‘మాదకద్రవ్యాల అక్రమ రవాణా, జాతీయ భద్రత’ అంశంపై 2022 అక్టోబర్ 8న గౌహతిలో ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, పోలీస్ డైరెక్టర్ జనరల్స్ (డిజిపిల) సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈశాన్య భారతంలో మాదకద్రవ్యాల వినియోగమే తీవ్ర సమస్య అని అన్నారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ప్రచురించిన ‘మాదకద్రవ్యాల తీవ్రత నివేదిక 2019’ ప్రకారం ఏడు ఈశాన్య రాష్ట్రాలలో నల్లమందు, గంజాయి వినియోగం ప్రమాదకర స్థాయిలో ఉంది. అది దేశంలో వాటి సగటు వినియోగం కన్నా అధికం. దేశంలో మాదకద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్ విధ్వంసానికి పన్నిన వ్యూహం విజయవంతం కావడం ఈ స్వల్ప వ్యవధిలో బాగా కానవచ్చిందని అమిత్ షా చెప్పారు.
తన వాదనకు మద్దతుగా కేంద్ర హోం శాఖ మంత్రి 2006, 2013 మధ్య 1257 కేసులు నమోదు చేసినట్లు, అవి 2014, 2022 మధ్య 152 శాతం పెరిగి 3172 కు చేరుకున్నట్లు తెలిపారు. అదే కాలంలో అరెస్టుల మొత్తం సంఖ్య 1362 నుంచి 260 శాతం పెరిగి 4888కి చేరుకున్నాయి. 2006 2013 కాలంలో 1.52 లక్షల కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అవి 20142022 కాలంలో 3.30 లక్షల కిలోలకు పెరిగాయి. 2006 2013 కాలంలో రూ. 768 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అవి 2014 2022 మధ్య 25 రెట్లు పెరిగి రూ. 20 వేల కోట్లకు చేరుకున్నాయి. అయితే, మాదకద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయని అమిత్ షా వెలువరించిన గణాంకాల ద్వారా స్పష్టం అవుతోంది.
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, మాదకద్రవ్యాలు రెండింతలు కావడం నిషిద్ధ మాదకద్రవ్యాల సప్లయర్లను, ఉత్పత్తిదారులను మరింతగా సరఫరా, సాగు చేయకుండా నిరుత్సాహపరచడం గాని, అడ్డుకోవడం గాని జరగలేదు. బ్రిటిష్ ఇండియాలోని ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో అత్యధిక విలువ చేసే సరకుల్లో నల్లమందు ఒకటి. ఆ ప్రాంతంలో నల్లమందును ప్రవేశపెట్టడం తమ వలస ప్రాంతాల్లో అధిక విలువగల సరకుల వర్తకం చేయాలనే బ్రిటిష్ విధానానికి అనుగుణంగానే జరిగింది. ఆ విధానం ముడి వస్తువులను రాబట్టడానికి, కొత్త ప్రాంతాలకు విస్తరించడానికి దోహదం చేసింది. రెండవది, వాణిజ్య పంటలు ప్రవేశపెట్టడమనే ఆ విధానం సున్నితమైంది. ఆ ప్రాంతంలో తేయాకును ‘కనుగొనడానికి’ దశాబ్దాల ముందే వాణిజ్య పంటగా నల్లమందును ప్రవేశపెట్టారు. తేయాకు తోటలతో పోలిస్తే విస్తీర్ణం తక్కువగానే ఉండేది.
