Sunday, December 22, 2024

రెండో రోజూ గాజాపై ఇజ్రాయెల్ భూతల దాడులు

- Advertisement -
- Advertisement -

డీర్ అల్ బలా( గాజా): ఇజ్రాయెల్ బలగాలు వరసగా రెండో రోజు గాజా ప్రాంతంపై భూతల దాడులు జరిపింది. యుద్ధ విమానాలు, డ్రోన్ల మద్దతతో ఇజ్రాయెల్ బలగాలు గాజా నగర శివార్లలోని హమాస్ మిలిటెంట్ల స్థావరాలపై దాడులు జరిపింది. ఇదిలా ఉండగా తమ బలగాలపై దాడులకు ప్రతిగా అమెరికా దక్షిణ సిరియాలోని మిలిటెంట్ల స్థావరాలపై వైమానిక దాడులతో విరుచుకు పడింది. అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ లాయిడ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకే ఈ దాడులు జరిపామని, ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్ , దాని అనుబంధ విభాగాలు ఈ స్థావరాలను ఉపయోగించుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.

ఇరాక్, సిరియాలలో ఉన్న అమెరికా బలగాలను లక్షంగా చేసుకుని ఈ నెల 17నుంచి ఇరాన్ ప్రోత్సాహిత ఉగ్రవాద సంస్థలు వరస దాడులకు పాల్పడుతున్నాయి. ఈ దాడులు హమాస్, ఇస్లామిక్ జిహాద్, హిజ్బుల్లా పనేనని అమెరికా అనుమానిస్తోంది. ప్రతిదాడుల్లో భాగంగానే తాజా దాడులు జరిపినటు ్లఅమెరికా ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ హమాస్ సంక్షోభానికి, ఈ దాడులకు ఎలాంటి సంబంధం లేదని ఆస్టిన్ స్పష్టం చేశారు. అమెరికా బలగాలపై దాడులు జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి గురువారం నేరుగా హెచ్చరికలు చేశారు. ఈ ప్రకటన వెలువడి 24 గంటలు కూడా గడవకముందే అమెరికా సిరియాలోని ఇరాన్ స్థావరాలను లక్షంగా చేసుకోవడం గమనార్హం.

హమాస్ కీలక కమాండర్లు హతం
ఇదిలా ఉండగా తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో హమాస్‌కు చెందిన ఓ కీలక కమాండర్, మరో ముగ్గురు సీనియర్ ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. నిఘా వర్గాల సమాచారం మేరకు తమ వైమానిక దాడిలో హమాస్‌లోని దరాజ్ తుఫా బెటాలియన్‌కు చెందిన ముగ్గురు కీలక ఆపరేటర్లు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ (ఇడిఎఫ్) వెల్లడించింది. వారి ఫోటోలను కూడా ఎక్స్ వేదికగా విడుదల చేసింది.అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో హమాస్ జరిపి మారణకాండలో ఈ బెటాలియనే కీలక పాత్ర పోషించినట్లు తెలిపింది. ఇక అంతకు ముందు గురువారం ఉదయం జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ డిప్యూటీ హెడ్ షాదీ బరూద్ మృతి చెందినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. అక్టోబర్ 7 నాటి దాడి ప్లానింగ్‌లో ఇతడు కూడా భాగమైనట్లు ప్రకటించింది.

7 వేలు దాటిన మృతుల సంఖ్య: హమాస్
మరో వైపు గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 7 వేలు దాటిపోయినట్లు గాజాలోని హమాస్ వైద్య వాఖ తెలిసింది. గతంలో ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య జరిగిన నాలుగు యుద్ధాల్లో మృతి చెందిన మొత్తానికన్నా ఇది ఎక్కువ అని ఆ శాఖ తెలిపింది.ఆ యుద్ధాల్లో దాదాపు 4 వేల మంది మృతి చెందినట్లు అంచనా. మృతుల్లో 2,900 మంది మైనర్లు, 1,500 మందికి పైగా మహిళలున్నారని కూడా తెలిపింది. గాయపడిన వారి సంఖ్య పది వేలకు పైగానే ఉన్నట్లు తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడుల్లో 1,400 మందికి పైగా ఇజ్రాయెలీలు చనిపోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎక్కువ మంది పౌరులే ఉన్నట్లు ఇజ్రాయెల్ చెప్తోంది.

ఈజిప్టు పట్టణంపై కూలిన క్షిపణి
కాగా, ఇజ్రాయెల్‌హమాస్ పోరు వేళ ఓ అనూహ్య సంఘటన జరిగింది. ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని ఓ ఈజిప్టు పట్టణంపై క్షిపణి కూలింది.సరిహద్దుల్లోని రెడ్‌సీ రిసార్ట్ టౌన్ తాబాలో గల ఓ వైద్య, ఆరోగ్య కేంద్రంపై ఈ క్షిపణి కూలినట్లు ఈజిప్టు మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడినట్లు తెలిపాయి. ఈ ఘటన గురించి తమకు తెలిసిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. అయితే ఈ క్షిపణి ఎక్కడినుంచి వచ్చిందనే దానిపై మాత్రం స్పష్టత లేదు. మరోవైపు ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడుల్లో తమవద్ద బంతీలుగా ఉన్న వారిలో దాదాపు 50 మంది చనిపోయారని హమాస్ వెల్లడించింది. హమాస్ చెరలో 220 మందికి పైగా బందీలుగా ఉన్న విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News