ఢిల్లీ: భారత దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మూ ప్రమాణం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో భారత దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమె చేత ప్రమాణం చేయించారు. అనంతరం పదవీ పత్రాలపై ఆమె సంతకాలు చేశారు. దేశ ప్రజలకు కృతజ్ఞతలు అని, తనపై మీరు చూపిన ప్రేమ, అభిమానం, నమ్మకం రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రోత్సహిస్తాయని ముర్మూ తెలిపారు. దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టేందుకు కృషి చేస్తామన్నారు. సంతాలీ చీరలో ఆమె ప్రథమ పౌరురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆదివాసీ గ్రామంలో పుట్టి… రాష్ట్రపతి భవన్ వరకు రావడం తన వ్యక్తిగత విజయం మాత్రం కాదని దేశ ప్రజల విజయమని స్పష్టం చేశారు. 50 ఏళ్ల స్వాతంత్ర్య వేడకలతో తన రాజకీయం జీవితం ప్రారంభమైందని, 75 ఏళ్ల ఉత్సవాల వేళ ప్రధమ పౌరురాలిగా ఉండడం గౌరవంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
ఈ వేడుకలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పిఎం నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్రమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపిలు, దౌత్య కార్యాలయాల సిబ్బంది, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆమె పార్లమెంట్‌కు చేరుకోగానే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సిజెఐ జస్టిస్ ఎన్‌వి రమణ ఘన స్వాగతం పలికారు.