అడుగంటుతున్న రిజర్వాయర్లు
శ్రీశైలంలో మిగిలింది 7టిఎంసీలే
సాగర్‌లో కనిష్ఠ నీటిమట్టానికి మరో 4అడుగులు
నాలుగు నెలలు గడిచేదెలా?
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తాగునీటి గండం ముంచుకోస్తోంది. ఎండాకాలం ప్రారంభంలోనే పలుప్రాంతాలు నీటికోసం తపిస్తున్నాయి. వేసవి ముదిరితే సమస్య మరెంత తీవ్రరూపం దాలుస్తుందో అన్న ఆందోళన గుబులు పుట్టిస్తోంది. ప్రధాన ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు వేగంగా తరిగిపోతున్నాయి. మరో వైపు భూగర్భ జలమట్టాలు కూడా పడిపోతున్నాయి. యాసంగిలో సాగుచేసిన పంటలు కోత దశకు రావాలంటే ఇంకా మరో నెలన్నర పాటు నీటి తడులు అవసరం అంటున్నారు.
వర్షాలు వచ్చేదాక తాగునీటి అవసరాలకోసం ఉన్ననీటి నిలువలతోనే మరో నాలుగు నెలల పాటు సర్ధుకుపోయాల్సిన పరిస్థితి అనివార్యంగా మారుతోంది. మిషన్‌భగీరధ ద్వారా నల్లా నీరు రాకపోవటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సమీపాన ఉన్న వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సైతం పలు కాలనీల్లో నీటికి కటకట లాడాల్సివచ్చింది. గ్రేటర్ హైరాబాద్ పరిధిలో అప్పుడే తాగునీటి సమస్యలపై నిరసన ధ్వనులు పుట్టుకొస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో సమస్య మరింత ముదురుతోంది. నగరంలో 30లక్షలకు పైగా బోర్లు ఉండగా ,అందులో 30శాతం ఒట్టిపోయాయి.మరో 20శాతం బొటాబొటిగా నీరందిస్తున్నాయి.నల్లా నీటి సరఫరా చాలినంతగా జరగటం లేదంటున్నారు.
మణికొండ ప్రాంతంలో తాగునీటి సమస్య తీర్చకుండా తమ ప్రాంతానికి రావద్దంటూ ఆ ప్రాంత వాసులు బోర్డులు పెట్టు మరీ రాజకీయ నేతలను హెచ్చరిస్తున్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోనూ పలుకాలనీల్లో నీటి ఎద్దడి తలెత్తుతోంది. అక్కడి ప్రజలు తాగునీటి సమస్యలపై రోడ్డెక్కి మౌన ప్రదర్శనలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పలు చోట్ల తాగునీటికోసం బిందెల చేతపట్టి వ్యవసాయ బావుల దిశగా అడుగులు వేయాల్సి వస్తోంది. కొమరం భీమ్ జిల్లా పాటగూడలో మిషన్ భగీరధ పధకం ద్వారా నీరు రాకపోవటంతో గ్రామ పొలిమేరల్లో ఉన్న బావినీకిటి బారులు కడుతున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం సస్కల్ ప్రజలు మిషన్ భగీరధ పనిచేయపోవటంతో గ్రామ సమీపాన ఉన్న వ్యవసాయ బావి నీటిని ఆశ్రయిస్తున్నారు. మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే ..రాష్ట్రంలోని మరి కొన్ని ప్రాంతాల్లో కూడా తాగీనీటి సమస్య విస్తరించింది. పలు ప్రాజెక్టుల కింద ఆయకట్టులో ఎండుతున్న పైర్లను కాపాడుకునేందుకు రైతులకు కూడా పెద్ద సమస్యగా మారింది.
అడుగంటుతున్న రిజర్వాయర్లు
రాష్ట్రంలో జలాశయాలు వేగంగా అడుగంటుతున్నాయి. కృష్ణానది పరివాహకంగా ఇప్పటికే పరిస్థితి ఆందోళన కరంగా మారుతోంది. జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోకు తరిగిపోతోంది. 9.66టిఎంసీల నీటినిలువ సామర్ధం ఉన్న ఈ ప్రాజెక్టులో నీటినిలువ 3.89టిఎంసీలకు తగ్గిపోయింది. డెడ్‌స్టోరేజి కింద మిగిలిపోయే నీటిని మినహాయిస్తే లభ్యత నీటి నిలువ ఒక టిఎంసీకంటే మించదని చెబుతున్నారు. మరో వైపు ఎగువన కర్నాటకలో నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి చుక్కనీరు కూడా కిందకు వదలటం లేదు. దీంతో జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటి ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ జలాశయంపై ఆధారపడి ఆయకట్టులో వేసిన పంటల పరిస్థితి దయనీయంగా మారింది. సాగునీటి మాట అటుంచి ముందు తాగునీటి అవసరాలకు నీరెలా అన్నదే సందేహంగా మారింది.
శ్రీశైలంలో మిగిలింది 7 టీఎంసీలే !
కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా పడిపోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న ఈ ప్రాజెక్టులో నీటినిలువ కనిష్ట నీటిమట్టానికి దిగువకు ఎప్పుడో పడిపోయింది. 215టీఎంసీల గరిష్ట స్థాయి నీటినిలువ సామర్ధం ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో మినిమం డ్రా డౌన్ లెవెల్ 854 అడుగుల వద్ద 89టీఎంసీల నీరు నిలువ ఉండాలి. అయితే ఎండిడిఎల్‌ను 834 అడుగుల స్థాయికి కుదించటవల్ల రిజర్వాయర్‌లో ఈ స్ధాయి వద్ద 53టిఎంసీలను నిలువ ఉంచాల్సివుంది. కనీస నీటిమట్టం స్ధాయిని కాదని ఇప్పటికీ ఎడా పెడా నీటిని తోడేస్తున్నారు. సోమవారం శ్రీశైల ప్రాజెక్టులో నీటిమట్టం 812అడుగులకు పడిపోయింది. రిజర్వాయర్‌లో నీటినిలువ 35టిఎంసీలకు చేరింది. అయితే ఈ రిజర్వాయర్‌లో అత్యవసర పరిస్థితులు అదికూడా తాగునీటి గండం ముంచుకొస్తే 800అడుగుల స్థాయి నీటిమట్టం వరకూ నీటిని ఉపయోగించుకునే వెసులు బాటు కల్పించారు. 800 అడుగుల స్థాయికి పైన 812 అడుగుల స్థాయిలో నిలువ ఉన్న నీటిలభ్యత కేవలం 7 టిఎంసీలు మాత్రమే అని అధికారులు వెల్లడించారు. 800అడుగులు అంతకు మించి దిగువకు వెళితే బురద నీరు లభిస్తుందంటున్నారు.
సాగర్‌లో మిగిలింది 4అడుగులే :
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కనిష్ట స్థాయికంటే కేవలం 4అడుగులు మాత్రమే మిగిలినట్టు అధికారులు వెల్లడించారు. ఈ జలాశయం గరిష్టస్థాయి 590అడుగుల నీటి మట్టం వద్ద రిజర్వాయర్‌లో గరిష్ఠ స్థాయి నీటినిలువ సామర్ధం 312టిఎంసీలు కాగా, సోమవారం నాటికి రిజర్వాయర్‌లో నీటిమట్టం 514అడుగులకు పడిపోయింది. ఈ స్థాయిలో నీటినిలువ 139టిఎంసీల నీరు నిలువ ఉంది. ఈ రిజర్వాయర్ కనిష్ట నీటి నిటిమట్టం 510అడుగులు కాగా , ఇక కేవలం 4అడుగుల మేరకే లభ్యత నీటిమట్టం మిగిలి ఉంది. 510అడుగుల స్థాయికి మించి దిగువకు నీటిని ఈ రిజర్వాయర్ నుంచి తీసుకునే వీలు లేదంటున్నారు. సాగర్ రిజర్వాయర్‌కు ఎగువ నుంచి 3577క్యూసెక్కుల నీరు చేరుతుండగా, రిజర్వాయర్ నుంచి అంతకు రెట్టింపు నీటిని ఖాళీ చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో పవర్‌హౌస్ ద్వారా 3394క్యూసెక్కులు, కాల్వల ద్వారా 3931క్యూసెక్కులు, ఇతర మార్గాల ద్వారా 312 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు.
శ్రీరాంసాగర్‌లో రోజుకు అర టిఎంసీ ఖాళీ!
గోదావరి నదీపరివాహకంగా కూడా జలశయాలు వేగంగా తరిగిపోతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటినిలువ 25టిఎంసీలకు పడిపోయింది. ఈ రిజర్వాయర్ నుంచి రోజుకు అరటీఎంసీ నీరు ఖాళీ అవుతోంది. పవర్ హౌస్‌ద్వారా 3500, కాలువల ద్వారా 2103, ఇతర మార్గాల ద్వారా 389 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్ నుంచి బయటకు వెళుతోంది. దిగువన ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో కూడా నీటినిలువ 9.97టిఎంసీలకు తరిగిపోయింది. మేడిగడ్డ , అన్నారం బ్యారేజిలను ఖాళీ చేయటంతో ఇక ఈ రిజర్వాయర్‌లోకి దిగువనుంచి నీటిని ఎత్తిపోసే అవకాశాలు కూడా లేకుండా పోయాయి.డెడ్‌స్టోరేజి కింద మిగిలిపోయే నీటితో కలిపి మిడ్‌మానేరులో 12టీఎంసీలు, లోయర్ మానేరులో 7.50టిఎంసీలు, కడెంలో 3టిఎంసీలు ,నిజాంసాగర్‌లో 7.53టీఎంసీలు, సింగూరులో 20టిఎంసీల నీరు నిలువ ఉంది.
కర్ణాటక కరుణిస్తుందా!
వేసవి తాగునీటి గండం నుంచి గట్టెక్కేందుకు కర్ణాటక కరుణపై ఆధారపడాల్సివస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో తాగునీటి అవసరాలు, రిజర్వాయర్‌లలో నీటి నిలువలను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త కింద పోరుగునే ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి పదిటీఎంసీల నీటిని తెలంగాణకు తెచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి పది టీఎంసీలు విడుదల చేయాలని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వానికి సూచన ప్రాయంగా ప్రతిపాదన పంపింది. ఇందుకోసం రాష్ట్రం నుంచి త్వరలోనే మంత్రుల బృందాన్ని బెంగుళూరు పంపే ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ప్రయత్నం ఫలిస్తే వేసవి అసరాలకు కొంతమేర ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి.