Thursday, January 23, 2025

రేపు పెద్దగట్టులో దిష్టి పూజ

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : తెలంగాణాలో జరిగే జాతరల్లో శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర రెండవదిగా చెప్పుకుంటారు. ప్రతి రెండు సంవత్సరాలకొకసారి జాతర ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు నిర్వహించనున్న విషయం విధితమే. పక్షం రోజుల ముందు జరిగే జాతరకు సంకేతంగా దిష్టి పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నెల 21న ఆదివారం అర్థరాత్రి దిష్టి (బలి)పూజ నిర్వహిస్తారు. దీంతో జాతర ఆరంభమైనట్టుగా భావించి భక్తులు రానున్న పదిహేను రోజులలో జాతరకు అవసరమైన ఏర్పాట్లను చేసుకోవడంలో తనమునకలు అయిపోతారు. దిష్టి పూజ కార్యక్రమానికి ముందు దేవతా మూర్తులతో కూడిన దేవర పెట్టెను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చీకటాయిపాలెం నుంచి సూర్యాపేట మండలం కేసారానికి తీసుకువస్తారు.

ఆదివారం రాత్రి ప్రత్యేక పూజల (దిష్టి పూజ) కోసం పెద్దగట్టుకు తీసుకువచ్చిన, అనంతరం తిరిగి కేసారం గ్రామానికి తరలిస్తారు. సూర్యాపేట మండల పరిధిలోని కేసారం గ్రామంలో మెంతబోయిన వంశస్తులకు ఈ దేవరపెట్టెను అప్పగిస్తారు. పదిహేను రోజులలో ప్రారంభం కానున్న జాతర సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజల అనంతరం ఊరేగింపుగా లింగమంతుల (పెద్దగట్టు) సన్నిధికి తీసుకురావడం ద్వారా ఫిబ్రవరి 5న జాతర ప్రారంభమవుతుంది. దిష్టి పూజ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న యాదవ పూజారులైన బైకానులు దేవరపెట్టెకు పూజలు నిర్వహించిన అనంతరం చీకటాయిపాలెం నుంచి బయలుదేరి సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న చివ్వెంల మండలం దురాజ్‌పల్లి పెద్దగట్టుకు చేర్చుతారు. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరుగనున్న ఈ జాతరకు మెంతబోయిన, తండ, మట్ట వంశీయులే పూజారులుగా వ్యవహరించనున్నారు.

సంస్కృతికి నిదర్శనమైన తాళ్లపత్రాలు, వీరణాలు, తాళాలు, గజ్జెల లాగులు, భేరీలతో ప్రత్యేక నృత్యాల మధ్య లింగమంతుల సన్నిధి ఒ..లింగా… ఓ…లింగా నామస్మరణతో కేరింతల మధ్య పెద్దగట్టు జాతర సాగుతుంది. ఈ గట్టు పై లింమంతులు, సౌడమ్మ కొలువు దీరి భక్తుల నుంచి దీప ధూప నైవేద్యాలు మొదలుకొని మొక్కలు తీర్చుకునే భక్తులు లింగన్న సన్నిధిలో యాటపొట్టెల్లను బలిచ్చి భక్తుని చాటుకుంటారు. 16వ శతాబ్ధం నుంచి ప్రారంభమైన ఈ జాతర ఘనంగా సాగుతుంది.
రేపు దిష్టిపూజ
యాదవుల ఆరాధ్య దైవంగా పిలుచుకునే పెద్దగట్టు జాతరకు రేపు (ఆదివారం) దిష్టి పూజ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ప్రారంభమవుతుంది. తల్లి, పిల్ల గొర్రెను బలిచ్చి నైవేద్యం (బోనం) తో బలిముద్దను తయారు చేసి పరిసరాలల్లో ఎలాంటి అపశకనాలు జరగకుంట సాంప్రదాయ బద్దంగా నిర్వహిస్తారు. అప్పటికే గట్టుకు చేరుకున్న దేవరపెట్టెకు, దేవతామూర్తులకు ఈ దిష్టి పూజ ద్వారా (జాతరకు) ఎలాంటి ఇబ్బందులు సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండే విధంగా చేపడుతున్నట్లుగా చెబుతుంటారు. దిష్టి పూజ కార్యక్రమం అనంతరం అక్కడి చేరుకున్న లింగమంతుల స్వామి భక్తులకు మరుసటి రోజు బలి ఇచ్చిన గొర్రె, పిల్ల మాంసంతో వండిన ఆహారాన్ని భక్తులకు పెడుతారు.
నేడు గట్ట్టుకు దేవరపెట్టె
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చీకటాయిపాలెం నుంచి దేవరపెట్టెను యాత్రగా శనివారం కేసారం తీసుకురానున్నారు. చీకటాయిపాలెంలో ప్రత్యేక పూజల అనంతరం పూజారులు సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించిన దేపరపెట్టెకు కేసారం చేరేవరకు ఆయా ప్రాంతాల్లోని యాదవులు ప్రత్యేకంగా స్వాగతం పలికి దర్శించుకుంటారు. మరుసటి రోజు దిష్టి పూజ కార్యక్రమానికి పెద్దగట్టుకు తీసుకువస్తారు.
పెద్దగట్టు జాతరను విజయవంతం చేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కోడి సైదులు యాదవ్ తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరిగే జాతరకు మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారంతో ఇప్పటికే 5కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడంతో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నారన్నారు. జాతరకు రెండు మూడు రోజలు ముందు నాటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసే విధంగా మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అధికారులు పనులను చేపడుతున్నారని గుర్తు చేశారు. నేడు రానున్న దేవరపెట్టెకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు యాదవ భక్తులు తరలిరావాలని, ఆదివారం రాత్రి జరిగే దిష్టి పూజ కార్యక్రమానికి లింగన్న భక్తులు సాంప్రదాయ భేరీలు, గజ్జెల లాగుతో సాయంత్రానికి గట్టుకు చేరుకోవాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News