రెవెన్యూ సాధించే శక్తిపరంగా నల్లమందు విలువ టీ, ఉప్పుతో పోలిస్తే అత్యధికం. చివరగా నల్లమందును ప్రభుత్వ ఆధ్వర్యంలో గుత్తాధిపత్య వాణిజ్య నెట్‌వర్క్‌ల ద్వారా విక్రయిస్తుండేవారు. నల్లమందు సాగును 1860 లో అసోంలోని బ్రిటిష్ భూభాగాల్లో నిలిపివేశారు. ఆ తరువాత నల్లమందు డిమాండ్లు అన్నిటినీ తక్కిన దక్షిణాసియా నుంచి నల్లమందు దిగుమతి ద్వారా తీర్చారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో, ప్రభుత్వ ప్రోత్సాహం గల టీ, నల్లమందు వ్యాపారాలు వనరులపై సామ్రాజ్య నియంత్రణను కొనసాగించి, రాష్ట్ర యంత్రాంగంపై ఒత్తిడి తగ్గించింది. నల్లమందు వ్యాపారంపై గుత్తాధిపత్యం శ్రామికులు/ వనరుల నియంత్రణకు, సామ్రాజ్యానికి నిధుల సమీకరణకు కీలకం. తన వ్యాపార ప్రయోజనాల విస్తరణ, సుస్థిరతకు ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో వలసవాద ప్రభుత్వం ‘నార్కో స్టేట్’ను నిర్మించింది. అసోం పోలీసులు గోల్‌పారా జిల్లాలో రూ. 27.20 కోట్లు విలువ చేసే 170 బిఘాల అక్రమ గసగసాల సేద్యాన్ని ధ్వంసం చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ మాదకద్రవ్యాల సేద్యంపై చర్యను శ్లాఘించారు.
మణిపూర్‌లో వివిధ శాంతి భద్రతల సంస్థలు 2017 2024 మధ్య 19135.60 ఎకరాల్లో అక్రమ గసగసాల సాగును ధ్వంసం చేశాయి. అక్రమ గసగసాల సేద్యంలో పెరుగుదల ఇప్పటికే సంక్షుభిత మణిపురి సమాజానికి ముప్పుగా పరిణమించింది. మాదకద్రవ్యాలపై పోరులో వాటిని కట్టడి చేయడానికి మరింతగా నిర్బంధ విధానంతోపాటు ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకున్నది. అయితే, ప్రధానంగా అక్రమ గసగసాల సేద్యాన్ని అరికట్టే విధానంగా ‘ప్రభుత్వ ‘డ్రగ్స్‌పై పోరు’ ప్రచారోద్యమంలో భాగంగా అనుసరించిన చర్యల సామర్థాన్ని సహేతుక పరిశీలకులు ప్రశ్నించారు.
స్థానికంగా అక్రమ గసగసాల సేద్యాన్ని అరికట్టడానికి ఆ చర్యలు ఏమాత్రం దోహదం చేయవని తుర్కియే, థాయిలాండ్ వంటి దేశాల్లోను, అఫ్ఘానిస్తాన్‌లో నల్లమందుపై తాలిబన్ నిషేధం నేర్చుకున్న గుణపాఠాలు సూచిస్తున్నాయి. నిర్బంధ చర్యల వినియోగంలో అఫ్ఘానిస్తాన్, థాయిలాండ్, లావోస్‌లలో కేసులు ఈ దృక్పథం లోపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. అది ‘గాలిబుడగ ప్రభావానికి’ దారి తీస్తుంది. అక్రమ సాగును కనిపెట్టలేనంత బలహీనంగా ప్రభుత్వ యంత్రాంగం ఉనికి ఉన్న మారుమూల ప్రాంతాలకు రైతులు వెళుతున్నారు. ఇప్పుడు ఉన్న నెట్‌వర్క్‌లను బలహీనపరచడానికి బదులు అది నల్లమందు ఉత్పత్తి, వర్తకాన్ని పర్యవేక్షించేందుకు, గుత్తాధిపత్యం వహించేందుకు జరిగే ఏ ప్రయత్నాన్నైనా తిప్పికొట్టే ఎత్తుగడలను ప్రోత్సహిస్తోంది. అంతేకాదు, రహస్యంగా వ్యవహరించేందుకు వారిని పురికొల్పుతోంది, ఆవిధంగా మార్కెట్ చేరుకోవడానికి పోలీసుల నిఘా తప్పించుకుని సాగేందుకు తమ నెట్‌వర్క్ వ్యవస్థను పటిష్ఠం చేసుకుంటున్నారు. అటువంటి ప్రభావాలను గమనించవచ్చు.
