Monday, December 23, 2024

డ్రగ్స్ వినియోగంలో సినీతారలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్ రాకెట్‌తో సినీతారలకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్ మాఫియా సూత్రధారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకల నిర్వహణ కోసం హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించడంతో పోలీసులు నిందితుల్ని వలపన్ని పట్టుకున్నారు. ముఠాలో కీలక సభ్యుల్ని అరెస్ట్ చేయడంతొో వారి నుంచి ఎవరెవరు మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారనే సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్న వారిలో వ్యాపారులతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ సినీతారలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి మరింత సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు.

హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఏర్పాటు చేసిన తర్వాత నగరానికి వివిధ మార్గాల్లో మాదకద్రవ్యాలు చేరుతుండటంపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రధానంగా గోవా నుంచి నగరానికి డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. జాతీయ, అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబధాలు ఉన్న పలువురిని పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్ 18మందిని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వారిలో ప్రీతిష్ నారాయణ్ బోర్కర్, జాన్ స్టీఫెన్ డిసౌజా , తుకారాం, ఎడ్విన్ న్యూన్స్, బాలమురుగన్, హేమంత్ అగర్వాల్, వికాస్ నాయక్, సంజయ గోవెకర్, రమేష్ చౌహాన్ వంటి కింగ్‌పిన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు అరెస్టైన వారి మొబైల్ ఫోన్ల నుంచి సేకరించిన సమాచారంతో నగరంలో దాదాపు 7వేల మందికి పైగా మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వీరిలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

పోలీసులు గుర్తించిన వారిలో 400మందిని ఎక్కువ సార్లు మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసినట్లు గుర్తించి వారికి 41ఏ సిఆర్‌పిసి ప్రకారం నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న వారిలో ఎక్కువమంది డ్రగ్ రాకెట్ కింగ్ పిన్ ఎడ్విన్ న్యూన్స్ అనుచరులేనని పోలీసులు గుర్తించారు. ఎడ్విన్ మొదలుకుని ఇటీవల అరెస్ట్ అయినా డీజే మోహిత్ వరకు ఎక్కువ మంది పబ్‌లు, హోటళ్లలో సర్వర్లుగానే తమ కెరీర్ ప్రారంభించారు. త్వరగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో డ్రగ్ విక్రయాల్లోకి అడుగుపెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. మొదట ఏజెంట్లుగా చేరి తర్వాత డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని మత్తు సామ్రాజ్యాలను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ దందాలో త్వరగా డబ్బులు సంపాదిస్తుండటంతో విలాస జీవితాలకు అలవాటు పడ్డట్లు గుర్తించారు.

ఎడ్విన్ న్యూన్స్ సినిమాలకు ఫైనాన్స్ చేసే స్థాయికి ఎదిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎడ్విన్ అనుచరుల్లో ప్రధానమైన బాలమురుగన్ హిమాచల్ ప్రదేశ్ కేంద్రంగా రాజస్థాన్,మహారాష్ట్ర, హైదరాబాద్ నగరాల్లోని పర్యాటక ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నగరంలోని ప్రముఖులకు మత్తు పదార్ధాలు అలవాటు చేసి, వారికి నమ్మకస్తుడిగా మారినట్లు గుర్తించారు. బాలమురుగన్ ద్వారా నగరంలోని ప్రముఖులు, సినీ తారలు ఖరీదైన ఛరస్‌ను కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. కవాడిగూడలో పబ్‌లో సర్వర్‌గా కెరీర్ ప్రారంభించిన మోహిత్ క్రమంగా డ్రగ్ సామాజ్యాన్ని విస్తరించాడు. అతని భార్య నేహాకు ఉన్న సినీ పరిచయాలతో గోవా నుంచి బస్సుల్లో నగరానికి డ్రగ్స్ రవాణా చేసినట్లు గుర్తించారు.

మొహిత్ అగర్వాల్ బాలీవుడ్ నటి నేహాదేశ్‌పాండేను ప్రేమ వివాహం చేసుకున్నాక ఆమె ద్వారా సినీతారలకు డ్రగ్స్ సరఫరా చేసే వాడు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని ఏర్పాటు చేసి వాటి ద్వారా మాదక ద్రవ్యాల ఉచ్చులోకి దింపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
మోహిత్‌కు ఒక రోజు కస్టడీ..
డ్రగ్స్ కేసులో పట్టుబడిన మోహిత్‌ను ఒక రోజు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో రాంగోపాల్‌పేట పోలీసులు మోహిత్‌ను గురువారం ఉదయం 10 గంటల నుంచి కస్టడీలోకి తీసుకుని సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనున్నారు. మోహిత్‌కు దాదాపు 50 మంది ప్రముఖులతో పరిచయాలున్నట్లు నార్కొటిక్ విభాగం పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు మోహిత్ సెల్‌ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్‌ను సేకరించారు. మోహిత్‌ను ప్రశ్నించడం ద్వారా వాళ్లతో అతనికి ఉన్న సంబంధాల గురించి తెలుసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
కృష్ణకిశోర్‌కు బెయిల్ మంజూరు
మోహిత్‌తో పాటు పోలీసులకు దొరికిపోయిన స్థిరాస్తి వ్యాపారి కృష్ణ కిశోర్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కృష్ణకిశోర్ గోవా, ముంబై, బెంగళూరు నుంచి డ్రగ్స్‌ను తెప్పించుకుని వినియోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో కృష్ణకిశోర్ చంచల్‌గూడ జైలు నుంచి బయటకు రానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News