Wednesday, January 22, 2025

తాగునీటి పండగను ఘనంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న తాగునీటి పండుగ, హరిత దినోత్సవం, విద్యాదినోత్సవం, ఆధ్యాత్మిక దినోత్సవాలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈసందర్భంగా జలమండలి ఎండీ దానకిషోర్ మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో 25 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలను ఒక నోడల్ అధికారి పర్వేవేక్షిస్తారని, ఈ ఉత్సవాలలో భాగంగా స్థానికులతో పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అదే విధంగా మిషన్ భగీరథకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఉత్సవాలలో వాటర్ బోర్డు కార్మికులు, ఆయా స్వచ్ఛంద సంస్థలకు సన్మానం కూడా జరుగుతుందన్నారు. గత 9 సంవత్సరాల్లో సాధించిన విజయాలను వివరిస్తూ కరపత్రాలు కూడా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్‌ల వద్ద సిస్టమ్ పనితీరు గురించి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈఎన్సీ కృపాకర్ రెడ్డి తెలిపారు. ఉత్సవాల్లో ప్రతి గ్రామంలో దాదాపు 1000 మందిని ఫిల్టర్ బెడ్ ల వద్దకు తీసుకెళ్లి ఫిల్టర్ బెడ్ ప్రక్రియను వారికి వివరిస్తామని తెలిపారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్లతో సంప్రదింపులు జరిపి అన్ని గ్రామ పంచాయతీల్లోని ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల దగ్గర కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారని చెప్పారు.

సోమవారం జరిగే హరిత దినోత్సవం కార్యక్రమం వివరాలను పీసీసీఎఫ్ ఆర్ ఎం డోబ్రియాల్ జిల్లా కలెక్టర్లకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పట్టణాలు, గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం విరివిగా చేపట్టాలని, అందులో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఇతర ప్రైవేట్ సంస్థల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో జరిగే హరితహారంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రదర్శించాలని, మండల స్థాయి కార్యాలయాలకు ప్రచార సామగ్రిని కూడా తరలించామని సి.ఎస్ శాంతి కుమారి ఆదేశించారు. హరిత దినోత్సవంలో అన్ని అర్బన్ పార్కులకు ఉచిత ప్రవేశం ఉంటుందని, వాటిని సందర్శించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. మొక్కల పెంపకం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగే విధంగా చూడాలన్నారు.

విద్యా దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి వి.కరుణ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పుల ప్రాధాన్యతను తెలియజేస్తూ ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేసి, 9 ఏళ్ల విద్యారంగంలో పాఠశాల ప్రగతి, విద్యారంగంలో సాధించిన విజయాలు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. పాఠశాలల్లో దుస్తులు, ట్యాబ్‌లు, డిజిటల్ క్లాస్ రూమ్‌ల ప్రారంభోత్సవం, అనుబంధ పోషకాహారం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలోని డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో, సాంస్కృతిక కార్యక్రమాలు, బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బందికి సన్మానం ఉంటాయన్నారు.

ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో దీపాలంకరణ, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక పూజలు, చండీహోమాలు, వేదపారాయణం, ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. చర్చిలు, మసీదులలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం పట్ల జిల్లా కలెక్టర్లను, అధికారులను, సిబ్బందిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వివిధ కార్యక్రమాలకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News