ఐఎఎఫ్ హెలికాప్టర్లే లక్షం కావచ్చని అనుమానం
ఆయుధాలు, వాహనాలు సురక్షితం
ఇద్దరికి గాయాలు, భవనం పైకప్పుకు భారీ రంధ్రం
దేశంలో తొలి డ్రోన్ దాడి ఇదేనంటున్న అధికారులు
సంఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆరా
జమ్మూ: భారత్ ఏ విషయంలో ఆందోళన చెందుతోందో ఇప్పుడు అదే జరిగింది. పాక్ ఉగ్రమూకలు ఇప్పుడు డ్రోన్ల వినియోగం మొదలు పెట్టాయి. తాజాగా ఆదివారం తెల్లవారుజామున జమ్మూలోని వాయుసేన ఎయిర్‌పోర్టులోని హెలికాప్టర్ల హ్యాంగర్లపై జరిగిన దాడికి డ్రోన్లను ఉపయోగించాయి. అదృష్టవశాత్తు వాయుసేన ఆయుధాలకు, వాహనాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు కానీ ఇద్దరు సిబ్బంది మాత్రం గాయపడ్డారు. తెల్లవారు జామున 1.40 గంటల సమయంలో ఆరు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయి. మొదటి పేలుడులో ఒక సింగిల్ స్టోరీ బిల్డింగ్ పైకప్పుకు భారీ రంధ్రం ఏర్పడింది. రెండో పేలుడు బహిరంగ ప్రదేశంలో జరిగిందని అధికారులు చెప్పారు. కాగా జమ్మూలోని భారత వాయుసేన స్థావరంపై జరిగిన దాడి ఉగ్రదాడి అని జమ్మూ, కశ్మీర్ పోలీసు చీఫ్ దిల్‌బాగ్ సింగ్ చెప్పారు. ఈ దాడి వెనక ప్రణాళిక గుట్టు విప్పడానికి పోలీసులు, ఇతర భద్రతా ఏజన్సీలు, వాయుసేన అధికారులతో కలిసి పని చేస్తున్నారని, జాతీయ దర్యాప్తు ఏజన్సీ ఎన్‌ఐఎకు చెందిన అధికారులు కూడా సంఘటనా స్థలంలో ఉన్నారని ఆయన చెప్పారు.
డ్రోన్లు ఎక్కడినుంచి బయలుదేరాయి, ఏ మార్గం గుండా ప్రయాణించాయో స్పష్టంగా నిర్ధారణ కానప్పటికీ దాడి జరిగిన ప్రదేశానికి , అంతర్జాతీయ సరిహద్దుకు మధ్య దూరం 14 కిలోమీటర్లు మాత్రమే ఉండడంతో అవి సరిహద్దు ఆవలినుంచే వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. పాకిస్థాన్ ఇప్పటికే పంజాబ్, జమ్మూ, కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు డ్రోన్లద్వారా ఆయుధాలను జారవిడుస్తోంది. వీటిని రాడార్లు కూడా గుర్తించడం లేదు. కాగా ప్రస్తుత డ్రోన్లను కూడా రాడార్లు గుర్తించలేదు. భారత్‌లో డ్రోన్లను ఉపయోగించి రక్షణ దళాలపై చేసినన తొలిదాడిగా దీన్ని భావిస్తున్నారు. ఓ వైపు ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతుండగానే మరో వైపు లష్కరే తోయిబాతో సంబంధాలున్న ఓ వ్యక్తిని దాదాపు ఆరు కిలోల బరువున్న ఐఇడి(అత్యాధునిక పేలుడు పరికరం)తో పట్టుకోవడంతో మరో పెను ప్రమాదం తప్పిందని డిజిపి చెప్పారు. రద్దీగా ఉన్న ప్రదేశంలో పేలుడు జరపడం కోసమే ఆ వ్యక్తి దీన్ని తీసుకు వస్తున్నట్లు భావిస్తున్నట్లు తెలిపారు.
రక్షణ మంత్రి ఆరా
కాగా జమ్మూ వాయుసేన విమానాశ్రయంపై డ్రోన్ల దాడి ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వాయుసేన వైస్ చీఫ్, ఎయిర్ మార్షల్ హెచ్‌ఎస్ అరోరాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మరో ఉన్నతాధికారి ఎయిర్‌మార్షల్ విక్రమ్ సింగ్‌ను సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. కాగా ఈ సంఘటన కారణంగా జమ్మూ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ప్రవత్ రంజన్ బురియా చెప్పారు.