మేడ్చల్ నియోజకవర్గంలో ఓఆర్‌ఆర్ ఫేజ్2 పనులకు మంత్రి కెటిఆర్ శంకుస్దాపన
ఒఆర్‌ఆర్ పరిధిలో తాగునీటి సమస్య ఉండదు
మన తెలంగాణ, సిటీబ్యూరో: ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామపంచాయితీలకు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటిని అందించేందుకు రూ. 1200 కోట్లతో జలమండలి ఓఆర్‌ఆర్ ప్రాజెక్ట్ ఫేజ్2 పనులను చేపట్టింది. ఈప్రాజెక్టులో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలో సుమారు రూ. 240 కోట్లకు పైగా నిధులతో జలమండలి తాగునీటి సదుపాయాలు కల్పించనుంది. బుధవారం జవహర్‌నగర్, ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వివిధ అభివృద్ది పనులతో ఓఆర్‌ఆర్ ఫేజ్2 పనులకు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్దాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని మహానగరాల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని, రైళ్లలో నీటిని తరలించాల్సిన పరిస్దితి ఉందని పేర్కొన్నారు.
మన హైదరాబాద్ నగరంలో పరిస్దితులు రావొద్దని తెలంగాణ ఏర్పడిన నాటి నుంచే మన ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుచూపుతో వ్యవహరించి తాగునీటి సమస్య లేకుండా చేశారన్నారు. మొత్తం రాష్ట్రమంతా ప్రతి ఇంటికి నీటిని అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టినట్లు తెలిపారు. 201408 మధ్యకాలంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు సుమారు రూ. 2000కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించినందున తమ ప్రభుత్వం ఓఆర్‌ఆర్ పరిధిని మొత్తం హైదరాబాద్ నగరంగానే పరిగణిస్తోందని చెప్పారు. ఈప్రాంతంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయితీల్లోనూ తాగునీటి సమస్య లేకుండా ఓఆర్‌ఆర్ ఫేజ్1లో సుమారుగా రూ. 700 కోట్లకు పైగా నిధులతో తాగునీటి సదుపాయాన్ని కల్పించడం జరిగిందన్నారు.
ఇప్పుడు ఓఆర్‌ఆర్ పరిధిలోని మరో 2లక్షలకు పైగా ఇళ్లకు నీటిని అందించేందుకు రూ. 1200 కోట్లతో ఓఆర్‌ఆర్ ఫేజ్2 పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ఓఆర్‌ఆర్ ఫేజ్2 పనుల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలో సుమారు రూ. 240 కోట్లకు పైగా నిధులతో పనులు జరిపిస్తున్నట్లు చెప్పారు. ఈపనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు తాగునీటిని అందిస్తామని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గంలోనే కొత్తగా 50వేల ఇళ్లకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్‌లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్, జూలై, డిసెంబర్ నెలల్లో మూడు విడుతలుగా కొత్త కనెక్షన్లు ఇచ్చి తాగునీటిని అందిస్తామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, జలమండలి ఎండీ దానకిషోర్, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, జవహర్‌నగర్ మేయర్ మేకల కావ్య, ఫీర్జాదిగూగ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి,బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.