మణిపూర్‌లో గత కొన్ని సంవత్సరాల్లో అక్రమ గసగసాల సాగులో కనీవినీ ఎరగని పెరుగుదల కానవచ్చింది. చాలా వరకు షెడ్యూల్డ్ తెగలు నివసించే రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో గసగసాల సాగు పెరిగింది. మణిపూర్ పోలీస్ శాఖలో ఒక విభాగం నార్కోటిక్, అఫైర్స్ బోర్డర్ (ఎన్‌ఎబి) సమాచారం ప్రకారం, అక్రమ గసగసాల సాగు ప్రదేశాలు ప్రధానంగా ఉఖ్రుల్, సేనాపతి, కాంగ్‌పోక్పి, కామ్‌జోంగ్, చురాచాంద్‌పూర్, తెంగ్‌నౌపల్ పర్వత జిల్లాల్లో కేంద్రీకృతమైంది. 2020 నుంచి సమాచారం నమోదు చేసిన 2021 ఫిబ్రవరి వరకు 1420 ఎకరాల గసగసాల తోటలను శాంతి భద్రతల సంస్థలు ధ్వంసం చేశాయి. 201719 త్రైవార్షిక సమయంలో మణిపూర్ పోలీసులు 2858 ఎకరాల గసగసాల సాగు విస్తీర్ణాన్ని ధ్వంసం చేశారు. మణిపూర్‌లో డ్రగ్స్ దుర్వినియోగం తీవ్ర స్థాయిలో కలవరం కలిగిస్తోంది. అది యువజనులు, పిల్లలతో సహా సమాజంలోని ప్రతి వర్గాన్ని అది ఆవహించింది. కొన్ని సార్లు తుదకు అధికారులు, రాజకీయ నేతలు కూడా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడ్డారు. మాదకద్రవ్యాల సూత్రధారి అరెస్టుపై మణిపూర్ పోలీస్ అధికారి, అధికార పార్టీకి చెందిన ఒక రాజకీయ నాయకుని మధ్య ఇటీవల నెలకొన్న ప్రతిష్టంభన మణిపూర్‌లో మాదకద్రవ్యాలు ఎంతగా చొచ్చుకుపోయాయో, అవినీతి ఎంతగా ప్రబలిందో వెలుగులోకి తెచ్చింది.
ప్రతి భృతిగా ఏకకాల నగదు ప్రోత్సాహకాలు, ధ్వంసం చేసిన పంటలకు పరిహారం, ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవకాశం వంటివి ప్రవేశపెట్టడం గసగసాల మొక్కల అకస్మాత్ ధ్వంసం కన్నా రైతుల అవసరాలపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. ప్రధాన స్రవంతి వ్యవసాయంతో పోలిస్తే గసగసాల సేద్యం ఒక విధంగా తేలిక. ఈ పంటను ఏడాదికి రెండు సార్లు సాగు చేయవచ్చు. వేసవి ఆరంభంలో, శీతాకాలంలో ఇది కోతకు వస్తుంది. అత్యంత నిరుపేదలు ఎక్కువగా ఉన్న ఆదివాసీ రైతులు తమకు ప్రభుత్వం అండలేని కారణంగా మారుమూల పర్వత ప్రాంతాల్లో గసగసాల సాగును ఇష్టపడుతున్నారు. ఝుమియాలకు భూమి తేలికగా లభిస్తున్నందున ఇతర పంటలతో పాటు గసగసాల సేద్యం సులభం. దారిద్య్రమే గ్రామీణ ప్రాంతాల్లో గసగసాల సేద్యానికి ప్రధాన కారకంగా ఉంటోంది. రాష్ట్ర యంత్రాంగం వైఫల్యం కూడా ఇందుకు ఒకింత కారణం. దశాబ్దాలుగా సాగుతున్న సాయుధ సంఘర్షణలు, తిరుగుబాటు సమస్యలు, జాతుల హింసాకాండ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది, ఇది నిరుపేదలను మరింతగా ఇక్కట్ల పాల్జేసింది.
