న్యూఢిల్లీ: హిందూ మహాసముద్రం సమీపంలోని గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతంలో బుధవారం రాత్రి మార్షల్ దీవి నుంచి బయల్దేరిన ఒక వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి చేయగా భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ విశాఖపట్నం అత్యంత వేగంగా క్షిపణితో దాన్ని కూల్చివేసింది. ఎంవి జెంకో పికార్డీ అనే ఈ వాణిజ్య నౌకలో 9 మంది భారతీయులతోసహా 22 మంది సిబ్బంది ఉన్నారు. ఏడెన్ పోర్టుకు దక్షిణాన 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఎర్ర సముద్రం, అరేబియా సముద్రంలో ఇటీవలి కాలంలో వరుసగా వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులు జరిగిన నేపథ్యంలో తాజాగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, నౌకలో చెలరేగిన మంటలను సిబ్బంది వెంటనే ఆర్పివేశారని అధికారులు తెలిపారు.
బుధవారం రాత్రి 11.11 ప్రాంతంలో ఎంవి జెంకో పికార్డీ నుంచి సహాయం కోసం పిలుపు రాగా గంటలోపలే స్పందించిన భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విశాఖపగ్నం వెంటనే క్షిపణితో ఆ డ్రోన్‌ను కూల్చివేసినట్లు భారత నౌకాదళం తెలిపింది. భారత నౌకాదళానికి చెందిన ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్(ఇఓడి) నిపుణులు గురువారం ఉదయం ఆ వాణిజ్య నౌకలోకి ప్రవేశించి దెబ్బతిన్న ప్రదేశాన్ని పరిశీలించారు. తనిఖీల అనంతరం ఆ వాణిజ్య నౌక సురక్షితంగా ఉందని నిర్ధారించి ముందుకు ప్రయాణించేందుకు అనుమతించారు. అక్రమ రవాణాను అడ్డుకునే కార్యకలాపాల నిమిత్తం ఐఎన్‌ఎస్ విశాఖపట్నంను గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో భారత నౌఐకాదళం మోహరించిందని భారత నౌకాదళ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వాల్ తెలిపారు. ఇలా ఉండగా&జనవరి 5వ తేదీన లైబీరియా నుంచి బయల్దేరిన ఎంవి లీలా నార్‌పోల్క్ అనే వాణిజ్య నౌకను ఉత్తర అరేబియా సముద్రంలో హైజాక్ చేయడానికి జరిగిన ప్రయత్నాన్ని భారత నౌకాదళం విజయవంతంగా భగ్నం చేసి అందులోని సిబ్బందిని రక్షించింది.
డిసెంబర్ 23న భారతదేశానికి చెందిన పశ్చిమ తీర సమీపంలో లైబీరియాకు చెందిన ఎంవి చెమ్ ప్లూటో అనే వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరుగగా అందులో 21 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. అదే రోజున దక్షిణ ఎర్ర సముద్రంలో భారత్‌కు వస్తున్న ఒక వాణిజ్య చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఆ నౌకలో 25 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఉత్తర, మధ్య అరేబియా సముద్రంతోసహా కీలకమైన సముద్ర మార్గాలలో పటిష్టయమైన నిఘా, భద్రత కోసం భారత నౌకాదళం యుద్ధ నౌకలను మోహరించింది.