ఇంఫాల్ : మణిపూర్‌లో గత నెల హింసాత్మక సంఘటనలు చెలరేగిన సమయంలో పోలీస్ స్టేషన్ల నుంచి భారీ ఎత్తున ఆయుధాలను కాజేయడం జరిగింది. అప్పటి నుంచి ముఖ్యమంత్రి ఎన్. బీరేన్‌సింగ్, కేంద్ర మంత్రి అమిత్‌షా కాజేసిన ఆయుధాలను తిరిగి అప్పగించాల్సిందిగా ప్రజలను అభ్యర్థిస్తూనే వచ్చారు. ఈ నేపథ్యంలో ఇంఫాల్ లోయ తూర్పుకు చెందిన బీజేపీ శాసనసభ్యుడు సుశీంద్రో మెయితీ తన ఇంటివద్ద డ్రాప్‌బాక్స్‌ను ఏర్పాటు చేశారు. “కాజేసిన ఆయుధాలను ఆ బాక్స్‌లో పడేయండి. మీ వివరాలు అజ్ఞాతంగా ఉంచుతాం. ఎవరికీ తెలియనీయం” అని అభ్యర్థించారు. “ అలా చేయడానికి సంకోచించకండి ” అని కూడా సూచిస్తూ ఒక ప్రకటన దాని కింద ఏర్పాటు చేశారు.
ఇప్పటివరకు ఆ బాక్స్‌లో రెండు ఆటోమేటిక్ రైఫిల్స్, తూటాల బెల్టులు చేరాయి. ఆయుధాలను సేకరించడానికి ఆర్మీ, పారామిలిటరీ దళాలు, పోలీస్ బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టి ఆయా వర్గాలని నిష్క్రియాపరం చేయడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా 35 ఆయుధాలు, యుద్ధ గిడ్డంగి వంటి ఆయుధ నిల్వలు శుక్రవారానికి స్వాధీనమయ్యాయని అధికారి ఒకరు తెలిపారు.