై దాడులు జరిగినప్పుడు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో ఏ భవనాల్లో దాక్కున్నారో భద్రతా దళాలకు తెలుసుకోవడం ఒక సవాలుగా మారింది. అలాంటి సందర్భాల్లో భద్రతా దళాలకు ఉపయోగపడేలా ఇండియన్ డిఫెన్స్ సైంటిస్టులు ర్యాట్ సైబోర్గ్‌ను రూపొందించారు.

ఇవి సులువుగా భవనాల లోపలకు ప్రవేశించి లైవ్ వీడియో దృశ్యాలను భద్రతాదళాలకు అందిస్తాయి. ఎలుకలను సైన్యానికి ఆయుధాలుగా మార్చే పనికి డిఆర్‌డివొ ఏడాదిన్నర క్రితమే శ్రీకారం చుట్టింది. రిమోట్ ద్వారా నడిచేలా ఎలుకలకు శిక్షణ ఇస్తున్నారు. సైనికులు గతంలో పావురాలు, గద్దలను ఉపయోగించి శత్రువుల ఉనికి తెలుసుకునేవారు. ఇప్పుడు ఎలుకలను ఉపయోగించడం ఇదే మొదటిసారి. ర్యాట్ సైబోర్గ్‌ను హైదరాబాద్‌కు చెందిన కొందరు యువ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇవి ప్రామాణిక ప్రయోగశాల ఎలుకలే. వీటి మెదడుల్లో బయటి నుంచి సంకేతాలను స్వీకరించగల ఎలక్ట్రోడ్స్‌ను ఏర్పాటు చేశారు. లైవ్ ఇమేజిలను చిత్రీకరించడానికి వెనుక భాగంల ఓ చిన్న కెమెరా ఉంటుంది.

ఇలాంటి సదుపాయాలతో ర్యాట్ సైబోర్గ్‌లు ఒకసారి భవనం లోకి ప్రవేశించిన తరువాత శత్రువుల కంటబడకుండా అక్కడి పరిస్థితుల లైవ్ కవరేజిని అందిస్తాయి. గోడల పైకి ఎక్కి ప్రతి గది మూలకు వెళ్లి వీడియో ఫీడ్ ఇస్తాయి. అయితే ప్రస్తుతం శాస్త్రవేత్తలు బాహ్య సంకేతాలను కూడా స్వీకరించి పనిచేసేలా వాటి ఆధారంగా వ్యూహం అమలు చేసేలా ర్యాట్ సైబోర్గ్‌ను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 108 వ సెషన్‌లో హైదరాబాద్ లోని డిఆర్‌డివొ యువశాస్త్రవేత్త లాబొరేటరీ (డివైఎస్‌ఎల్) డైరెక్టర్ పి. శివప్రసాద్ ఈ సాంకేతికతపై ప్రెజెంటేషన్ ఇచ్చారు.

రెండోదశలో మెదడులో ఎలక్ట్రోడ్స్‌కు బదులుగా లేజర్ ట్రాన్స్‌రిసీవర్‌తో కూడిన చిన్న పిసిబిని ఎలుక పుర్రె పైన అమర్చుతామని, దాన్ని బయటి నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించడం చేస్తామని చెప్పారు. ఎలుక తనకు అందే సంకేతాలకు అనుగుణంగా కుడి, ఎడమలకు కదలడం వంటివి చేస్తాయని వివరించారు. ఈ ర్యాట్ సైబోర్గ్ టెక్నాలజీని 2019 లో చైనా శాస్త్రవేత్తల బృందం రూపొందించింది. అటువంటి ఆరు ఎలుకలతో ప్రయోగం చేసింది. ఆశాజనక ఫలితాలు లభించాయని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News