ఏడుగురు నిందితులను పట్టుకున్న పోలీసులు
రూ.16లక్షల విలువైన 98 గ్రాముల కొకైన్ సీజ్
డెకాయ్ ఆఫరేషన్ నిర్వహించిన నగర పోలీసులు
వివరాలు వెల్లడించిన నగర సిపి సివి ఆనంద్
హైదరాబాద్: డ్రగ్స్ విక్రయిస్తున్న మూడు ముఠాలను నగర పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.16లక్షల విలువైన 98 గ్రాముల కొకైన్, 45 గ్రాముల ఎండిఎంఏ, ఎక్స్‌టసీ పిల్స్, 17 ఎల్‌ఎస్‌డి బోల్ట్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర, ముంబాయి, అంధేరి వెస్ట్, గిల్‌బర్ట్ హిల్ రోడ్డుకు చెందిన ఇమ్రాన్ బాబు షేక్ అక్వేరియం తయారు చేస్తున్నాడు డ్రగ్స్ విక్రయిస్తున్నాడు, నూర్ మహ్మద్ ఖాన్ టైలర్‌గా పనిచేస్తున్నాడు. ఇమ్రాన్ బాబు షేక్‌కు నైజీరియాకు చెందిన డ్రగ్స్ విక్రేత టోనితో పరిచయం ఉంది. టోని హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఇమ్రాన్ డ్రగ్స్ విక్రయించేందుకు లోకల్‌గా ఏజెంట్లను టోనీకి పరిచయం చేశాడు. నగరంలో టోని డ్రగ్స్ సరఫరా చేసేందుకు ఓయో రూముల్లో బసచేసేవాడు.
ఈ క్రమంలోనే నూర్‌మహ్మద్ ఖాన్‌ను డ్రగ్స్ సరఫరా చేసేందుకు నగరానికి పంపించాడు. నగరానికి వచ్చిన నూర్ కొకైన్‌ను గ్రాముకు రూ.10,000లకు విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో నార్త్‌జోన్ పోలీసులు, పంజాగుట్ట పోలీసులు కలిసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కొకైన్ 83 గ్రాములు, రెండు మొబైల్ ఫోన్లు, రూ.30,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో చాదర్‌ఘాట్‌కు చెందిన సయిద్ ఖైసర్ హుస్సేన్ మార్బుల్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. గుజారాత్‌కు చెందిన సయిద్ రషీద్ అహ్మద్ ఖాన్ స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు, ముంబాయికి చెందిన నజ్‌బుళ్లా హసన్ షేక్ ఓలా క్యాబ్ డ్రైవర్. ముగ్గురు కలిసి నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్నారు. వీరి వద్ద నుంచి 15గ్రాముల కొకైన్, 45గ్రాములు ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
సయిద్ ఖైసర్ హుస్సేన్ అంతరాష్ట్ర డ్రగ్స్ విక్రేతలు సయిద్ రషీద్, నజ్‌బుల్ హసన్ షేక్‌తో ప్లాన్ వేసి నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ముంబాయిలో రూ.3,000లకు కొనుగోలు చేసి నగరంలో రూ.10,000 గ్రాము విక్రయిస్తున్నారు. నారాయణగూడలోని శాంతి థియేటర్ వద్ద డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తుండగా నారాయణగూడ పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఈసిఐఎల్, దమ్మాయిగూడ, అనిరూద్, భద్రాద్రికొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంకు చెందిన అవినాష్ నిరుద్యోగి, ఇద్దరు కలిసి ఎల్‌ఎస్‌డి బ్లోట్స్, ఎక్ట్‌సి పిల్స్ విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో ఇద్దరు యువకులను తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేశారు.
డ్రగ్స్ తీసుకుంటన్న వారి వివరాలు సేకరిస్తున్నాంః సివి ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్
నగరంలో డ్రగ్స్ తీసుకుంటున్న వారి వివరాలు సేకరిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. నైజీరియాకు చెందిన టోనీ నగరంలో డ్రగ్స్ దందా చేస్తున్నాడని, ఏజెంట్లను నియమించుకుని అన్ని రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని తెలిపారు. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ సరఫరాదారులను హైదరాబాద్‌కు రప్పించినట్లు తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారిని ఇన్ని రోజులు బాధితులుగా మానవీయకోణంలో చూశామని, ఇక నుంచి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. చట్టప్రకారం డ్రగ్స్ తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రగ్స్ డిమాండ్‌ను తగ్గిస్తే సరఫరాను అడ్డుకోవచ్చని తెలిపారు.