హైదరాబాద్: పోలీసు దాడులు జరుగుతుండడంతో నగరంలో మాదకద్రవ్యాలు అమ్మే ముఠాలు ఇక్కడ పని కానిచ్చేసుకున్నాక, వేరే మెట్రో నగరాలకు మకాం మార్చేస్తున్నాయి. నగరంలో మాదకద్రవ్యాలు అమ్మే గ్యాంగులు ఏడు వరకు ఉన్నాయని, అవి ఇక్కడ మాదకద్రవ్యాలు అమ్మేసుకున్నాక బెంగళూరు, ముంబయి, న్యూఢిల్లీ వంటి ఇతర మెట్రో నగరాలకు మకాం మార్చేసుకుంటున్నాయని సమాచారం.
“ మొత్తం ఏడు గ్యాంగుల్లో చాలా వరకు కొకైన్‌ను స్మగ్లింగ్ చేస్తుంటాయి. కొన్ని ముఠాలు ఎండిఎంఎ వంటి మాదకద్రవ్యాన్ని కూడా అమ్ముతుంటాయి. ప్రస్తుతం ఈ స్మగ్లింగ్ గ్యాంగులు తమ ట్యాక్‌టీస్‌ను మార్చుకున్నాయి. అమ్మేసుకుని వెళ్లిపోవడం చేస్తున్నాయి. ఆ ముఠాలన్నీ ఇతర మెట్రో నగరాల్లో నివసిస్తూ కేవలం సరుకు డెలివరీ చేసేందుకే హైదరాబాద్ నగరానికి వస్తున్నాయి” అని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మాదకద్రవ్యాలు రవాణా చేసేవారిలో చాలా మంది బెయిల్‌ను పొందడమో లేక చిక్కకుండా ఉండడమో జరుగుతోందని ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ తన పత్రము(డోసియర్)లో పేర్కొంది.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా గ్యాంగుల్లో బాగా ప్రముఖంగా ఉన్న ఎబుకా గ్యాంగ్‌పైన గోల్‌కొండ, అమీర్‌పేట్, నాంపల్లి, ముషీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్లలో కేసులు రిజిష్టర్ అయి ఉన్నాయని కూడా ఆ పత్రం పేర్కొంది. ఆ ఎబుకా గ్యాంగుకు నైజీరియాకు చెందిన డివైన్ ఎబుకా సుజీ నాయకత్వం వహిస్తున్నాడు. అతడు తరచూ హైదరాబాద్, బెంగళూరు మధ్య మకాం మారుస్తుంటాడు.
అతడి గ్యాంగు చెందిన చాలా మంది ఇతర సభ్యులు పోలీసులకు చిక్కకుండా ఉన్నారు. ఆ గ్యాంగుకు మాదకద్రవ్యాలు సరఫరా చేసే డాండీ ముంబయిలో ఉంటున్నాడని భావిస్తున్నారు. అతడు బ్రెజిల్‌కు చెందిన వ్యక్తి. నగరంలో మాదకద్రవ్యాలు అమ్ముతున్నగ్యాంగుకు ఆంధ్రప్రదేశ్, పుదుచ్ఛేరిలతో కూడా కనెక్షన్ ఉంది. కాగా ఎళే చిది, సయీద్ గ్యాంగ్‌లకు ఢిల్లీ, గోవాలతో సంబంధాలున్నాయి. కాగా పీటర్సన్ గ్యాంగ్, చుక్స్ గ్యాంగ్, లెస్మ్ గ్యాంగ్ బెంగళూరు, ముంబయిల నుంచి పనిచేస్తున్నాయని, వీటికి అబ్లే ఇమాన్యూల్, ఉముడు, జేమ్స్ మారిసన్ నాయకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ గ్యాంగులు ఒక గ్రాము కొకైన్‌ను రూ. 6000 మొదలుకుని రూ. 7000 వరకు ధరలో అమ్ముతున్నారని సమాచారం.