న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జసోలా విహార్ మెట్రో మార్గంలోని పట్టాలపై డ్రోన్ కుప్పకూలడం తీవ్ర కలకలం సృష్టించింది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తయ్యారు. ప్రయాణికులు భయాందోళనలకు గురికాగా, సుమారు అరగంట సేపు ఆ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలను నిలివేశారు. ఆదివారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఈ సంఘటన చోటుచేసుకుంది.
దీనిపై మెట్రో డీసీపీ జితేంద్ర జైన్ మాట్లాడుతూ, జసోలా విహార్ సమీపంలోని మెట్రో ట్రాక్‌పై డ్రోన్ కనపడటంతో పోలీసులు, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలికి హుటాహుటిన వెళ్లినట్టు చెప్పారు. డ్రోన్ కూలిన చోట మెడికల్ సరఫరాలు కనిపించాయని, నొయిడాకు చెందిన ఒక కంపెనీ ఈ మందులను డ్రోన్ ద్వారా సరఫరా చేస్తున్నట్టు గుర్తించామని చెప్పారు. డ్రోన్ రాకపోకలకు డీజీసీఏ అనుమతి ఉందా లేదా అనే విషయమై డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఇన్వెస్టిగేషన్ ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.