న్యూఢిల్లీ: రూ.4 లక్షల లంచం తీసుకుంటూ జాయింట్ డ్రగ్స్ కంట్రోలర్ ఎస్ ఈశ్వర రెడ్డి సిబిఐ అధికారులకు చిక్కారు. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ని నియంత్రించం కోసం బయోకాన్ బయోలాజిక్స్ తయారు చేసిన ఇన్సులిన్ ఆస్పార్ట్ ఇంజెక్షన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌ను మాఫీ చేసేందుకు రూ. 4 లక్షల లంచం తీసుకుంటున్న ఈశ్వర రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేసినట్లు మంగళవారం అధికారులు వెల్లడించారు. కిరణ్ మజుందార్ షా సారథ్యంలోని బయోకాన్‌కి అనుబంధ సంస్థ అయిన బయోకాన్ బయోలాజిక్స్ ఈ ఆరోపణలను ఖండించింది. ఈశ్వర రెడ్డికి లంచం ఇస్తుండగా సినర్జీ నెట్‌వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ దినేష్ దువాను కూడా సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో సోమవారం ఈశ్వర రెడ్డి, దువాలను రెడ్‌హ్యాండెడ్‌గా వలవేసి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. బెంగళూరుకు చెందిన బయోకాన్ బయోలాజిక్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ ప్రవీణ్ కుమార్, ఢిల్లీకి చెందిన బయోఇన్నోవట్ రిసెర్చ్ సర్వీసెస్ డైరెక్టర్ గుగ్ సేఠిపై కూడా సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు.
Drugs Controller Ishwar Reddy Arrested by CBI