రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో తవ్వుతున్నకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. హోటల్ మీద పోలీసులు దాడి చేసిన వెంటనే సిబ్బంది సిసి టీవీ ఫుటేజీని మాయం చేసి, డిలీట్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. పైగా హోటల్ లో 200 సిసి టీవీలు ఉండగా కేవలం 16మాత్రమే పనిచేస్తున్నాయని, మిగతా 184 కెమెరాలు పనిచేయట్లేదని పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరాదారు అబ్బాస్ ఇప్పటివరకూ రాడిసన్ హోటల్ కు పదిసార్లు మత్తుమందు సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది.
రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో లిషి గణేశ్, శ్వేత అనే సెలబ్రిటీల పేర్లు ఇప్పటివరకూ బయటకు వచ్చినా మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఈ పార్టీకి వచ్చి ఉండవచ్చనని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా పార్టీకి హాజరైనట్లు వెల్లడైన ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి బుధవారం విచారణకు డుమ్మా కొట్టారు. తాను విచారణకు రాలేకపోతున్నాననీ, శుక్రవారం తప్పకుండా వస్తానని క్రిష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటివరకూ రాడిసన్ హోటల్ యజమాని కుమారుడు వివేకానందతోపాటు కేదార్, నిర్భయ్ అరెస్టయిన సంగతి తెలిసిందే.