వివిధ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు అమలు పరుస్తున్నప్పటికీ అవి చివరి లబ్ధిదారులకు ఉపయుక్తం కావడంలేదు. పైగా, పిల్లలకు మెరుగైన విద్య అందించాలన్న, ఆధునిక సాధనాలు, టెక్నాలజీ సమకూర్చుకోవాలన్న అభిలాష ఆధునిక సమాజంలో ఎక్కువ ప్రాధాన్యం పొందుతోంది. ఆ క్రమంలో ఆహార పంటల సాగు గ్రామీణ ఆదివాసీ కుటుంబాల అవసరాలను తీర్చలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు మనుగడ కోసం తంటాలు పడుతున్నారు, మెరుగైన ఆదాయ వనరు కోసం పోటీపడుతున్నారు. స్వల్ప వ్యవధిలో పేదరికం నుంచి విముక్తం కావడానికి గ్రామీణ కుటుంబాలకు గసగసాల సేద్యం ‘మ్యాజిక్ కషాయం’గా ఉపయోగపడుతోంది. ఆర్థిక, ఆహార భద్రత కల్పనకు, పరపతి/ రుణాల లభ్యతకు అది మరింత ఉపయుక్తంగా వారికి కనిపిస్తోంది. తమ పంట (గసగసాలు) విక్రయం వల్ల మంచి ఆదాయం లభిస్తుందని తెలుసు కనుక తమకు డబ్బు అప్పు ఇవ్వడానికి జనం వెనుకాడడం లేదని స్థానిక మీడియా ఇంటర్వూ చేసిన ఒక గసగసాల రైతు చెప్పాడు.
అంతే కాకుండా, ఆ సేద్యం మణిపూర్ గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున వ్యవసాయ పద్ధతిగా మారిపోయింది. పేదరికం నుంచి విముక్తులైన వారు కూడా తమ కొత్త జీవన స్థితిగతులు కొనసాగించేందుకు గసగసాల సాగును కొనసాగించారు. ఈ అటవీ ప్రాంతంలో క్రియాశీలకంగా ఉన్న మాదకద్రవ్యాల వర్తకానికి రాజకీయ సరిహద్దులు లేవు. హెరాయిన్ వంటి, నల్లమందు, గసగసాల నుంచి తయారైన అన్ని రకాల డ్రగ్స్‌ను ఈ ప్రాంతంలో అధికారులు ఎప్పటికప్పుడు స్వాధీనం చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు, వాణిజ్యవేత్తలు, పోలీస్, మిలిటరీ అధికారులను అరెస్టు చేశారు. ఇది మణిపూర్‌లో ఈ సమస్య ఎంతగా ప్రబలిందో తేటతెల్లం చేస్తోంది. అయితే, 2017 నుంచి పర్వత ప్రాంత జిల్లాల్లో గసగసాల సాగుపై మణిపూర్ ప్రభుత్వం నిరంతరం ఉక్కుపాదం మోపుతుండడం ఈ వివాదాస్పద పంట పండిస్తున్న ఆదివాసీ రైతుల్లో ఆగ్రహాన్నిపెంచుతోంది.
జాతుల మధ్య సంఘర్షణలు ప్రజ్వరిల్లడానికి ఐదు మాసాల ముందు 2022 డిసెంబర్‌లో గసగసాల పొలాలను ధ్వంసం చేసే భారీ కార్యక్రమం కోతల సీజన్‌లోనే జరిగింది. దీనితో ఆరు నెలల సేద్యంనుంచి డబ్బు ఆర్జించాలన్న ఆశలు అన్నీ అడుగంటాయి. కొండ తెగలవారు, ముఖ్యంగా భారత, మయన్మార్ సరిహద్దుకు రెండు వైపుల చారిత్రకంగా నివసిస్తున్న కుకి జోమి తెగవారు భారత వ్యతిరేక విదేశీశక్తుల మద్దతులో తిరుగుబాటు వర్గాల సాయంతో మణిపూర్‌లో అస్థిరత సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని మణిపూర్‌లోని అధికార పార్టీ వినిపిస్తున్న కథనం మణిపూర్‌లోని దుర్బల కొండ తెగలవారిని ఆర్థికంగా, సాంఘికంగా పరిరక్షించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే యత్నంగా కనిపిస్తోంది.
గీతార్థ పాఠక్
(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)