Friday, December 20, 2024

కాటు వేస్తున్న మత్తు మందులు

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన మాదక ద్రవ్యాల విష సంస్కృతి ఇప్పుడు భారత దేశంలోనూ వేళ్లూనుకుని నలుమూలలకూ విస్తరిస్తోంది. ప్రతి రోజూ దేశంలో ఏదో ఒక మూల ఎవరో ఒకరు మాదకద్రవ్యాలకు బలయ్యారని, భారీ యెత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారని పత్రికల్లో వార్తలు రావడం సర్వసాధారణమైపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు వీటికి అతీతం కాదన్న సంగతి తాజాగా వెలుగు చూసిన ఉదంతాలతో తేటతెల్లమైంది. లక్షల కోట్ల విలువైన 25 వేల కిలోల మాదక ద్రవ్యాలు విశాఖ పోర్టుకు దిగుమతి అయ్యాయన్న సంగతి కాక రేపుతోంది. డ్రగ్స్‌కు పుట్టినిల్లుగా పేరుపడిన బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుంచి కాకినాడకు చెందిన ఒక ఆక్వా ఎక్స్‌పోర్టు సంస్థకు ఇవి సరఫరా అవుతున్నట్లు సిబిఐ గుర్తించింది. ఇక హైదరాబాద్ శివార్లలో ఏకంగా మాదకద్రవ్యాల తయారీయే గుట్టుగా సాగిపోతోందన్నది మరింత కలవరం కలిగిస్తున్న విషయం. రసాయనాల తయారీ ముసుగులో మెథపెడ్రోన్ అనే మాదకద్రవ్యాన్ని తయారు చేస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఈ మత్తు మందును సిగరెట్లు, మాత్రలు, ఇంజెక్షన్ల రూపంలో వినియోగిస్తారు. ఇక్కడనుంచి ఐరోపా దేశాలకు ఈ మత్తు మందును ఎగుమతి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నా, ఇంటర్ పోల్ అప్రమత్తం చేసేంత వరకూ మన రక్షక భటులకు, నార్కోటిక్స్ విభాగానికీ తెలియకపోవడం విడ్డూరం. వ్యసనం ఏదైనా.. అలవాటు పడితే వదిలించుకోవడం కష్టం. మాదకద్రవ్యాలుగా వ్యవహరించే ఓపియం, కొకైన్, హెరాయిన్, మార్ఫిన్, ఎల్.ఎస్.డి వంటివి మనిషిని పీల్చి పిప్పి చేసేవరకూ వదలవు. మత్తు మందుల ముఠాలు అత్యధిక జనాభా కలిగిన ఆసియా దేశాలను తమకు స్వర్గధామాలుగా భావిస్తూ ఉంటాయి. ప్రజలకు వీటిని అలవాటు చేస్తే జనసాంద్రత కలిగిన దేశాల్లో తమ మార్కెట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుందన్నది వారి ఆలోచన. కొకైన్, మేథాడోన్, హెరాయిన్ వంటి ఖరీదైన మాదకద్రవ్యాలు ధనిక వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మధ్యతరగతి ప్రజానీకానికి వీటిని చేరువ చేసేందుకు అడ్డదారిగా గంజాయిని ఉపయోగించడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. పోలీసుల కన్నుగప్పి, అంతరపంటగా గంజాయిని సాగు చేసి, దాన్ని యువతరానికి అలవాటు చేసి, ఆ తర్వాత ఖరీదైన మత్తు మందులకు బానిసలను చేస్తున్నారు. జగిత్యాలలో జరిగింది అదే. హైస్కూలులో చదువుకునే అన్నెం పున్నెం ఎరుగని అమాయక బాలికలకు గంజాయి అలవాటు చేసి, తర్వాత వారిని డ్రగ్స్‌కు బానిసలుగా చేసి, వారితో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న తీరు ఘోరం, దారుణాతి దారుణం. కొందరు యువకులు మత్తు మందులకు బానిసలుగా మారడమే కాదు, డ్రగ్స్ విక్రయాన్ని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో పట్టుబడిన ఓ వ్యక్తి మాదకద్రవ్యాల విక్రయంతో కోట్లు సంపాదించినట్లు వెల్లడి కావడం ఈ కోవకే చెందుతుంది. ఒకప్పుడు రహస్య ప్రదేశాల్లో గుట్టుగా సాగిన మత్తుమందుల విక్రయం ఇప్పుడు విచ్చలవిడిగా బహిరంగంగానే జరుగుతోంది. కిరాణా దుకాణాల్లోనూ గంజాయి చాక్లెట్లు లభ్యమవుతున్నాయంటే పరిస్థితి ఎంత విషమించిందో అర్థం చేసుకోవచ్చు.

యువత సిగరెట్లు, మద్యపానంతో మొదలుపెట్టి, క్రమంగా డ్రగ్స్‌కు చేరువవుతోందని, మత్తు మందులు కేంద్ర నాడీవ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా, మెదడు, గుండె పనితీరుపైనా ప్రభావం చూపుతాయని డాక్టర్లు, మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పబ్బుల్లోనూ, క్లబ్బుల్లోనూ వినోదం వెతుక్కుంటున్న యువత డ్రగ్స్ వాడకంవల్ల తలెత్తే అనర్థాలను గుర్తించడం లేదు. మత్తు మందులు తమ భవిష్యత్తును చిత్తు చేస్తాయన్న ఇంగితజ్ఞానం వారిలో కొరవడుతోంది. దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ మత్తు మందుల వాడకంలో అగ్రగామిగా ఉంది. రాష్ట్రంలో 29 లక్షల పైచిలుకు జనాభా ఏదో ఒక మత్తు మందుకు అలవాటు పడినట్లు అంచనా. 17 లక్షల మందితో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు పెద్దలు. ముక్కుపచ్చలారని బాలబాలికలను సైతం కాటు వేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని కూకటివేళ్లతో సహా పెకలించివేసేందుకు ప్రభుత్వాలు పటుతరమైన చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది.

డ్రగ్స్ ను అరికట్టే విషయంలో రాజకీయాలను, స్వప్రయోజనాలను పక్కనబెట్టి కార్యాచరణకు నడుం బిగించినప్పుడే కార్యసిద్ధి చేకూరుతుంది. తెలంగాణలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను బలోపేతం చేసి, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టడం ముదావహం. ప్రభుత్వ పెద్దలూ, పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఒక్కటై డ్రగ్ విక్రేతల ఆటకట్టించకపోతే మత్తు మందులకు యువత బానిసలై నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News