సిటిబ్యూరోః డ్రగ్స్‌కు బానిసైన ఓ యువతిని డ్రగ్స్ విక్రయిస్తున్న వారు వేధించడంతో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పబ్బుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన గచ్చిబౌలి, మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు వారి వద్ద నుంచి 10గ్రాముల కొకైన్, 13 గ్రాముల ఎండిఎంఏ, ఐదు మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, యూసుఫ్‌గూడకు చెందిన సులేమాన్ బిన్ అబూబాకర్ అలియాస్ వాసీం, మెహిదీపట్నానికి చెందిన షేక్ అర్మాన్ అలియాస్ మోసిన్, మోసిన్ చిక్కి, అర్కామమ్ హుస్సేన్ అలియాస్ అర్కం హుస్సేన్,నిజాంపేటకు చెందిన మితునా డ్రగ్స్ తీసుకునేది, కొనగాల ప్రియ, డాక్టర్ చల్లా చైతన్య కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నారు. వీరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఉస్మాన్ అలియాస్ ఫైజల్, అజీం, అబ్దుల్లా అలియాస్ అబ్దుల్ రెహ్మన్ పరారీలో ఉన్నారు.
నిందితుల వద్ద డ్రగ్స్‌కు బానిసగా మారిన మహిళ డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకునేది. డ్రగ్స్ విక్రయిస్తున్న నిందితులు ఫోన్లు చేసి బెదిరించేవారు. తమ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేయాలని తరచూ ఫోన్ చేసి వేధించేవారు. వారి వేధింపులు రోజు రోజుకు ఎక్కువ కావడంతో భరించలేక బాధితురాలు బాచుపల్లి ఉమెన్ పోలీస్ స్టేషన్, షీటీమ్స్ సైబరాబాద్‌ను సంప్రదించి అసలు విషయం చెప్పింది. దీంతో గచ్చిబౌలి, మాదాపూర్ ఎస్‌ఓటి, టిఎస్‌నాబ్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు. సులేమాన్ బిన్ అబూబాకర్, షేక్ అర్మాన్, హుస్సేన్ స్నేహితులు. ముగ్గురు నిందితులు పబ్బుల చుట్టూ తిరుగుతూ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. నోవాటెల్ ఆర్టిస్ట్రీ, ఎయిర్ లైవ్, క్లబ్ రౌగ్, క్లబ్ రాక్ పబ్బుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారు. బెంగళూరు, ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకుని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వీరికి ఉస్మాన్, అజీం, అబ్దుల్లా డ్రగ్స్ విక్రయిస్తున్నారు, వీరు పరారీలో ఉన్నారు.
నిందితులు తమ డ్రగ్స్ సప్లన్ మరింత పెంచేందుకు మిథున, ప్రియా, రతన్, సాహిల్‌ను కలిశారు. వారికి కొకైన్‌ను రూ.15,000, ఎండిఎంఏను రూ.8,000లకు విక్రయిస్తామని చెప్పారు. గోవా కంటే బెంగళూరుకు చెందిన అజీం తక్కువ ధరకు డ్రగ్స్ విక్రయిస్తుండడంతో సులేమాన్, అబూబాకర్, షేక్ అర్మాన్ బెంగళూరు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకుని వచ్చారు. వీరి డ్రగ్స్ ఆర్డర్ చేసిన మిథునా తీసుకోవడానికి రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.