Sunday, December 22, 2024

అవసరానికి మించి నీరు తాగితే హైపోనట్రేమియా ప్రమాదం

- Advertisement -
- Advertisement -

శరీరం సక్రమంగా పనిచేయాలంటే రోజుకు ఎనిమిది గ్లాసుల వరకు మంచి నీటిని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నీరు తక్కువగా తాగితే డీహైడ్రోషన్‌కు గురవుతామని అందరికీ తెలిసిందే. మరి అధికంగా నీటిని తాగితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయో చాలా మందికి తెలియకపోవచ్చు. అత్యధికంగా నీటిని తాగితే శరీరంలో నీరు నిలిచిపోవడం ఎక్కువవుతుంది. దానివల్ల రక్తంలో ప్రమాదకరంగా సోడియం స్థాయిలు తగ్గిపోతాయి. సోడియం యొక్క తక్కువ సాంద్రతను హైపోనట్రేమియా అని అంటారు.

తగినంత సోడియంని భర్తీ చేయకుండా నీటిని ఎక్కువగా తాగడం వల్ల ఇలా జరుగుతుంది. దీనినే హైపోనట్రేమియా, ఓవర్ హైడ్రేషన్, హైపర్ హైడ్రేషన్, వాటర్ పాయిజనింగ్ అని పిలుస్తారు. సోడియం చాలా ముఖ్యమైన మూలకం. ఇది గుండె, కణాలు, మూత్రపిండాల పనితీరును నిర్వహించడానికి చాలా అవసరం. మనం అవసరానికి మించి నీరు తాగినప్పుడు ఆ నీటిలో సోడియం కలిసిపోయి, కిడ్నీల ద్వారా శరీరం నుంచి బయటకు వస్తుంది. ఈ ప్రక్రియ చాలాకాలం పాటు కొనసాగితే శరీరంలో సోడియం లోపం కలుగుతుంది. తలనొప్పి విపరీతంగా ఉన్నా, ఆకలివేయక పోయినా, చిన్న పనిచేసినా సరే నీరసం, నిస్సత్తువ కనిపించినా, ఆహారం తీసుకున్న వెంటనే వాంతులు అయినా, అవన్నీ హైపోనట్రేమియా లక్షణాలు. జ్ఞాపకశక్తి తగ్గినా, తల తిరుగుతున్నట్టు అనిపించినా, కూర్చున్నప్పుడు కూడా తలతిరుగుతున్నా, హైపోనట్రేమియా లక్షణాలే అని గుర్తించండి.

ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడ్ని సంప్రదించడం అవసరం. రోజుకు ఎనిమిది గ్లాసుల నుంచి పదిగ్లాసుల వరకు మాత్రమే నీటిని తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ మోతాదులో నీటిని తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వీటితోపాటు మెదడు వాపు కూడా ఏర్పడుతుంది. ఇటీవల హైపోనట్రేమియా కేసులు కొన్ని ప్రాణహానిగా తయారయ్యాయి. 35 ఏళ్ల మహిళ తన కుటుంబంతో అమెరికాకు శెలవుల్లో వెళ్లింది. ఓవర్‌హైడ్రేషన్ లేదా హైపోనట్రేమియా వల్ల చనిపోయింది. ఆమె మెదడులో వాపు సంభవించి కోమా లోకి వెళ్లి తరువాత మరణించిందని వైద్యులు తేల్చారు. ఆమె చనిపోక ముందు కేవలం 20 నిమిషాల్లోనే 64 ఔన్సులు లేదా దాదాపు 2 లీటర్ల మంచినీటిని విపరీత దాహంతో తాగిందని వార్తా కథనాలు వెలువడ్డాయి.

మరో సంఘటనలో ఒకామె వరుసగా 12 రోజుల పాటు ప్రతిరోజూ 4 లీటర్ల నీటిని తాగడంతో సోడియం లోపించి చివరకు ఆస్పత్రి పాలైంది. ఈ విధంగా ఆమె అవసరానికి మించి నీటిని తాగడానికి కారణం 75 హార్డ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనడానికే ఆమె ఇలా చేసిందని తెలిసింది. శరీరంలో ఎలెక్ట్రోలైట్ తులనాత్మకంగా ఉండడానికి ఎవరికైనా ఒక లీటర్ నీటిలో 136 నుంచి 145 మిల్లీ మోల్స్ సోడియం అవసరం అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. శరీరంలో ఉండే కణాలు ఈ నీటిని తీసుకుని తమ విధులను నిర్వర్తిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో అత్యధికంగా నీటిని తాగితే సోడియం సాంద్రత నిర్వీర్యమై మెదడు లోని కణాలు సైతం ఉబ్బిపోతాయి. అంటే మెదడు వాపుకు దారి తీస్తాయి. మూత్రపిండాలు కూడా స్వల్ప కాలంలో ద్రవాలను తులనాత్మకంగా ఉంచడంలో విఫలమవుతాయి. చివరకు కోమాకు, మరణానికి దారి తీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News