Thursday, January 23, 2025

రూ.41 కోట్ల హెరాయిన్ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ కలకలం

హ్యాండ్‌బ్యాగ్‌తో చిక్కిన దక్షిణాఫ్రికా మహిళ

మన తెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ కలకలం రేపాయి. రూ. 41.4 కోట్ల విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్‌‌ను అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. జాంబియా నుండి వచ్చిన ఓ మహిళ ప్రయాణికురాలిపై అనుమానం రావడంతో అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో హ్యాండ్‌బ్యాగ్‌లో మహిళ డ్రగ్స్ తీసుకువచ్చినట్లు గుర్తించి ఆమె నుండి రూ.41 కోట్ల విలు చేసే 5.92 కిలోల హెరాయిన్ సీజ్ చేశారు. డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న మహిళ దక్షిణాఫ్రికాకు చెందిన ఆమెగా అధికారులు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు డ్రగ్స్ స్మగ్లింగ్‌కు అడ్డాగా మారింది. ఎయిర్‌పోర్టులో ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నా కొందరు దుండగులు డ్రగ్స్‌ను తరలించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. విదేశాల నుంచి భారీగా హెరాయిన్‌ను తీసుకొస్తూ పట్టుబడుతున్నారు. తరచూ ఈ ఘటనలు జరుగుతున్నా ఈ సారి మాత్రం ఓ మహిళ భారీ షాక్‌కు గురి చేసింది. విదేశాల నుంచి వస్తూ 5.92 కిలోల హెరాయిన్‌ను తరలించే ప్రయత్నం చేస్తూ భద్రతా సిబ్బందికి చిక్కింది.

ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అధికారులు వెల్లడించారు. పట్టుబడ్డ డ్రగ్స్‌ను సీజ్ చేశామన్నారు. మరోవైపు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నారు.. ఎవరికి ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం, సరఫరా జరిగితే సహించేది లేదని రేవంత్ సర్కార్ పేర్కొంటూనే వాటిపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ వినియోగం, సరఫరాపై పోలీసులు నిఘా పెంచారు. ఎప్పటికప్పుడు వివిధ మార్గాల ద్వారా రాష్ట్రానికి తరలిస్తున్న ముఠాల గుట్టును రట్టు చేస్తున్నారు. దీంతో డ్రగ్స్ స్మగ్లర్లు శంషాబాద్ ఎయిర్‌పోర్టును వేదికగా చేసుకుని విమానాల ద్వారా డ్రగ్స్ తరలిస్తుండటం గమనార్హం. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హెరాయిన్ డ్రగ్స్‌తో ఓ మహిళ పోలీసులకు పట్టు బడటం ఎయిర్‌పోర్టు అధికార వర్గాల్లో సంచలనం రేపింది.

గతంలో బంగారం స్మగ్లింగ్ మాదిరే నేడు డ్రగ్స్ స్మగ్లింగ్‌కు స్మగ్లర్లు తెగబడు తున్నారు. డ్రగ్స్ వినియోగం, సరఫరా నేరమని తెలిసినప్పటికీ భారీ మొత్తంలో డ్రగ్స్ విమానాల ద్వారా నగరానికి చేర్చే విధానం పలువురిని ఆశ్చర్యచకితులని చేస్తోంది. గతంలో ఇలాంటి ఘటనలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు వేదికైన తరుణంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుని నివారణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం డ్రగ్స్‌పై రాష్ట్రం కఠినంగా వ్యవహరిస్తున్న క్రమంలో విమానాల ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడే స్మగ్లర్ల సంఖ్య పెరిగిపోతుండటం గమనార్హం. అందునా మహిళలు సైతం డ్రగ్స్ స్మగ్లింగ్‌లో భాగస్వాములు కావడం గమనార్హం. దీంతో ఎయిర్‌పోర్టులో నిఘాను మరింతగా పెంచి డ్రగ్స్ స్మగ్లర్ల భరతం పట్టే విధంగా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అంతేకాదు పట్టుబడిన నిందితుల నుంచి సమాచారం సేకరించి తద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయాలని అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News