న్యూఢిల్లీ : ఎన్నికల ప్రక్రియలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నికల కమిషన్ ఉపయోగించడం ప్రపంచం లోని అన్ని ప్రజాస్వామ్య దేశాలకు చక్కని ఉదాహరణగా నిలిచిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం శ్లాఘించారు. ఈ విధమైన వినియోగాన్ని మరింత విస్తరింప చేయాలని ఆమె అభిలషించారు. మహిళలు, దివ్యాంగులు, దుర్బలమైన వర్గాలకు కూడా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశాలను విస్తరింపచేసే కమిషన్ ప్రయత్నాలను అభినందించారు. 14 వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రసంగించారు.
దేశం రిపబ్లిక్‌గా అవతరించిన రోజు కన్నా ఒక రోజు ముందుగా 1950 జనవరి 25న ఎన్నికల కమిషన్ ఆవిర్భవించింది. గత 14 సంవత్సరాలుగా ఎన్నికల కమిషన్ వ్యవస్థాపక దినాన్ని జాతీయ ఓటర్ల దినంగా వ్యవహరిస్తున్నారు. గత 75 ఏళ్లలో ఎన్నికల కమిషన్ 17 లోక్‌సభ , 400 అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించింది. లోక్‌సభ ఎన్నికలను నిర్వహించడం ప్రపంచం లోనే చాలా భారీ ఎత్తున జరిగే ప్రక్రియగా రాష్ట్రపతి అభివర్ణించారు. 1.5 కోట్ల పోలింగ్ సిబ్బంది పర్యవేక్షణలో 12 లక్షల పోలింగ్ కేంద్రాల ద్వారా ప్రజలు ఓటు వేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ దినోత్సవం గుర్తుగా “2024 సాధారణ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ చొరవ ” అన్న పేరున ఎన్నికల కమిషన్ ప్రచురించిన మొదటి కాపీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ బహూకరించారు. చిత్ర నిర్మాత రాజ్‌కుమార్ హిరానీ సహకారంతో ఎన్నికల కమిషన్ ఓటర్ల అవగాహన కోసం రూపొందించిన “మైఓట్ …మై డ్యూటీ ” అన్న లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ ఎన్నికల్లో మహిళలకు ఓటు హక్కు కల్పించే ఘనత అంబేద్కర్‌కు దక్కుతుందన్నారు. మహిళలకు ఓటు హక్కు అంశాన్ని 1928 లోనే అంబేద్కర్ తీసుకువచ్చారన్నారు.