Monday, January 20, 2025

పంత్‌ను కాపాడిన ఆ డ్రైవ‌ర్ రియల్ హీరో…

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్‌: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. పంత్ గురువారం ఢిల్లీ నుంచి సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్ వెళ్తుండగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు.

కాగా.. రిష‌బ్ పంత్‌ను కాపాడిన బ‌స్సు డ్రైవ‌ర్ సుశీల్ కుమార్‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు మాజీ క్రికెట‌ర్‌, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌. అయితే కారులో చిక్కుకున్న పంత్‌ను డ్రైవ‌ర్ సుశీల్ కుమార్‌తో పాటు కండక్ట‌ర్ ప‌ర‌మ్‌జిత్ ర‌క్షించారు. హ‌ర్యానా రోడ్‌వేస్‌కు చెందిన డ్రైవ‌ర్ సుశీల్ రియ‌ల్ హీరో అని ల‌క్ష్మ‌ణ్ ట్వీట్ చేశాడు. మండుతున్న కారు నుంచి పంత్‌ను బ‌య‌ట‌కు తీసి, అత‌ని చుట్టు బెడ్‌షీట్ చుట్టిన సుశీల్ రియ‌ల్ హీరో అన్నాడు.

సుశీల్ అంబులెన్స్‌కు కూడా కాల్ చేశాడు. మీ నిస్వార్ధ సేవ‌కు మేం రుణ‌ప‌డి ఉన్నామ‌ని, రియ‌ల్ హీరో సుశీల్ జీ అంటూ ల‌క్ష్మ‌ణ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. బ‌స్సు కండెక్ట‌ర్ ప‌ర‌మ్‌జిత్‌ను కూడా ల‌క్ష్మణ్ మెచ్చుకున్నాడు. స్వార్ధం లేని ఈ వ్య‌క్తులు ఇద్ద‌రూ గొప్ప హృద‌యం క‌లిగిన‌వార‌ని, వాళ్ల స‌మ‌య‌స్పూర్తి అమోఘ‌మ‌ని, పంత్‌ను ర‌క్షించిన‌వారంద‌రికీ ల‌క్ష్మ‌ణ్ థ్యాంక్స్ తెలిపాడు.

త్వరగా కోలుకోవాలని..
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని కోరుతూ పలువురు టీమిండియా క్రికెటర్లు ట్వీట్ చేశారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, వసీం అక్రమ్, లక్ష్మణ్, రోహిత్ తదితరులు పంత్ ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలని ట్విటర్ వేదికగా పోస్టులు పెట్టారు. ఇక దేశ వ్యాప్తంగా అభిమానులు కూడా పంత్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ప్రార్థనాలు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News