నీటి సరఫరా అంతరాయం, డ్రైనేజీ ఇబ్బందులు లేకుండా పరిష్కారాలు
స్దానిక ప్రజలతో కాలనీలు, బస్తీలు తిరుగుతున్న సెక్షన్ అధికారులు
పలు చోట్ల బయటపడుతున్న అక్రమ నల్లా కనెక్షన్ల బాగోతం
సమస్యలకు పరిష్కారం చూపడంపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగర ప్రజలకు మంచినీటి, డ్రైనేజీ సమస్యలు రాకుండా ముందుస్తుగా జలమండలి స్దానిక అధికారులు స్పెషల్ డ్రైవ్ చేస్తూ బస్తీలు, కాలనీలు తిరుగుతూ సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. తమ సిబ్బందితో కలిసి సమస్యలను తెలుసుకుంటూ వీలైనంత మేరకు అక్కడిక్కడే సమస్యలు లేకుండా చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి పలు డివిజన్ల పరిధిలో సెక్షన్ మేనేజర్లు క్షేత్రస్దాయిలో పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తెలుసుకుంటున్నారు. వాటర్‌బోర్డు అధికారులు ప్రధానంగా తాగునీటి సరఫరా నిలిచిపోవడం, మురుగునీటి సమస్యలు, కలుషిత నీటి సరఫరా వంటి సమస్యలపై పిర్యాదులు వస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమంలో సమస్యలకు పరిష్కారం చూపడంపై స్దానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు అక్రమ నల్లా కనెక్షన్లు కూడా బయటపడుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలు పెండింగ్‌లో ఉన్న సమస్యలను అధికారులు పరిశీలన చేస్తూ పెద్ద సమస్యలైతే వాటికి నిధులు కేటాయించేలా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. వానకాలం వస్తే పైపులైన్‌లు దెబ్బతినడంతో కలుషిత నీరు వస్తుందని,వాటి స్దానంలో కొత్త పైపులు వేసి పరిశుభ్రమైన నీరు వచ్చేలా చేయాలని స్దానికులు కోరుతున్నారు. పాతబస్తీ వంటి చోట్ల ఇదే సమస్య ఎదురైతున్నట్లు సిబ్బంది వెల్లడిస్తున్నారు.
ఇప్పటికే జూబ్లీహిల్స్, ఫిలింనగర్, షేక్‌పేట, మెహిదిపట్నం, కార్వాన్, బహదూర్‌పురా, చాత్రినాక, గోషామహల్, సుల్తాన్‌బజార్‌లతోపాటు పర్యటిస్తుండగా, శివారు ప్రాంతాలైన బాలానగర్, మల్కాజిగిరి, తార్నాక, మారేడుపల్లి, సనత్‌నగర్ వంటి ప్రాంతాల్లో త్వరగా పర్యటించనున్నట్లు మేనేజర్లు పేర్కొంటున్నారు. ఈఏడాది కురిసిన వర్షాలకు గ్రేటర్ నగరానికి తాగునీరందించే ప్రాజెక్టులు నీటితో కళకళలాడటంతో వాటిని ప్రజలకు అంతరాయం లేకుండా వేసవిలో సరఫరా చేసేందుకు తగిన జాగ్రత్తలు చేపడుతున్నట్లు డివిజన్ మేనేజర్లు అంటున్నారు. 22 డివిజన్ పరిధిలో కాకుండా ఓఆర్‌ఆర్ గ్రామాల్లో కూడా సమస్యలుంటే పరిష్కారించి నీటి సరఫరా సకాలంలో చేస్తామని తెలిపారు.