Saturday, November 9, 2024

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

రవాణా చేసే వారిని ఉక్కు పాదంతో అణచివేస్తాం
మాదకద్రవ్యాల రవాణాలో ఎంతటి పెద్దవారు ఉన్నా ఉపేక్షించం
తెలంగాణలో మాదక ద్రవ్యా అక్రమ రవాణా కనబడడానికి వీలులేదు
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కఠిన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నాం
రాష్ట్రంలో అక్రమ రవాణా, డ్రగ్స్ నివారణకు ఎన్ని నిధులైనా కేటాయిస్తాం
డ్రగ్స్‌ను సమూలంగా నివారించడం మనందరి బాధ్యత
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

మన తెలంగాణ / హైదరాబాద్ : డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్షమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మాదక ద్రవ్యాల రవాణాలో ఎంతటి పెద్దవారు ఉన్న ఉపేక్షించమని, ఉక్కుపాదంతో తమ ప్రభుత్వం అణచివేస్తోందన్నారు. డ్రగ్స్ రవాణా చేసే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉండబోతున్నాయన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ సాంగ్ ను ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికూమారితో కలిసి డిప్యూటి సీఎం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటి సీఎం మాట్లాడుతూ తెలంగాణలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యంలో మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా అనే మాట వినబడడానికి వీలులేదని సీఎం రేవంత్ రెడ్డి, సహచరం మంత్రుల బృందం కఠిన నిర్ణయం తీసుకుని డ్రగ్స్ రహిత తెలంగాణ లక్షంగా ముందుకు వెళుతున్నట్లు వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్షానికి అనుగుణంగా రాష్ట్రంలో అక్రమ రవాణా, డ్రగ్స్ నివారణకు ఎన్ని నిధులైనా పోలీస్ శాఖకు కేటాయించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంద్న్నారు. నేటి పిల్లలే రేపటి భవిష్యత్ అని ఈ ప్రభుత్వం భావిస్తున్నందున డ్రగ్స్ నివారణకు తమ ప్రభుత్వానికి బడ్జెట్ సమస్యనే కాదన్నారు. దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్‌ను సమూలంగా నివారించడం ప్రభుత్వం, పోలీసులతో పాటు మనందరి బాధ్యత అన్నారు. పోలీసులు వేసే ప్రతి అడుగు మన రక్షణ కోసమే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని పోలీసులకు సహకరించాలని కోరారు.

తెలంగాణ పోలీస్ వ్యవస్థ చాలా బలమైనది, తెలివైనదని, ఎంత దూరం వ్ళ్ళైనా నిందితులను పట్టుకునే శక్తి సామర్థ్యాలు తెలంగాణ పోలీసులకు ఉన్నాయని అన్నారు. నగరాలకి కాకుండా గ్రామాలకు విస్తరిస్తున్న మాదకద్రవ్యాల నివారణకు అన్ని గ్రామాల్లో కమిటీలు వేసి పోలీసులు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకుంటే కట్టడి చేయడం సులభం అవుతుందని సూచించారు. ప్రశాంతంగా, ఆప్యాయంగా ప్రేమగా ఉన్న కుటుంబ వ్యవస్థలో డ్రగ్స్ విష ప్రయోగం లాంటిదన్న విషయాన్ని విద్యార్థులు గ్రహించాలన్నారు. ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యార్థులు ఎదగడానికి ఈ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తున్నదని వివరించారు.

ప్రభుత్వానికి పన్నుల నుంచి వస్తున్న ప్రతి పైసా సద్వినియోగం చేస్తూ విద్యకు ఎక్కువ మొత్తంలో వెచ్చించి మీ బంగారు భవిష్యత్తుకు తోడ్పడుతున్నామని, తాత్కాలిక వ్యసనాలకు బానిసలుగా మారితే మీ తల్లిదండ్రులతో పాటు ఈ సమాజం బాధపడుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. విద్యార్థులు, యువత మంచి సహవాసంతో నడిచి భవిష్యత్తును మార్గదర్శనం చేసుకోవాలని కోరారు. కార్యక్రమం అనంతరం నెక్లెస్ రోడ్డుపై విద్యార్థుల ర్యాలీని జండా ఊపి డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిజిపి రవి గుప్తా, యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News